Begin typing your search above and press return to search.

పొత్తు ఉన్నా లేకున్నా... సత్యకుమార్ పోటీ అక్కడినుంచే!

ఇందులో భాగంగా టీడీపీ - జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని కూడా ఆయన బలంగా నమ్ముతున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 5:45 AM GMT
పొత్తు ఉన్నా లేకున్నా... సత్యకుమార్  పోటీ అక్కడినుంచే!
X

బీజేపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి స‌త్యకుమార్ లోక్‌ స‌భ బ‌రిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని.. ఇప్పటికే ఒక నియోజకవర్గాన్ని కూడా ఫైనల్ చేసుకున్నారని.. టీడీపీ-జ‌న‌సేన కూట‌మితో బీజేపీ కలిసినా కలవకపోయినా తనకు పరోక్షంగా వారి నుంచి మద్దతు ఉంటుందని నమ్ముతున్నారని కథనాలొస్తున్నాయి. అందుకు గల కారణాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి.

అవును... బీజేపీలో ఉన్న టీడీపీ సానుభూతిపరుల కోరికంతా ఇప్పుడు ఒక్కటే! రాష్ట్రంలో టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తున్న వేళ ఆ కూటమితో బీజేపీ కూడా జతకట్టాలని. వ్యక్తిగ‌త‌, టీడీపీ రాజ‌కీయ ప్రయోజ‌నాల కోసం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీలో కొనసాగుతున్న కొంత మంది నాయ‌కుల లక్ష్యం ఇదే అని చెబుతున్నారు.

ఈ సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పాటు పైన చెప్పుకున్న పలువురు బీజేపీ నేతలూ ఇదే పట్టుపై ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో టీడీపీ - జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసి పనిచేయాలని భావిస్తున్నవారిలో ఒకరిగా చెబుతున్న సత్యకుమార్ రాబోయే ఎన్నికల్లో లోక్ సభ స్థానానికి పోటీ చేయాలని ఫిక్సయ్యారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా టీడీపీ - జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని కూడా ఆయన బలంగా నమ్ముతున్నారని అంటున్నారు. ఈ సమయంలో అటు బీజేపీలోనూ ఇటు టీడీపీతోనూ మాంచి సంబంధాలున్న సత్యకుమార్ ఈసారి అనంతపురం జిల్లా నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది. దీనికోసం ఆయన హిందూపురం లోక్ సభ స్థానాన్ని ఎంపిక చేసుకున్నారని అంటున్నారు!

వాస్తవానికి స‌త్యకుమార్‌ స్వస్థలం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు కాగా... స్థానికంగా ఆయనకు రాజ‌కీయంగా పెద్దగా ప‌ట్టు లేక‌పోయినా, జాతీయ స్థాయిలో మాతరం మాంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు. ఇదే సమయంలో వెంక‌య్యనాయుడితో బంధుత్వం రీత్యా అటు టీడీపీలో కూడా మంచి గ్రిప్ ఉందని అంటుంటారు.

దీంతో... ఈసారి ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీగా పోటీచేయాలని... తాను బీజేపీ నుంచి పోటీ చేసిన సమయంలో టీడీపీ-జనసేన కూటమితో పొత్తు ఉన్నా లేకున్నా... వారి నుంచి తనకు ఉండాల్సిన మద్దతు ఉంటుందని బలంగా నమ్ముతున్నారని చెబుతున్నారు. దీంతో... కూటమిలో బీజేపీ చేరడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్న సత్యకుమార్... హిందూపురం లోక్ సభ స్థానాన్ని ఎంచుకున్నారని తెలుస్తుంది!

కాగా... హిందూపురం లోక్ సభ స్థానంలో 2014లో టీడీపీ నుంచి నిమ్మల క్రిష్టప్ప వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డిపై 97,325 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా... 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి క్రిష్టప్ప పై వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ 140,748 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే!