Begin typing your search above and press return to search.

#ViralNews - సూపర్ స్పీడ్ వెడ్డింగ్.. మున్సిపల్ చైర్‌పర్సన్‌ పదవి కోసం ఆఘమేఘాలపై పెళ్లి!

By:  Tupaki Desk   |   14 Oct 2026 8:02 PM IST
#ViralNews - సూపర్ స్పీడ్ వెడ్డింగ్.. మున్సిపల్ చైర్‌పర్సన్‌ పదవి కోసం ఆఘమేఘాలపై పెళ్లి!
X

పెళ్లంటే నూరేళ్లు పంట.. కలకాలం కలిసి వుండాలని మంచి ముహూర్తం చూసుకుని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. భార్యభర్తలుగా అన్యోన్య జీవితం గడిపేందుకు పెద్దల ఆశీస్సులతో ముందడుగు వేస్తారు. కానీ, స్థానిక ఎన్నికల వేళ ఇవేవీ లేకుండా ఎన్నికల ప్రకటనే శుభ ముహూర్తంగా భావించి ఓ కొత్త జంట పెళ్లి చేసుకున్నారు. 8 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఆ జంట.. మరో ఆరు నెలల తర్వాత పెద్దలు, కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకోవాలని ముందుగా అనుకున్నారు. కానీ, ఇంతలో విడుదలైన స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ప్రేమ జంటను పెళ్లి పీటలు ఎక్కించింది. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ టీడీపీ నాయకుడు వైకుంఠం హర్షవర్ధన్ వివాహం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక చర్చగా మారింది.

సాలూరు టీడీపీ నేత వైకుంఠం హర్షవర్ధన్ వివాహం ఈ స్థానిక ఎన్నికలకే హైలెట్ గా మారిందని అంటున్నారు. దాదాపు 8 ఏళ్లుగా తన దగ్గర బంధువుతో ప్రేమలో ఉన్న హర్షవర్ధన్.. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ప్రకటన వచ్చిన గంటలోనే పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఆఘమేఘాలపై తన ప్రేయసి మంజీరాను వివాహం చేసుకుని పదవి కోసం ఎంత దూరమైనా వెళ్తా.. ఏడు అడుగులు వేయడం ఒక లెక్కా అని నిరూపించడని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మున్సిపల్ చైర్మనుగా పోటీ చేయాలని భావించిన హర్షవర్ధన్ చాలాకాలంగా పట్టణంలో చురుగ్గా పనిచేస్తున్నాడని చెబుతున్నారు. అయితే రిజర్వేషన్ల రోస్టర్ లో ఈ సారి సాలూరు మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వు కాగా, ఆయన వెంటనే వివాహం చేసుకుని తన భార్యను మున్సిపల్ చైర్ పర్సన్ గా ముందుకు తీసుకురావడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు.

అధిష్టానం కరుణిస్తుందా?

పదవి కోసం హర్షవర్ధన్ ఆఘమేఘాలపై వివాహం చేసుకున్నాడనే సమాచారం అధికార తెలుగుదేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హర్షవర్ధన్ కుటుంబం తొలి నుంచి రాజకీయాల్లో ఉండగా, ఆయన గత ఎన్నికల్లో టీడీపీ కౌన్సిలరుగా పనిచేశారు. ఇక గత రెండున్నరేళ్లుగా మంత్రి సంధ్యారాణి ముఖ్య అనుచరుడిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకున్నట్లు చెబుతున్నారు. అయితే హర్షవర్ధన్ కు రిజర్వేషన్ కలిసిరాకపోయినా, పదవిపై ఆశతో ఘనంగా చేసుకోవాల్సిన వివాహాన్ని ఆకస్మాత్తుగా చేసుకోవడం పార్టీ వర్గాలను ఆకర్షించిందని అంటున్నారు. ఈ ఘటన పదవీ వ్యామోహానికి నిదర్శనంగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తుండగా, ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కునే చతురత ప్రదర్శించడం అభినందనీయమే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన సూపర్ స్పీడ్ వెడ్డింగ్ ను అధిష్టానం కూడా ఆశీర్వదించి చైర్ పర్సన్ టికెట్ ఇస్తుందా? అన్నదే ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు.