Begin typing your search above and press return to search.

సనాతన ధర్మంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంచలన వ్యాఖ్యలు!

ఇటీవల సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Oct 2023 9:25 AM GMT
సనాతన ధర్మంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంచలన వ్యాఖ్యలు!
X

ఇటీవల సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇది చాలదన్నట్టు డీఎంకే ఎంపీ రాజా ఆ అగ్గిని మరింత రాజేశారు. ఈ నేపథ్యంలో డీఎంకే నేతల వ్యాఖ్యలను పార్టీలకతీతంగా పలువురు ఖండించారు.

తాజాగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం ఒక్కటే మతమని ఆయన వ్యాఖ్యానించారు. మిగిలినవన్నీ విభాగాలు, పూజా విధానాలు మాత్రమేనని తెలిపారు. 'శ్రీమధ్‌ భగవత్‌ కథా జ్ఞాన్‌' కార్యక్రమంలో భాగంగా యోగీ ఆదిత్యానాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోలుస్తూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ.. 'సనాతన ధర్మం ఒక్కటే మతం, మిగిలినవి అన్ని శాఖలు, పూజా విధానాలు. సనాతన ధర్మం మానవత్వానికి చెందిన మతం. దానిపై దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి సంక్షోభం ఏర్పడుతుంది' అని తేల్చిచెప్పారు.

ఉత్తర ప్రదేశ్‌ లోని గోరఖ్‌ నాథ్‌ ఆలయంలో జరిగిన ఏడు రోజుల 'శ్రీమద్‌ భగవత్‌ కథా జ్ఞాన యాగం' ముగింపు సందర్భంగా జరిగిన చివరి సెషన్‌ లో పాల్గొన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ మేరకు సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశారు.

మహంత్‌ దిగ్విజయ్‌ నాథ్‌ 54వ వర్ధంతి, జాతీయ సాధువు మహంత్‌ వైద్యనాథ్‌ 9వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ 'భగవత్‌ కథ అనంతమైనది. ఇది నిర్దిష్ట రోజులు లేదా గంటలకు పరిమితమయ్యేది కాదు. ఇది అనంతం. భక్తులు నిరంతరం తమ జీవితాల్లో దాని సారాంశాన్ని గ్రహిస్తారు' అని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. సనాతన ధర్మంపై ఎవరికి నచ్చినట్టు వాళ్లు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో గోరఖ్‌ పూర్‌ పీఠానికి అధిపతిగా కూడా ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

మరోవైపు విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం చెన్నైలో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవిని కలిసి సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని వినతిపత్రం సమర్పించారు.