కాలిఫోర్నియాలో పెను ప్రమాదం... కరెంట్ తీగలను తాకి కూలిన విమానం!
స్థానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున కాలిఫోర్నియాలోని శాన్ డియాగో పరిసరాల్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 23 May 2025 12:01 AM ISTస్థానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున కాలిఫోర్నియాలోని శాన్ డియాగో పరిసరాల్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఓ ప్రైవేట్ విమానం.. స్థానిక సైనిక గృహ పరిసరాలపై కూలిపోయింది. ఈ సమయంలో.. నేలపై ఉన్న ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదని అధికారులు తెలిపారు. అయితే.. ఆ సమయంలో విమానంలో 8 - 10 మంది ఉండొచ్చని అంటున్నారు.
అవును... గురువారం తెల్లవారుజామున పొగమంచు కారణంగా శాన్ డియాగో సైనిక గృహ పరిసరాల్లో సెస్స్నా 550 ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నట్లు భావిస్తున్న 8 నుంచి 10 మంది మరణించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... ఈ ఘటనలో నేలపై ఉన్న సుమారు అరడజను వాహనాలు ధ్వంసమవ్వగా.. సుమారు 15 ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. స్థానికంగా ఉన్న ఇళ్లలో ఉన్న ఎవరినీ ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం రాలేదని అంటున్నారు. అయితే... విమానం విద్యుత్ లైన్లను తాకిందనే సందేహాలు ఉన్నాయని అసిస్టెంట్ ఫైర్ డిపార్ట్ మెంట్ చీఫ్ డాన్ ఎడ్డీ అన్నారు!
ఈ ప్రమాదం జరిగిన అనంతరం పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఫలితంగా పూర్తిగా కాలిపోయిన స్థితిలో సుమారు అర డజను కార్లు వీధిలో పడి ఉన్నాయి. ఈ సమయంలో నిమిషాల వ్యవధిలోనే సుమారు 50 మంది పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించారని.. వారందరిని స్థానిక స్కూల్ కు తరలించామని శాన్ డియాగో పోలీస్ చీఫ్ స్కాట్ వాల్ తెలిపారు.
