Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... ఎల్.జి.బి.టి. అంటే ఏమిటి?

అయితే... స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాల్సింది మాత్రం పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలేనని సుప్రీంకోర్టు తెలిపింది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 3:58 AM GMT
హాట్  టాపిక్... ఎల్.జి.బి.టి. అంటే ఏమిటి?
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్వలింగ సంపర్కులకు సంబంధించిన చర్చ హాట్ హాట్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తాజాగా స్పందించింది. ఇందులో భాగంగా... స్వలింగ సంపర్కుల వివాహాలకు "ప్రత్యేక వివాహాల చట్టం" కింద చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా నిరాకరించింది. అయితే... అలాంటిది చేయాలంటే దానికి తగ్గట్టు చట్టాన్ని మార్చే పరిధి పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది.

అవును... స్వలింగ సంపర్కం నేరం కాదని భారత సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్‌ లో తీర్పు చెప్పింది. మైనారిటీ తీరిన ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కం చేస్తే అది నేరం కాదని ఈ తీర్పు చెబుతోంది. అయితే... స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాల్సింది మాత్రం పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశం అయ్యింది.

దీంతో ప్రాథమిక హక్కులు అనే టాపిక్ తెరపైకి వచ్చింది. ఇలా ప్రాథమిక హక్కుల గురించి జరుగుతున్న ఈ చర్చపై మరింత క్లారిటీ రావాలంటే ముందు ఈ ఎల్, జి, బీ, టి, క్యూ, ఐ, ఏ గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

వీటిలో "ఎల్" అంటే... లెస్బియన్. అంటే... ఒక మహిళ మరొక మహిళపై ఆకర్షణ కలిగి ఉండడం. ఇక "జీ" అంటే గే. అంటే... ఒక పురుషుడు మరో పురుషుడిపై ఆకర్షణ కలిగి ఉండడం. అయితే, ఈ "గే" అనే పదాన్ని స్వలింగ సంపర్కులను సూచించే పదంగానూ వాడుతున్నారు. ఉదాహరణకు... గే కమ్యూనిటీ, గే పీపుల్, గే గ్రూప్ మొదలైనవి!

ఇక ఇక్కడ "బీ" అంటే... బై సెక్సువల్. అంటే... ఒక వ్యక్తికి మహిళ, పురుషుడు, ఇద్దరిపైనా ఆకర్షణ ఉండడం. ఇక "టీ" అంటే... ట్రాన్స్‌ జెండర్. అంటే... పుట్టుకతో మగ లేదా ఆడ అయి ఉన్నప్పటికీ... పెరుగుతున్న కొద్దీ వారి వారి శరీరంలో వస్తున్న మార్పుల వల్ల అందుకు వ్యతిరేకంగా ప్రవర్తించడం.

ఇందులో... పుట్టుకతో పురుషుడి జననేంద్రియాలతో జన్మించి, వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పుల వల్ల మహిళగా మారితే వారిని "ట్రాన్స్‌ జెండర్ మహిళ" అని అంటారు! అదేవిధంగా... పుట్టుకతో మహిళ జననేంద్రియాలతో జన్మించి, వయసు పెరిగే కొద్దీ పురుషుడిగా మారితే వారిని "ట్రాన్స్ జెండర్ పురుషుడు" అని సంబోదిస్తారు!

వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మార్పుల సంగతి అలా ఉంటే... హార్మోన్ రీప్లేస్‌ మెంట్ థెరపీ, సెక్స్ రీఅసైన్‌ మెంట్ సర్జరీ వంటి పద్ధతుల్లో లింగమార్పిడి ద్వారా తమకు పుట్టుకతో వచ్చిన జననేంద్రియాలను మార్చుకోవచ్చు కూడా! ఫలితంగా... ఒక ట్రాన్స్‌జెండర్ తన శరీర వాంఛ కారణంగా లెస్బియన్ ట్రాన్స్‌ జెండర్.. గే ట్రాన్స్‌ జెండర్.. లేదా బైసెక్సువల్ ట్రాన్స్‌జెండర్ కూడా అయ్యే అవకాశం ఉంది!

ఇక క్యూ, ఐ, ఏ... ల విషయానికొస్తే... "క్యూ" అంటే క్వీర్, క్వశ్చనింగ్ అని అంటారు. అంటే... క్వీర్‌ ను మొదట్లో స్వలింగ సంపర్కులను ద్వేషించే పదంగా ఉపయోగించారు. అయితే ఇప్పుడు ఆ పద్దతి మారుతోంది. అంటే... తాను మహిళనో, పురుషుడో తేల్చుకోలేని వారు.. ఎవరిపై తమకు ఆకర్షణ ఉందో తెలియని సంకట పరిస్థితిలో ఉన్నవారు అన్నమాట.

ఇక "ఐ" అంటే... ఇంటర్‌ సెక్స్. అంటే... పుట్టినప్పుడు వారి జననేంద్రియాలను బట్టి వారు ఆడపిల్లలో, లేదా మగపిల్లలో తెలియని వారాని అర్ధం. వీరిని ఇంటర్‌ సెక్స్‌ గా వ్యవహరిస్తున్నారు. వైద్యులు వారి శరీర నిర్మాణాన్ని పరిశీలించి వారు ఆడ లేదా మగ అని నిర్ధారిస్తారు. అయితే... పెద్దయ్యాక వారు "ఇతరులు" (ఆడ, మగ, ట్రాన్స్‌ జెండర్‌)గా మారే అవకాశం కూడా ఉంది.

ఇదే సమయంలో... లైంగిక పరిభాషలో మరో మూడు విభాగాలు కూడా ఉన్నాయి. అవి ఏ, ఏ పీ! ఇందులో "ఏ" అంటే... ఎలీజ్. అంటే.. వీరు గేలు కాకపోయినప్పటికీ వారికి మద్దతునిచ్చేవారు కాగా... "ఏ" అంటే అసెక్సువల్. అంటే... స్త్రీ, పురుషులు ఎవరిపైనా కోరిక కలగని వారు. ఇక "పీ" అంటే... పాన్‌ సెక్సువల్. అంటే... ఆడ, మగా ఎవరిపైన అయినా కోరిక కలిగి ఉండే వారు.

కాగా... ట్రాన్స్‌ జెండర్‌ ను మూడో జెండర్‌ గా గుర్తిస్తూ 2014లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో వారు ట్రాన్స్‌ జెండర్ కోటాలో ఉద్యోగాలు, విద్యావకాశాల్లో రిజర్వేషన్ పొందే అవకాశం కలిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్వలింగ సంపర్కుల వివాహం చట్టబద్ధత అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది.