ట్రైన్ లో ఏం జరిగింది? సతీష్ కుమార్ కేసులో ఎన్నెన్నో అనుమానాలు?
గుంతకల్లు రైల్వే సీఐ, టీటీడీ మాజీ ఎవీఎస్వో సతీష్ కుమార్ మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 15 Nov 2025 6:45 PM ISTగుంతకల్లు రైల్వే సీఐ, టీటీడీ మాజీ ఎవీఎస్వో సతీష్ కుమార్ మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సతీష్ మరణం ఒక మిస్టరీ కాగా, రైల్వే పోలీసులు కేసును తాడిపత్రి పోలీసులకు బదిలీ చేశారు. పోస్టుమార్టం రిపోర్టు, సీఐ సతీష్ కుమార్ భార్య, కుటుంబ సభ్యుల బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. పరాకమణి కేసులో విచారణ నిమిత్తం తిరుపతి వెళ్లేందుకు గురువారం అర్ధరాత్రి 11.53 నిమిషాలకు సతీష్ కుమార్ గుంతకల్లు రైల్వేస్టేషన్ కు వచ్చారు. గుంతకల్లు నుంచి రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో తిరుపతికి బయలుదేరిన సతీష్ కుమార్ తాడిపత్రి సమీపంలో పట్టాల పక్కన శవమై కనిపించారు.
గుంతకల్లు నుంచి తాడిపత్రి మధ్య ఏం జరగింది అనేదే ఇప్పుడు కేసులో చిక్కుముడిగా చెబుతున్నారు. ఈ రెండు స్టేషన్ల మధ్య ఆయనపై ఎవరైనా దాడి చేసి చంపేశారా? లేక తీవ్ర ఒత్తడిలో సతీష్ ఆత్మహత్య చేసుకున్నారా? అన్నది తేలాల్సివుందని అంటున్నారు. సతీష్ కుమార్ ట్రైన్ ఎక్కిన తర్వాత గంటకే ఏదో జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ఆయన నాలుగు మార్లు తన భార్యకు ఫోన్ చేయడం, అర్థరాత్రి ఆమె ఫోన్ చేయకపోవడం వల్ల కంపర్టుగా లేదంటూ మెసేజ్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు.
ఇక ట్రైనులో తోటి పాసింజర్లతోపాటు గుంతకల్లు, గుత్తి రైల్వేస్టేషన్లలో రైలు ఎక్కిన పాసింజర్ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కేసును కొలిక్కి తీసుకువచ్చేందుకు సీన్ రీకనస్ట్రక్షన్ కూడా చేశారు. అయితే రైలు నుంచి పడిన సతీష్ కుమార్ తల వెనుక భాగంలో బలమైన గాయాలు ఉన్నాయి. శరీరంపై మరెక్కడా కమిలిన లేదా విరిగిన ఆనవాళ్లు లేవని పోలీసులు చెబుతున్నారు. దీతో సతీష్ మరణం పెద్ద మిస్టరీగా మారింది. ఆయన తలపై ఎవరో బలంగా కొట్టి చంపేసి ఉండొచ్చని, అందుకే తలపై బలమైన గాయం అయిందన్న అనుమానాలను నివృత్తి చేసుకునే దిశగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని అంటున్నారు.
కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు సుమారు 15 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు పరకామణి కేసులో దర్యాప్తు చేస్తున్న సీఐడీ సిట్ అధికారులు కూడా సతీష్ కుమార్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6న ఒకసారి విచారణకు హాజరైన సతీష్ కుమార్.. రెండోసారి విచారణకు వస్తుండగా శవమైపోవడాన్ని సీఐడీ సందేహిస్తోంది. గతంలో సతీష్ చెప్పిన సమాచారం మేరకు పరాకామణి కేసుతో లింకున్న అనుమానితుల ప్రమేయం ఏమైనా ఉందా? అన్న దిశగా కేసు దర్యాప్తు చేయాలని తాడిపత్రి పోలీసులను సీఐడీ కోరినట్లు చెబుతున్నారు. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అనంతపురం వచ్చి, జిల్లా పోలీసులతో ఈ విషయమై చర్చించారు. దీంతో సతీష్ కుమార్ హత్య కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నదని, మిస్టరీ ఛేదించే క్రమంలో ఏదైనా సంచలన విషయం బయటపడుతుందా? అన్న ఉత్కంఠ కనిపిస్తోంది.
