ఎస్ఏఎస్ సర్వే : పశ్చిమ బెంగాల్ లో మమత నాలుగోసారి గెలిచేనా ?
దేశంలో అందరికీ ఆకట్టుకుంటున్న మరో కీలక రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ ఉంది.
By: Satya P | 30 March 2026 11:13 PM ISTదేశంలో అందరికీ ఆకట్టుకుంటున్న మరో కీలక రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ ఉంది. ఇక్కడ మూడు సార్లు గెలిచి అధికారం అందుకున్నారు మమతా బెనర్జీ. ఆమె తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిగా 2011లో తొలిసారి గెలిచారు. 2016, 2021లలో వరసగా గెలిచారు. ఇక 2026 లో నాలుగవసారి గెలుస్తాను అని ఆమె ధీమాగా ఉన్నారు. అయితే మమత విజయానికి బీజేపీ అడ్డం పడుతోంది. గతసారి గెలిచేశామని అన్నతగా హడావుడి చేసిన బీజేపీ ఈసారి కచ్చితంగా తమదే అధికారం అంటోంది. మరి పశ్చిమ బెంగాల్ లో విజేత ఎవరు అన్నది ఇంట్రెస్టింగ్ గానే ఉంది.
బలమైన ఫ్యాక్టర్లు ఇవే :
పశ్చిమ బెంగాలో వివిధ సామాజిక వర్గాలు మహిళలు పురుషులు వివిధ ఏజ్ గ్రూప్ వారితో పాటు విద్యార్ధులు ఉద్యోగులు రిటైర్డ్ జనాలు, రైతులు, శ్రామికులు చిన్న వ్యాపారులు, బడా వ్యాపారులు ఇలా అందరి నుంచి ఎస్ఏఎస్ సంస్థ అభిప్రాయాలాను ప్రీ పోల్ సర్వేగా మార్చి 27 దాకా సేకరించింది. దాని ప్రకారం చూస్తే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బలంగా ప్రభావం చూపిస్తున్న అంశాలు చూస్తే బెంగాల్ ఆత్మ గౌరవం అన్నది ప్రధానంగా ఉంది అని అంటున్నారు. అలాగే మమతకు ప్రత్యర్ధి సీఎం అభ్యర్ధిగా ప్రజాకర్షణ నేత విపక్షం ఎన్డీయేలో లేకపోవడం మరో ఫ్యాక్టర్ గా ఉంది. అలాగే లా అండ్ ఆర్డర్, సంక్షేమ పథకాలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, మమత ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు, బీజేపీలో అంతర్గత పోరు, తృణమూల్ కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలంగా ఉండడం, ముస్లిం, మహిళా ఓట్లు ఇవన్నీ ఎన్నికల్లో కీలక పాత్రని పోషించబోతున్నాయి అని ఎస్ఏఏస్ ప్రీ పోల్ సర్వే చెబుతోంది.
కాబోయే సీఎం ఎవరు :
ఇక పశ్చిమ బెంగాల్ లో హోరా హోరీ పోరులో కాబోయే సీఎం ఎవరు అన్న దానికి మమతా బెనర్జీ అని ఏకంగా 48 శాతం చెబుతున్నారు. బీజేపీ నుంచి సువీందు అధికారి అని 30 శాతం మాత్రమే చెబుతున్నారు. అలాగే తృణమూల్ నుంచి అభిషేక్ బెనర్జీ అని 5 శాతం చెబుతున్నారు. ఏ పార్టీ కూటమి పట్ల ఓటర్ల మొగ్గు ఎంత ఉంది అంటే తృణమూల్ కాంగ్రెస్ కి 48 శాతం బీజేపీకి 30 శాతం, కాంగ్రెస్ కి 5 శాతం, లెఫ్ట్ కి 5 శాతం మద్దతు లభిస్తోంది. మమత ప్రభుత్వం మీద సంతృప్తి చెందిన వారు 36 శాతం ఉంటే పరవాలేదు అన్న వారు 22 శాతం ఉన్నారు, అసలు బాగాలేదు అన్న వారు 30 శాతం మంది ఉన్నారు. అవినీతి ప్రభుత్వం అన్న వారు 24 శాతం ఉంటే ఒక మాదిరి అన్న వారు 20 శాతం ఉంటే అవినీతి లేదు అన్న వారు 38 శాతం ఉన్నారు.
వీటిని చూసే ఓటు :
ఇక పోలింగ్ బూత్ ల వద్దకు ఓటేసేందుకు ఏ అంశాలు ప్రభావితం చూపిస్తాయని చూస్తే నిరుద్యోగం టాప్ లో ఉంది 20 శాతం మంది ఈ అంశం మీదనే ఓటేయబోతున్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ విషయంలో 16 శాతం, ధరల పెరుగుదల విషయంలో 13 శాతం, అవినీతి మీద 10 శాతం, అక్రమ వలసల మీద 2 శాతం, సన్స్ఖేమ పధకాల తీరు మీద 16 శాతం, ఆరోగ్యం విద్య విషయం మీద 9 శాతం ఓటేయబోతున్నారు. మమత ప్రభుత్వం చాలా బాగుంది అన్న వారు 34 శాతం ఉంటే బాగుంది అన్న వారు 18 శాతం, ఏవరేజ్ అన్న వారు 12 శాతం, బాగా లేదు అన్న వారు 30 శాతం మంది ఉన్నారు.
బలమైన క్యాడర్ తో :
ఇక బెంగాల్ లో బలమైన క్యాడర్ తో ఉన్న పార్టీ ఏదీ అంటే తృణమూల్ కాంగ్రెస్ అని 48 శాతం, బీజేపీ అని 31 శాతం మంది, కాంగ్రెస్ అని 3 శాతం, లెఫ్ట్ అని 4 శాతం చెబుతున్నారు. ఇక బీజేపీకి బలమైన క్యాడర్ లోపం ఉందని 28 శాతం, పార్టీలో పోరు ఉందని 23 శాతం, ప్రజాకర్షణ కలిగిన నేత లేడని 27 శాతం బెంగాల్ కల్చర్ ని బీజేపీ అర్ధం చేసుకోలేకపోతోంది అని 10 శాతం, హిందూత్వ అస్త్రంతోనే బీజేపీ ఉందని 9 శాతం అభిప్రాయపడ్డారు.
బెంగాల్ ని కాపాడేది :
బెంగాల్ ని కాపాడే పార్టీ ఏదీ అంటే తృణమూల్ కాంగ్రెస్ కి 52 శాతం మంది, బీజేపీకి 32 శాతం మంది కాంగ్రెస్ కి 3 శాతం లెఫ్ట్ పార్టీలకు 5 శాతం మద్దతుగా నిలిచారు. ఈసారి ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించే అంశంగా బెంగాల్ ఆంత గౌరవం అన్నది 43 శాతం అభిప్రాయంగా చెబితే నిరుద్యోగం అన్నది 20 శాతం భావనగా ఉంది. లా అండ్ ఆర్డర్ అని 19 శాతం పేర్కొన్నారు. సర్ ప్రక్రియ మీద జనాలు ఏమనుకుంటున్నారు అంటే అక్రమ ఓటర్లను తీసివేయడానికి అని 11 శాతం అంటే కేంద్ర ఎన్నికల సంఘం తన విధి నిర్వహణలో ఇది ఒక భాగం అని 30 శాతం అంటున్నారు. ఎన్నికల ముందే సర్ ప్రక్రియను నిర్వహించడం మంచిది కాదని 44 శాతం మంది అభిప్రాయపడ్డారు. సీబీఐ దాడుల మీద కూడా రొటీన్ అని 34 శాతం అంటే రాజకీయ కక్ష అని 48 శాతం మంది చెప్పారు.
ఎవరికి ఎన్ని సీట్లు :
ఎస్ఏఎస్ ప్రీ పోల్ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు అన్నది చూస్తే కనుక నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజియన్ లో 54 సీట్లు ఉంటే తృణమూల్ కాంగ్రెస్ కి 30 నుంచి 32, బీజేపీకి 23 నుంచి 26, ఇతరులకు 1 నుంచి 2 సీట్లు దక్కుతాయి. సెంట్రల్ బెంగాల్ లో 58 సీట్లు ఉంటే తృణమూల్ కాంగ్రెస్ కి 35 నుంచి 40, బీజేపీకి 20 నుంచి 22, లెఫ్ట్ కి 1 నుంచి 2, ఇతరులకు ఒకటి దక్కుతాయి. గ్రేటర్ కోల్ కటాలో చూస్తే 126 సీట్లు ఉన్నాయి. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ కి 78 నుంచి 82, బీజేపీకి 42 నుంచి 46, ఇతరులకు ఒకటి నుంచి రెండు సీట్లు లభిస్తాయి. జుంజల్ మహల్ అండ్ మెడినిపూర్ ప్రాంతంలో 56 సీట్లు ఉంటే తృణమూల్ కాంగ్రెస్ కి 35 నుంచి 44 సీట్లు, బీజేపీకి 15 నుంచి 17 సీట్లు, ఇతరులకు ఒక్క సీటు దక్కుతుందని ప్రీ పోల్ సర్వే చెబుతోంది. ఓవరాల్ గా చూస్తే మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు గానూ తృణమూల్ కాంగ్రెస్ కి 178 నుంచి 198 దాకా వస్తాయని అంచనా. బీజేపీకి 100 నుంచి 110, కాంగ్రెస్ కి ఒకటి, లెఫ్ట్ కి ఒకటి నుంచి రెండు, ఇతరులకు రెండు నుంచి ఆరు దాకా సీట్లు వస్తాయని ఎస్ఏఎస్ సర్వే అంచనా వేసింది. మార్చి 26 వరకూ ఈ ప్రీ పోల్ సర్వే సాగింది.
