Begin typing your search above and press return to search.

ఎడారిలో తప్పిపోయిన కుటుంబం.. రేడియేటర్ నీటితో నిలిచిన ప్రాణాలు

రియాద్‌కు దాదాపు 239 కిలోమీటర్ల దూరంలో ఉన్న హల్బాన్ ఎడారిలో తప్పిపోయిన ఒక సౌదీ కుటుంబం కొన్ని రోజుల పాటు నీళ్లు, ఆహారం లేకుండా ప్రాణాలతో పోరాడింది.

By:  Tupaki Desk   |   10 April 2025 9:35 AM IST
ఎడారిలో తప్పిపోయిన కుటుంబం.. రేడియేటర్ నీటితో నిలిచిన ప్రాణాలు
X

ఎడారి ప్రయాణం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. సౌదీ అరేబియాలో ఒక కుటుంబం ఏకంగా నీళ్లు, ఆహారం లేకుండా కొన్ని రోజులు ఎడారిలో చిక్కుకుపోయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు ఎలా బతికారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దాహం వేస్తే కారులోని రేడియేటర్ నీళ్లు తాగారు, ఆకలికి మొక్కల ఆకులు తిన్నారు.

రియాద్‌కు దాదాపు 239 కిలోమీటర్ల దూరంలో ఉన్న హల్బాన్ ఎడారిలో తప్పిపోయిన ఒక సౌదీ కుటుంబం కొన్ని రోజుల పాటు నీళ్లు, ఆహారం లేకుండా ప్రాణాలతో పోరాడింది. చివరికి ఒక రక్షణా బృందం వారిని సురక్షితంగా కాపాడింది. వివరాల్లోకి వెళితే.. సౌదీకి చెందిన ఒక కుటుంబం ఎడారిలో చిక్కుకుపోయింది. వారికి ఆహారం లేదు, తాగడానికి నీరు లేదు. సహాయం కోసం ఎదురు చూస్తూ వారు చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. వారి దాహాన్ని తీర్చుకోవడానికి కారులోని రేడియేటర్ నీటిని తాగారు. ఆకలిని కొంతవరకు తగ్గించుకోవడానికి మొక్కల ఆకులను తిన్నారు.

ఈ రక్షణా చర్యను ఎన్‌జాద్ అనే సౌదీ లాభాపేక్షలేని సంస్థ చేపట్టింది. ఈ సంస్థ ఎడారి ప్రాంతాల్లో తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంది. ఎన్‌జాద్ 40 బృందాలను ఏర్పాటు చేసి, అధునాతన డ్రోన్‌లు, డిజిటల్ మ్యాపింగ్ టూల్స్‌ను ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టింది.

రెండు రోజుల పాటు విస్తారమైన ఎడారి ప్రాంతాన్ని నిరంతరంగా గాలించిన తర్వాత, ఒక డ్రోన్ కుటుంబానికి సంబంధించిన దృశ్యాలను గుర్తించడంతో పురోగతి లభించింది. వారి స్థానం త్వరగా నిర్ధారించారు. దీంతో వారిని సురక్షితంగా రక్షించగలిగారు. ఈ సంఘటన వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపిన భయానక పరిస్థితిని తెలియజేస్తోంది.