Begin typing your search above and press return to search.

విద్యుత్ అవసరం లేని సరికొత్త ఏసీ: ఉప్పు- సూర్యరశ్మితో గదులు కూల్ అయ్యే సాంకేతికత

ప్రస్తుతం పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) అనేది విలాసం నుండి సాధార‌ణ‌ అవసరంగా మారిపోయింది.

By:  Sivaji Kontham   |   24 April 2026 2:00 PM IST
విద్యుత్ అవసరం లేని సరికొత్త ఏసీ: ఉప్పు- సూర్యరశ్మితో గదులు కూల్ అయ్యే సాంకేతికత
X

ప్రస్తుతం పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) అనేది విలాసం నుండి సాధార‌ణ‌ అవసరంగా మారిపోయింది. అయితే పెరుగుతున్న విద్యుత్ బిల్లులు, పర్యావరణ కాలుష్యం వంటి సవాళ్లకు చెక్ పెట్ట‌డం ఎలానో ప్ర‌పంచానికి అర్థం కావ‌డం లేదు. అయితే ఇప్పుడు దీనికి సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కేఏయుఎస్ టి) పరిశోధకులు ఒక వినూత్న శీతలీకరణ వ్యవస్థను అభివృద్ధి చేశారు. నెస్కోడ్ (నో ఎల‌క్ట్రిసిటీ అండ్ స‌స్టైన‌బుల్ కూలింగ్ ఆన్ డిమాండ్) గా పిలవబడే ఈ సాంకేతికత విద్యుత్ సహాయం లేకుండా కేవలం ఉప్పు, నీటి కలయికతో గదులను చల్లబరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ సౌకర్యం లేని సుమారు 700 మిలియన్ల మందికి ఇది ఒక వరంలా మారనుంది.

ఈ వ్యవస్థ ప్రధానంగా `అమ్మోనియం నైట్రేట్` అనే రసాయనంపై ఆధారపడి పనిచేస్తుంది. సాధారణంగా ఎరువుల్లో వాడే ఈ పదార్థానికి నీటిలో కరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న వేడిని గ్రహించే అద్భుతమైన గుణం ఉంది. ప్రొఫెసర్ పెంగ్ వాంగ్ నేతృత్వంలోని బృందం చేసిన ప్రయోగాల్లో అమ్మోనియం నైట్రేట్ .. నీటి మిశ్రమం కేవలం 20 నిమిషాల్లో ఉష్ణోగ్రతను 25డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 3.6 డిగ్రీల సెంటిగ్రేడ్‌కి తగ్గించినట్లు తేలింది. ఇతర లవణాలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా పనిచేయడమే కాకుండా..తక్కువ ఖర్చుతో కూడుకున్నది .. నిల్వ చేయడం కూడా సులభం.

ఈ సాంకేతికతలో అత్యంత కీలకమైన అంశం దాని `రీజెనరేషన్ సైకిల్` లేదా పునరుత్పత్తి ప్రక్రియ. ఒకసారి చల్లబరిచిన తర్వాత ఆ నీటిని మళ్ళీ ఉపయోగించుకోవడానికి విద్యుత్ అవసరం లేదు. కేవలం సూర్యరశ్మిని ఉపయోగించి నీటిని ఆవిరి చేయడం ద్వారా అమ్మోనియం నైట్రేట్‌ను స్పటికాలుగా మార్చి మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. ఈ సౌర శక్తి ఆధారిత ప్రక్రియ వల్ల నీరు వృధా కాదు.. పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. విద్యుత్ లైన్లు లేని ఎడారి ప్రాంతాల్లో .. మారుమూల గ్రామాల్లో ఈ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది.

అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఏ) నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్త విద్యుత్ వినియోగంలో 10 శాతం కేవలం ఏసీల కోసమే ఖర్చవుతోంది. భవిష్యత్తులో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచ‌నా. నెస్కోడ్ వంటి విద్యుత్ రహిత వ్యవస్థలు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కీలక ప్ర‌య‌త్నాలను చేస్తున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా వంటి ఎండలు ఎక్కువగా ఉండే దేశాల్లో వేసవి కాలంలో విద్యుత్ గ్రిడ్‌లపై పడే భారాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. ఇది కేవలం గదులను చల్లబరచడానికే కాకుండా. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి .. మందుల శీతలీకరణకు కూడా ఉపయోగపడుతుంది.

సౌర శక్తి - రసాయన శాస్త్రం కలయికతో రూపొందిన ఈ ఆవిష్కరణ భవిష్యత్తు శీతలీకరణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఇంధన వనరులు, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా సమర్థవంతంగా పనిచేయడం దీని ప్రత్యేకత. ఒకవేళ ఈ సాంకేతికత భారీ స్థాయిలో వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తే.. సామాన్యులకు కూడా అందుబాటు ధరలో ఏసీ సౌకర్యం లభించడమే కాకుండా.. పర్యావరణ హితమైన జీవనశైలికి బాటలు వేస్తుంది.

సాంప్రదాయ ఎలక్ట్రికల్ ఏసీల స్థానంలో ఇటువంటి విద్యుత్ రహిత శీతలీకరణ వ్యవస్థలు విస్తృతంగా అందుబాటులోకి వస్తే... అది ప్రపంచ ఇంధన ఆర్థిక వ్యవస్థపైనా.. గ్లోబల్ వార్మింగ్ అదుపుపైనా దీర్ఘకాలిక ప‌రిష్కారంగా మారుతుంద‌ని నిపుణులు భావిస్తున్నారు.