Begin typing your search above and press return to search.

87126 72222 ఈ నెంబరు మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి

ఇలాంటి వేళ.. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్ సీఎస్ బీ) వారు సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 12:33 PM GMT
87126 72222 ఈ నెంబరు మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి
X

87126 72222. ఏమిటీ నెంబరు ప్రత్యేకత? దీన్ని ఫోన్ లో తప్పనిసరిగా సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అన్న సందేహం హెడ్డింగ్ చదివినంతనే రావొచ్చు. ఇవాల్టి రోజున సైబర్ నేరాలు ఎంతలా పెరిగిపోతున్నాయో తెలిసిందే. హస్త భూషణంగా మారిన సెల్ ఫోన్ దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం.. అడుగు తీసి అడుగు వేయాలంటే ఫోన్ తోనే పని అయ్యే రోజులు వచ్చేసిన వేళ.. దాని భద్రతకు అవసరమైన అస్త్రాలు ఫోన్ లో ఉంచుకోవాల్సిందే.

జేబులో వాలెట్ లేకున్నా ఫర్లేదు.. సెల్ ఫోన్ ఉంటే సరిపోతుందన్న పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇదిలా ఉంటే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటి వేళ.. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్ సీఎస్ బీ) వారు సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. సైబర్ నేరాల నియంత్రణకు అనుమానాస్పద వెబ్ లింకులతో వచ్చే మెసేజ్ ల కారణంగా నష్టపోతున్న వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ కావటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ తరహా నేరాలకు చెక్ పెట్టేందుకు వీలుగా టీఎస్ సీఎస్ బీ సరికొత్త వ్యవస్థను సిద్ధం చేసింది. అనుమానాస్పద వెబ్ లింకులు మీ ఫోన్ కు వచ్చినంతనే వాటిని గురించి తక్షణం కంప్లైంట్ చేసేందుకు వీలుగా 87126 72222 నెంబరుతో వాట్సాప్ సేవల్ని ఏర్పాటు చేసింది. అనుమానాస్పద వెబ్ లింకులు మీ ఫోన్ కు వచ్చినంతనే.. వాటి గురించి ఈ ఫోన్ లో వాట్సాప్ కు సమాచారం అందిస్తే.. పోలీసులు రంగంలోకి దిగి వాటి సంగతి తేలుస్తారు.

ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువ కావటం.. వాటికి సంబంధించిన ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ సేవల్ని షురూ చేశారు. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు ఈ తరహా కంప్లైంట్లు 1377 రాగా.. వాటిని పరిశీలించిన పోలీసులు సదరు లింకుల నిర్వీర్యానికి వినతులు పెట్టారు. ఇప్పటివరకు 299 వెబ్ సైట్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా పొరపాటున పిర్యాదు చేసినా.. వాటికి సంబంధించిన చర్యలు ఉండవు. ఒకవేళ.. మీరు పంపిన లింకులు అనుమానాస్పదంగా ఉన్న పక్షంలో వాటిని తొలగించేలా చర్యలు తీసుకుంటారు. సో.. ఇప్పుడు చెప్పండి 87126 72222 ఈ నెంబరు మీ ఫోన్ లో సేవ్ చేసుకోవటం అవసరమే కదా?