జీపీటీ5 వచ్చేసిందోచ్.. ఈ వెర్షన్ తో ఎన్ని లాభాలంటే?
వాడకం మొదలు పెట్టే విషయంలో భారతీయులు కాస్త ఆలస్యంగా మొదలు పెడతారు. కానీ.. ఒకసారి వాడకం మొదలయ్యాక ఆ స్పీడ్ వేరే లెవల్ ఉంటుంది.
By: Garuda Media | 9 Aug 2025 9:25 AM ISTవాడకం మొదలు పెట్టే విషయంలో భారతీయులు కాస్త ఆలస్యంగా మొదలు పెడతారు. కానీ.. ఒకసారి వాడకం మొదలయ్యాక ఆ స్పీడ్ వేరే లెవల్ ఉంటుంది. అది టెక్నాలజీ అయినా ఇంకేమైనా. ప్రపంచ గతిని మార్చేసిన ఏఐకి సంబంధించి.. ఓపెన్ ఏఐ సంస్థ విడుదల చేసిన చాట్ జీపీటీకి ఎంతటి ఆదరణ ఉందన్న విషయం తెలిసిందే. గడిచిన కొద్ది కాలంలో సామాన్యుడు మొదలు అసమాన్యుడి వరకు ఏఐను ఎంతలా వాడేస్తున్నది తెలిసిందే.
మనోళ్ల వాడకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్ మన్. ఓపెన్ ఏఐకు అమెరికా తర్వాత భారత్ అతి పెద్ద మార్కెట్ గా పేర్కొన్న ఆయన.. భారత్ లో తమ టూల్ వినియోగం అంతకంతకూ ఎక్కువ అవుతోందని.. ఈ స్పీడ్ చూస్తుంటే.. త్వరలో అమెరికాను భారత్ దాటేస్తుందన్నారు. వ్యాపార సంస్థలు మొదలు సాధారణ ప్రజల వరకు భారత్ లో ఏఐ వినియోగం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉందన్నారు.
అంతేకాదు.. ఏఐను ఉపయోగిస్తున్న తీరు.. దాన్ని అసరాగా చేసుకొని చేస్తున్న ప్రయోగాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లుగా చెప్పారు. ఏఐతో భారతీయులు చేస్తున్న ప్రయోగాలు గొప్పవన్న శామ్.. ఓపెన్ ఏఐ ఉత్పత్తులని భారత్ లో మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. తాజాగా ఓపెన్ ఏఐకు సంబంధించి జీపీటీ 5 వెర్షన్ ను అధికారికంగా విడుదల చేశారు. ఇందులో మరింత అడ్వాన్స్ డ్ మోడల్ టూల్స్ అందుబాటులోకి వస్తాయి.
ముఖ్యంగా స్పీడ్.. విశ్లేషణ సామర్థ్యంలో ఇంతకు ముందున్న మోడళ్ల కంటే మెరుగ్గా ఉంటుందని ఓపెన్ ఏఐ చెబుతోంది. ఏఐ రంగంలో జీపీటీ 5 ఒక పెద్ద అడుగ్గా సంస్థ చెబుతోంది. కోడింగ్. మ్యాథ్స్.. రైటింగ్. హెల్త్ కేర్ లాంటి రంగాల్లో పీహెచ్ డీ స్థాయిలో ఆన్సర్ ఇవ్వగలదని.. ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత శక్తివంతమైన మోడల్ గా ఓపెన్ ఏఐ చెబుతోంది. తాజా వెర్షన్ సైతం సాధారణ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
అయితే.. చాట్ జీపీటీ ప్లస్.. ప్రో చందాదారులకు మాత్రం జీపీటీ5 ప్రో వెర్షన్ అందుబాటులో ఉంచారు. దీంతో.. మరింత కచ్ఛితమైన సమాధానాల్ని పొందే వీలుందని చెబుతున్నారు. ఎప్పటిలానే సాధారణ వినియోగదారులకు పరిమితంగా మాత్రమే యాక్సెస్ చేసే వీలుంది. అయితే.. ప్లస్ చందాదారులకు మోడల్ సెలక్షన్ మెనూలో కనిపించే జీపీటీ 5 థింకింగ్ ఆప్షన్ సాధారణ వినియోగదారులకు ఉండదు. అయితే.. సాధారణ వినియోగదారులు think deeply about this అనే ప్రాంప్ట్ తో అదే తరహా జవాబులు పొందే వీలుందని చెబుతున్నారు.
