ల్యాప్ టాప్ తో డీఎన్ఏ క్రాక్.. ఎనిమిదేళ్ల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ
ఇప్పుడు అతడిని తిరిగి అమెరికాకు అప్పగించాలని అక్కడి అధికారులు మరో దేశాన్ని అధికారికంగా డిమాండ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 19 Nov 2025 6:00 PM ISTఒక దేశస్తులు మరో దేశంలో హత్యకు గురైతే, దర్యాప్తు అక్కడి పోలీసులకు అనుకున్నంత సులభం కాదు. నేరం ఎక్కడ జరిగిందో, బాధితులు ఎక్కడి వారు, అనుమానితుడు అసలేమనుకున్నారు. ఇలా ప్రతి లేయర్‌ను ఒక్కొక్కటిగా వెతికితేనే నిజాలు వెలుగులోకి వస్తాయి. ఈ క్రమంలో ఒక కేసు రోజులు కాదు.. నెలలు కాదు.. సంవత్సరాల తరబడి లాగుతుంది. అమెరికా కూడా అలాంటి ఒక చిక్కుముడిని ఈ మధ్యే విప్పింది. ఎనిమిదేళ్లుగా అలాగే అట్టడుగున పడి ఉన్న హత్య కేసుకు చివరికి ముగింపు దొరికింది. కానీ విచిత్రం ఏమిటంటే.. అసలు నిందితుడు అప్పటికే అమెరికా సరిహద్దులు దాటి, తన సొంత దేశంలో సేద తీరుతున్నాడు. ఇప్పుడు అతడిని తిరిగి అమెరికాకు అప్పగించాలని అక్కడి అధికారులు మరో దేశాన్ని అధికారికంగా డిమాండ్ చేస్తున్నారు.
2017లో హత్య ఘటన..
అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శశికళ నర్రా (Sasikala Narra) ఆమె ఏడేళ్ల కుమారుడు అనీష్ సాయి 2017లో హత్యకు గురైన కేసులో ఎనిమిదేళ్ల తర్వాత సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో అసలు నిందితుడిని గుర్తించడంలో కీలకమైన ఆధారాన్ని ఒక ల్యాప్‌టాప్ బయటపెట్టింది. 2017, మార్చి 23 న్యూజెర్సీలోని మాపుల్ షేడ్‌లో నివసిస్తున్న నర్రా హనుమంతరావు విధులు ముగించుకొని ఇంటికి చేరుకునే సరికి భార్య శశికళ (40) ఆమె కుమారుడు అనీష్ సాయి (7) రక్తపుమడుగులో పడి ఉండడం అతడిని షాక్‌కు గురి చేసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు అయింది.
మొదట భర్తపై అనుమానాలు..
మృతురాలి బంధువులు మొదట భర్త హనుమంతరావుపై అనుమానం వ్యక్తం చేశారు. అతడికి ఓ కేరళ మహిళతో ఉన్న సంబంధం కారణంగా భార్యాబిడ్డలను హత్యచేశాడని ఆరోపించడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఘటనాస్థలంలో లభించిన డీఎన్‌ఏ, హనుమంతరావు డీఎన్‌ఏతో సరిపోకపోవడంతో అతడు క్లిన్‌చిట్ పొంది విడుదలయ్యాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు హనుమంతరావు ఇంటి సమీపంలో ఉండే అతడి సహోద్యోగి హమీద్‌తో కొంత కాలంగా కలహాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కోణాన్ని పరిశీలించడం ప్రారంభించగానే కొత్త వివరాలు బయటపడ్డాయి. హమీద్ హత్య జరిగి ఆరు నెలల అనంతరం భారత్‌కు వెళ్లిపోయినట్లు తెలిసింది.
హమీద్ ను డీఎన్ఏ శాంపీల్ ఇవ్వాలన్న అమెరికా..
అమెరికా దర్యాప్తు సంస్థలు హమీద్‌ను సంప్రదించి డీఎన్‌ఏ నమూనా ఇవ్వాలని ఎన్నోసార్లు కోరినా అతడు నిరాకరించాడు. దీంతో 2024లో అమెరికా కోర్టు, హమీద్ పనిచేసిన కాగ్నిజెంట్ సంస్థకు కీలక ఆదేశం జారీ అయ్యింది. హమీద్‌కు జారీ చేసిన ల్యాప్‌టాప్ అమెరికా అధికారులకు ఇవ్వాలని సూచించింది. అదే ఈ కేసుకు మలుపుతిప్పింది. ల్యాప్‌టాప్ నుంచి సేకరించిన డీఎన్‌ఏ నమూనా.. ఘటనా స్థలంలోని డీఎన్‌ఏతో పూర్తిగా సరిపోవడంతో హమీద్‌నే అసలు నిందితుడిగా అమెరికా పోలీసులు అధికారికంగా ప్రకటించారు. హమీద్ కోసం అలర్ట్ జారీ చేయడంతో పాటు అతడి ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
హమీద్ ను అప్పగించాలన్న యూఎస్..
ప్రస్తుతం హమీద్ భారత్‌లో ఉన్న నేపథ్యంలో అతడిని అమెరికాకు అప్పగించాలంటూ అమెరికా అధికారులు భారత విదేశాంగశాఖను కోరారు. శశికళ, అనీష్ హత్య వెనుక నిజమైన కారణం ఇంకా బయటకు రాలేదు. అయితే.. హనీద్ వ్యక్తిగత ద్వేషం లేదా హనుమంతరావుపై పగతోనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని ప్రాథమిక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
