ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ దే.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఆరోగ్యశ్రీ' పథకంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Political Desk | 13 Jun 2026 3:49 PM ISTరాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఆరోగ్యశ్రీ' పథకంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం పూర్తి క్రెడిట్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వై.ఎస్. రాజశేఖర రెడ్డిదేనని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సాధించిన రెండేళ్ల ప్రగతి నివేదికను విడుదల చేశారు.
ప్రభుత్వాలు మారినప్పుడు పథకాల పేర్లు మారడం రాజకీయాల్లో సహజమేనని, అయితే పేర్లు మారినంత మాత్రాన లబ్ధిదారులకు అందే వైద్య సేవల్లో ఎలాంటి కోత ఉండబోదని మంత్రి స్పష్టమైన భరోసా ఇచ్చారు. ఈ పథకం నిలిచిపోతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న అనవసర దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చదువుకున్న నాయకులే ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ఇలాంటి అబద్ధాల వల్ల పేద ప్రజల్లో భయాందోళనలు నెలకొని, అత్యవసర సమయాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
అత్యవసర వైద్య సేవల్లో కీలకమైన 108 అంబులెన్స్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేసిందని మంత్రి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 602 అంబులెన్సులు మాత్రమే నామమాత్రంగా పనిచేసేవని, ప్రస్తుతం ఆ సంఖ్యను 733కు పెంచామని తెలిపారు. అన్ని అంబులెన్సులకు అధునాతన జీపీఎస్ వ్యవస్థను అనుసంధానించడం ద్వారా రెస్పాన్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించామన్నారు. గతంలో 27.3 నిమిషాలు ఉన్న రెస్పాన్స్ సమయాన్ని ఇప్పుడు 17 నిమిషాలకు తగ్గించినట్లు వివరించారు.
కొండ ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో అంబులెన్స్ చేరే సమయం 23 నిమిషాలుగా ఉందని అన్నారు. రెస్పాన్స్ సమయం తగ్గడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు 'గోల్డెన్ అవర్'లో చికిత్స అందించే రేటు 95 శాతం పెరిగిందని, దీనివల్ల మరణాల రేటు దాదాపు 10 శాతం తగ్గిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 12,000 మంది వైద్య సిబ్బంది నియామకంప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను శాశ్వతంగా అధిగమించడానికి గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో నియామకాలు చేపట్టినట్లు సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 12,000 మంది సిబ్బందిని ఎటువంటి అవినీతికి తావులేకుండా, అత్యంత పారదర్శకమైన పద్ధతిలో నియమించామన్నారు. సెకండరీ హెల్త్ సెక్టార్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూల విధానాన్ని ప్రవేశపెట్టామని, బదిలీల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం అర్హత, అవసరాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గుండె జబ్బు రోగుల కోసం ప్రవేశపెట్టిన స్టెమీ విధానం ద్వారా, గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేరిన కేసుల్లో 94 శాతం మంది ప్రాణాలను విజయవంతంగా కాపాడగలిగామని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారిని అరికట్టేందుకు గుంటూరును నంబర్-1 క్యాన్సర్ కేర్ సెంటర్‌గా తీర్చిదిద్దామని మంత్రి తెలిపారు. ఇదే తరహాలో త్వరలోనే అనంతపురం, కాకినాడ నగరాలలో కూడా అత్యాధునిక ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అలాగే, 'ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్' కింద కిడ్నీ బాధితుల కోసం ప్రతి మూడు రోజులకు ఒక కొత్త డయాలసిస్ బెడ్‌ను ఏర్పాటు చేస్తూ రోగుల నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు.
