Begin typing your search above and press return to search.

ఎవరీ రేఖ పత్ర.. ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఆమెకు మోడీ ఫోన్ చేసి మాట్లాడటమా?

సంచలంగా మారి జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారిన సందేశ్ ఖాలీ ఎపిసోడ్ లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది

By:  Tupaki Desk   |   27 March 2024 7:30 AM GMT
ఎవరీ రేఖ పత్ర.. ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఆమెకు మోడీ ఫోన్ చేసి మాట్లాడటమా?
X

సంచలంగా మారి జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారిన సందేశ్ ఖాలీ ఎపిసోడ్ లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సందర్భానికి తగినట్లుగా నాటకీయతను మేళవించే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి మించినోళ్లు మరొకరు ఉండరనే మాట ఆయన రాజకీయ ప్రత్యర్థుల నోటి నుంచి వినిపిస్తుంటుంది. అయితే.. అదే ఆయన చమత్కారంగా బీజేపీ నేతలు పొగిడేస్తుంటారు. అలాంటి మోడీ తాజాగా సందేశ్ ఖాలీ బాధితురాలు.. బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఫోన్ చేసి మాట్లాడిన వైనం మరోసారి అందరిని ఆకర్షించేలా చేసింది.

పశ్చిమ బెంగాల్ పరిధిలోని బసిర్ హట్ ఎంపీ స్థానం పరిధిలో ఉండే సందేశ్ ఖాలీ .. దాన్ని తన గప్పిట్లో పెట్టుకొని అరాచకం చెలాయించిన టీఎంసీ నేత షాజహాన్ షేక్ గురించి తెలిసిందే. ఇటీవల అతడు అరెస్టు అయిన తర్వాత.. సందేశ్ ఖాలీ అరాచకాన్ని లోకానికి తెలిసేలా చేసినోళ్లలో స్థానిక మహిళ రేఖ పత్ర. షాజహాన్ షేక్ బాధితురాలైన ఆమెను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపుతూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

తాజాగాఆమెకు ఫోన్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా రేఖా పత్రను శక్తి స్వరూపిణిగా..కాళీ మాతగా అభివర్ణించటం విశేషం. ఇంతకూ ప్రధాని మోడీ.. రేఖాపత్రకు మధ్య జరిగిన సంభాషణ ఏమిటన్నది చూస్తే..

ప్రధాని నరేంద్ర మోడీ: బసిర్ హట్ నియోజకవర్గ ప్రజలు ఎలా ఉన్నారు? వారి పరిస్థితి ఇప్పుడెలా ఉంది?

రేఖపత్ర: టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరాచకాలు అన్నీఇన్నీ కావు. కేంద్రం సహకారంతో మా కష్టాలు తీరాయి.

మోడీ: అందుకే బసిర్ హట్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసే బాధ్యతను మీకు అప్పజెప్పాం

రేఖపత్ర: సందేశ్ వాలీ మహిళలకు మీరు దేవుడు. ఆ రాముడే మాతోఉన్నట్లుగా భావిస్తున్నాం.

మోడీ: మీ ఆశీస్సులు పొందినందుకు సంతోషిస్తున్నా. మహిళా మణులకు ఎల్లవేళలా కృతజ్ఞుడినై ఉంటా. బీజేపీ అభ్యర్థిగా మీ ఎంపికపై ప్రజల స్పందన ఏమిటి?

రేఖపత్ర: మీరు నన్ను లోక్ సభ అభ్యర్థిగా ఎంపిక చేయటంపై తొలుత మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారిలో చైతన్యం కలిగింది. టీఎంసీ నేతల సూచనలతోనే అలా చేశామని వారు నాతో చెప్పారు. ఇకపై తాము అలా చేయమని.. అండగా ఉంటామని మాట ఇచ్చారు. వారిలో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను వారి కోసం పని చేస్తాను.

మోడీ: మీకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారి కోసం పని చేస్తున్నందుకు అభినందనలు. మిమ్మల్ని అభ్యర్థిగా నిలబెట్టి గొప్ప పని చేశాం.

రేఖ పత్ర: నేను నిరుపేదరాలిని. నా భర్త చెన్నైలో పని చేస్తున్నారు. మేం బతకటానికి చాలా కష్టపడుతున్నాం. ఇక్కడ ప్రజలకు పని దొరికేలా.. వారు రాష్ట్రాన్ని విడిచి పెట్టి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏదైనా చేయాలనుకుంటున్నా.

మోడీ: మీ గెలుపు ఖాయం. మీరు శక్తి స్వరూపిణి. శక్తివంతమైన నేతను జైలుకు పంపారు. బసిర్ హట్ లో మాత్రమే కాదు పశ్చిమబెంగాల్ అంతటా మహిళల గౌరవం కోసం కలిసి పోరాడదాం. మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. బెంగాల్ దుర్గా మాతకు నెలవు. మీరు ఆ శక్తి స్వరూపం. సందేశ్ ఖాలీ మహిళలు గొంతు ఎత్తటమ అంత సలువు కాదు. బెంగాల్ లోని నారీ శక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని భావిస్తున్నాం.