Begin typing your search above and press return to search.

"నా డీప్‌ ఫేక్‌ ఫొటోలు వైరల్‌"... సారా టెండుల్కర్ ఆవేదన!

ఇటీవల సోషల్‌ మీడియాలో తన డీప్‌ ఫేక్‌ ఫొటోలు కూడా వైరల్‌ అవడం చూసినట్లు తెలిపిన సారా... కొందరు ఉద్దేశపూర్వకంగా నకిలీ ఖాతాలు సృష్టించి, నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 12:37 PM GMT
నా డీప్‌  ఫేక్‌  ఫొటోలు  వైరల్‌... సారా టెండుల్కర్  ఆవేదన!
X

ప్రస్తుతం సెలబ్రెటీలకు డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోల సమస్య అతిపెద్ద తలనొప్పిగా తయారయ్యింది. దీంతో ఎప్పుడు ఎవరికి సంబంధించిన డీప్ ఫేక్ ఎలాంటి ఫోటోలు, మరెలాంటి వీడియోలు వైరల్ అవుతాయనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో తన డీప్ ఫేక్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయని తెలిపారు సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్!

అవును... ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల డీప్‌ ఫేక్‌ వీడియోలు వైరల్‌ అవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ మార్ఫింగ్‌ వీడియోలపై ప్రముఖుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవడంతో కేంద్రం కూడా చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 24న ఫేస్ బుక్, గూగుల్, యూట్యూబ్ సంస్థలతో చర్చించనుంది. ఈ క్రమంలో తాజాగా సారా టెండుల్కర్ దీనిపై స్పందించారు. తన డీప్‌ ఫేక్‌ వీడియోలు కూడా నెట్టింట వైరల్‌ అయినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మరిన్ని విషయాలు వెల్లడించిన సారా టెండుల్కర్... రోజువారీ కార్యకలాపాలు, ఆనందాలు, బాధలను పంచుకునేందుకు సోషల్‌ మీడియా అద్భుతమైన వేదికగా ఉపయోగపడుతుంది కానీ... కొందరు టెక్నాలజీని దుర్వినియోగం చేయడం కలవరపెడుతోందని అన్నారు. వాస్తవానికి తనకు అసలు ఎక్స్ అకౌంటే లేనప్పటికీ ఆన్ లైన్ లో తనపేరున పలు ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని అన్నారు.

ఇటీవల సోషల్‌ మీడియాలో తన డీప్‌ ఫేక్‌ ఫొటోలు కూడా వైరల్‌ అవడం చూసినట్లు తెలిపిన సారా... కొందరు ఉద్దేశపూర్వకంగా నకిలీ ఖాతాలు సృష్టించి, నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో... వాస్తవాలను పణంగా పెట్టి వినోదం పంచకూడదని సారా అభిప్రాయపడ్డారు.

కాగా ఇటీవల టీం ఇండియా ఓపెనర్ శుభ్‌ మన్‌ గిల్‌ తో సారా టెండుల్కర్ ఉన్నట్లు ఓ మార్ఫింగ్ ఫొటో నెట్టింట వైరల్‌ అయ్యిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సారా తన సోదరుడు అర్జున్‌ తో ఉన్న ఫొటోను కూడా కొందరు డీప్‌ ఫేక్‌ చేశారు. ఈ క్రమంలోనే అర్జున్‌ ముఖం ప్లేస్ లో గిల్‌ ఫేస్ పెట్టి వైరల్‌ చేశారు.

ఇక, ఇటీవల రష్మిక, కాజోల్‌, కత్రినా ల పేరుతో డీప్‌ ఫేక్‌ వీడియోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. వీటిపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా... అవసరమైతే డీప్‌ ఫేక్‌ పై కొత్త చట్టం తీసుకొస్తామని కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తాజాగా వెల్లడించారు. ఈ క్రమంలో తాను కూడా ఈ డీప్ ఫేక్ సమస్యను ఎదుర్కొన్నట్లు సారా ఆవేదన వ్యక్తం చేశారు.