Begin typing your search above and press return to search.

సర్పంచ్ నవ్య వివాదం ఏమిటి? రాజయ్య ఏం చెప్పారు?

ఆయన నియోజకవర్గం పరిధిలోని సర్పంచ్ నవ్యతో ఉన్న వివాదం.. ఆ ఎపిసోడ్ లో రాజయ్య ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   25 Sep 2023 4:57 AM GMT
సర్పంచ్ నవ్య వివాదం ఏమిటి? రాజయ్య ఏం చెప్పారు?
X

తాటికొండ రాజయ్య. తెలంగాణరాజకీయాల గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేరు. సంచలన వ్యాఖ్యలే కాదు పంచాయితీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. గులాబీ నేతగా మారిన తర్వాత ఆయన పేరు తరచూ వార్తల్లో రావటం తెలిసిందే. త్వరలో జరిగే ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాన్ని ఆయనకు కాకుండా ఆయన రాజకీయ ప్రత్యర్థి కడియం శ్రీహరికి టికెట్ ను కన్ఫర్మ్ చేసిన వైనంపై ఆయన భోరుమనటం.. అంత పెద్ద మనిషి అలా కన్నీరు పెట్టుకోవటం అందరిని ఆకర్షించింది.

ఎన్నికల్లో కడియం ఎలా గెలుస్తారన్న దానిపై పంతం పెట్టుకున్న రాజయ్యను.. ఈ మధ్యనే ప్రగతి భవన్ పిలిపించి.. పంచాయితీ పూర్తి చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ఆయన నియోజకవర్గం పరిధిలోని సర్పంచ్ నవ్యతో ఉన్న వివాదం.. ఆ ఎపిసోడ్ లో రాజయ్య ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

జాతీయ మహిళా కమిషన్ వద్దకు వెళ్లిన ఈ ఇష్యూ మీద రాజయ్య ఏం చెప్పారు? ఆయన వాదన ఏమిటన్నది చూస్తే.. ఈ ఎపిసోడ్ మీద కాస్తంత క్లారిటీ వస్తుందని చెప్పాలి. ఇంతకూ రాజయ్య ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే చదివితే.. "ఆమె కడియం శ్రీహరి వర్గానికి చెందిన వారు. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చారు. దయాకర్రావు.. పల్లా రాజేశ్వర్ రెడ్డిని వాళ్ల ఊరికి తీసుకెళ్లి.. నేనే ప్రోగ్రాంలు చేశా. పనులు అయినా బిల్లులు రాలేదు.

దీంతో పదిహేను రోజుల తర్వాత మళ్లీ నవ్య, ఆమె భర్త కడియం వైపు వెళ్లారు. ఎమ్మెల్యేతో ఉండటం లేదు కాబట్టి నిధులు ఇవ్వటం లేదన్నది వారి అభియోగం. కల్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చే క్రమంలో మధ్యలో లబ్థిదారులు ఉన్నారు. సర్పంచ్ గా ఉన్న నవ్య.. తనకేమీ పట్టనట్లుగా దూరంగా ఉన్నారు.

దీంతో.. దగ్గరకు రమ్మన్నా. దానికి దగ్గరకు రమ్మంటాడని చెప్పుకుంది. దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది. ఈ వ్యవహారాన్ని జాతీయ.. రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్నారు. పోలీసుల విచారణలో నా ప్రమేయం ఏమీ లేదని తెలిసింది. ఈ విషయాన్ని మహిళా కమిషన్ కు నివేదించారు" అని చెప్పుకొచ్చారు.

సర్పంచ్ నవ్యకు నిత్యం ఏదో ఒకటి నేర్పి.. టీవీ చానళ్లలో మాట్లాడిస్తుంటారని రాజయ్య వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందన్న ఆయన.. "కడియం.. రాజయ్య ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా. వాళ్లిద్దరూ కాదు.. తనకు టికెట్ ఇవ్వాలని కోరుతోంది. నవ్య ఎపిసోడ్ వెనుక కడియం ఉన్నాడు. ఆయన అనుచరులు వారికి ఆర్థిక సాయం చేయటం.. మీడియా వాళ్లను మేనేజ్ చేయటం లాంటి అనేక అంశాలు ఉన్నాయి. నా మీద సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారం వెనుక కడియం ఉంటారు. ఆయన అనుచరులు ఎప్పుడు ఫార్వర్డ్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో తన మీద తప్పుడు ప్రచారం చేసే కడియం అనుచరుడు ఒకరు వచ్చి.. "సారీ అన్నా.. అటువైపు ఉన్నప్పుడు అలా చేశాను" అని పేర్కొన్నారు.