సోషల్ మీడియా శక్తితో చిన్నారి పునర్విక శ్రీకి పునర్జన్మ
#SavePunarvika గత కొద్దిరోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికలపై మార్మోగి, ఓ నెలల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ప్రజలను ఒకే దిశగా కదిలించింది
By: Sravani Lakshmi Srungarapu | 25 Feb 2026 1:00 PM ISTసోషల్ మీడియాకు ఎంత శక్తి ఉందనేది మరోసారి నిరూపితమైంది. #SavePunarvika గత కొద్దిరోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వేదికలపై మార్మోగి, ఓ నెలల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ప్రజలను ఒకే దిశగా కదిలించింది. రూపాయి రూపాయిగా చేరిన విరాళాలు అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేశాయి. అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు ఇప్పుడు ట్రీట్‌మెంట్ హోప్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
SMA టైప్-1తో బాధ పడుతున్న పునర్విక
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్‌కుమార్- పుష్పావతి దంపతుల కుమార్తె పునర్వికశ్రీకి డాక్టర్లు SMA టైప్-1 వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. కోట్లలో ఒకరికి మాత్రమే వచ్చే ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్ ఖర్చు సుమారు రూ.16 కోట్లు అవుతుందని మొదట పేర్కొన్నారు. పేద కుటుంబానికి చెందిన సురేష్‌కుమార్‌కు అంత భారీ మొత్తం సమకూర్చడం అసాధ్యంగా కనిపించింది. ప్రభుత్వాన్ని ఆశ్రయించినప్పటికీ టైమ్ చాలా కీలకమని డాక్టర్లు చెప్పడంతో ఆ ఫ్యామిలీ ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురైంది.
కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియా
సరిగ్గా అదే టైమ్ కు సోషల్ మీడియా రంగంలోకి దిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు పాప పరిస్థితిని ప్రజలకు వివరించి క్రౌడ్ ఫండింగ్ ను ప్రారంభించారు. వీడియోలు, రీల్స్, లైవ్ సెషన్లు, పర్సనల్ రిక్వెస్టులతో క్యాంపెయిన్లు చేసి దీన్నొక ఉద్యమంలాగా నిర్వహించారు. అందులో భాగంగా ఒక్క ఇన్ఫ్లుయెన్సరే సుమారు రూ.కోటిన్నర పైగా సేకరించడమంటే మాటలు కదు. మొత్తంగా ప్రజల విరాళాల రూపంలో రూ.8,53,29,500 చేరాయి. ప్రభుత్వం నుంచి కూడా మిగిలిన సాయం అందడంతో చికిత్సకు అవసరమైన మొత్తం డబ్బు సమకూరినట్టైంది.
డబ్బులు సమకూరాయని చెప్పిన పునర్విక తండ్రి
పునర్విక ఇంజెక్షన్ కు డబ్బులు పూర్తిగా సమకూరాయని పాప తండ్రి సురేష్ కుమార్ వీడియో ద్వారా వెల్లడించారు. ఇకపై ఎవరూ విరాళాలు ఇవ్వవద్దని, ఫండింగ్ నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తమే సేకరించామని, మిగిలిన డబ్బులను ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సహాయంగా అందిస్తామని, సేకరించిన దానిలో తాను రూపాయి కూడా తీసుకోనని స్పష్టం చేశారు. పాప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, త్వరలో పాప హెల్త్ కండిషన్ పై పూర్తి డీటెయిల్స్ ను తెలియజేస్తామని చెప్పారు. అంతేకాదు, మొదట చెప్పిన రూ.16 కోట్ల ఖర్చు కాకుండా రూ.10 కోట్ల లోపే ఇంజెక్షన్ అందే అవకాశాలున్నట్టు కూడా సురేష్ కుమార్ తెలిపారు.
దీంతో ఈ ఘటన సోషల్ మీడియా శక్తికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఒక సాధారణ కుటుంబం సమస్యను రాష్ట్రాల సరిహద్దులు దాటి లక్షల మందికి చేరవేసి, కొద్దిరోజుల్లోనే కోట్ల రూపాయలు సేకరించడం డిజిటల్ యుగంలో సామాజిక బాధ్యత ఎలా పని చేస్తుందో చూపించింది. మరీ ముఖ్యంగా ఈ విషయంలో యూత్ రెస్పాన్స్ కీలక పాత్ర పోషించింది. చిన్న చిన్న విరాళాలు కలిసి ఒక ప్రాణాన్ని కాపాడగలవని #SavePunarvika ఉద్యమం ప్రూవ్ చేయగా, సోషల్ మీడియా వేదికలు కేవలం ఎంటర్టైన్మెంట్ కు మాత్రమే కాకుండా, సమాజ హితానికి కూడా ఉపయోగపడతాయని ఇది నిరూపించింది. సోషల్ మీడియాను సరైన దిశలో ఉపయోగిస్తే అది ఎంత శక్తివంతమైన మార్పుకు దారి తీస్తుందో పునర్విక కథ మరోసారి స్పష్టం చేసింది.
