Begin typing your search above and press return to search.

కోడి కత్తులు కట్టేవారికి డిమాండ్ ఏ రేంజ్ లో ఉందంటే..!

ఇక ఈ కోళ్ల పందేలకు సంబంధించిన బరెలను నిర్వహించే తోటలను సుమారు 10 రోజుల ముందు నుంచే శుభ్రం చేస్తుంటారు.

By:  Raja Ch   |   18 Dec 2025 2:23 PM IST
కోడి కత్తులు కట్టేవారికి డిమాండ్  ఏ రేంజ్  లో ఉందంటే..!
X

సంక్రాంతి వచ్చిందంటే పట్టణాలన్నీ బయలుదేరి పల్లెలకు చేరతాయి. అప్పటికే పల్లెలు పచ్చందాలతో కళకళలాడుతుంటాయి. ఇంటి ముందు ముగ్గులు, వాటిపై గొబ్బెమ్మలు, వాటి ముందు బసవన్నలు, ఇక ప్రత్యేకంగా చేసే పిండి వంటలు ఇలా ఎన్నో సందళ్లు. అయితే.. ఇవన్నీ ఒకెత్తు అయితే కోడి పందేల స్థానం మరొకెత్తు. ఎందుకంటే.. సంక్రాంతి సంబరాల్లో వీటి స్థానం ప్రత్యేకం.

ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఏడాది అంతా సంపాదించింది ఒక్క పందెంలో నాశనం చేసుకున్నవారూ ఉంటారు.. ఏడాదికి సరిపడా సంపాదన ఒక్క పందెంలో గెలుచుకున్నవారూ ఉంటారు అక్కడ! ఈ సంక్రాంతి సంబరాల్లో తన కోడి పందె గెలిస్తే.. పూర్వం రాజ్యాలు గెలుచుకున్న సుల్తాన్లు, రాజుల స్థాయిలో ఫీలవుతుంటారు జనాలు!

ఇక ఈ కోళ్ల పందేలకు సంబంధించిన బరెలను నిర్వహించే తోటలను సుమారు 10 రోజుల ముందు నుంచే శుభ్రం చేస్తుంటారు. క్రికెట్ మైదానంలో పిచ్ క్యూరేటర్లు స్థాయిలో పలువురు.. ఆ పందెం బరెల పిచ్ లను పరిశీలించి ఫైనల్ చేసి, చుట్టూ బారికేడ్స్ ఏ సైజులో, ఎంత దూరంలో ఉండాలో ఫిక్స్ చేస్తుంటారు. ఇక కోళ్లకు కత్తెలు కట్టేవారి స్థానం మరో ప్రత్యేకం. ఇప్పుడు వారి డిమాండ్ మామూలుగా లేదు!

అవును... తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాల ముందస్తు ప్రణాళికలు అప్పుడే ప్రారంభమైపోయాయి. వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటుకు సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్స్ ని మించి అన్నస్థాయిలో యజమానులు వారి వారి కోళ్లకు ఫిట్ నెస్ ట్రైనింగ్ మరింత ముమ్మర చేశారు.. బరిలో నిలదొక్కుకునేలా వాటిని మరింత రాటుదేల్చే పనిలో నిమగ్నమైపోయారు.

సాధారణంగా ఉదయం కోడి కూసిన తర్వాత లేచే మనిషి.. అంతకంటే ముందే నిద్ర లేచి, కోడిని నిద్ర లేపుతున్న పరిస్థితి! అనంతరం దానికి స్విమ్మింగ్ ఫూల్ లో స్నానం, జీడి పప్పుతో బ్రేక్ ఫాస్ట్.. రాగులు సజ్జలతో లంచ్.. మరికొన్ని మిల్లెట్స్ తో డిన్నర్ కి ముందు రకరాల పప్పు దినుసులతో స్నాక్స్ వెరసి.. డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ పోటీలకు బయలుదేరే ఫైటర్స్ ని తయారు చేస్తున్నారు!

ఈ క్రమంలో కోళ్ల పందాల్లో అత్యంత కీలకమైన పనుల్లో ఒకటి.. కోడికి కత్తి కట్టడం. ఇది అందరికీ వచ్చిన పని కాదు! దీనికి చాలా నైపుణ్యం కావాలని చెబుతారు! పైగా ఆ కట్టులో తేడా వస్తే కోడి పీకేమో కానీ, చాలా మంది జీవితాలు తెగిపడిపోయే పరిస్థితి! దీంతో.. కోడి కత్తులు కట్టే ఎక్స్ పర్ట్స్ కి ఇప్పటికే అడ్వాన్స్ బుక్కింగ్స్ మొదలైపోయాయని, వారిని ఇప్పటికే పలు బరులకు బుక్ చేసుకున్నారని చెబుతున్నారు!

మరి ఈ రేంజ్ లో ముందస్తు ప్రణాళికలు మొదలైన కోడి పందాలకు ఆఫీసుల్లో సెలవు దొరికితే హైదరాబాద్ నుంచైనా అమెరికా నుంచైనా గోదావరి జిల్లాల్లో వాలిపోవాలని చాలామంది ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. మరి ఆ జాబితాలో మీరూ ఉన్నారా?