కన్నవారిని కాదంటే జీతం లేనట్టే.. ప్రభుత్వ కొత్త చట్టం దేనికి సంకేతం?
మతృ దేవోభవ, పితృ దేవోభవ లాంటివి మనం పుట్టినప్పటి నుంచే నేర్చుకున్నాం. వేదాలు, శాస్త్రాలు, ఉపనిశత్తుల్లో కూడా తల్లి, తండ్రికి ఇదే స్థానం వేశారు.
By: Tupaki Political Desk | 2 March 2026 10:00 PM ISTమతృ దేవోభవ, పితృ దేవోభవ లాంటివి మనం పుట్టినప్పటి నుంచే నేర్చుకున్నాం. వేదాలు, శాస్త్రాలు, ఉపనిశత్తుల్లో కూడా తల్లి, తండ్రికి ఇదే స్థానం వేశారు. అమ్మనాన్నల కంటే మిన్న ఏదీ లేదు. కానీ, ఈ మధ్య కాలంలో చాలా మంది తమ కన్నవారిని భారంగా భావిస్తున్నారు. రెక్కలొచ్చాక తల్లిదండ్రులను గాలికి వదిలేసే కొడుకులు, కూతుళ్ల సంఖ్య పెరిగిపోవడం బాధాకరం. ఇలాంటి వారికి గుణపాఠం చెప్పేలా, అలాగే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా నిలిచేలా ప్రభుత్వం సంచలన చట్టాన్ని తీసుకురాబోతోంది. అదేంటంటే.. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనం నుంచి నేరుగా కోత పెట్టి, ఆ సొమ్మును వారి తల్లిదండ్రులకే అందజేయడం. వినడానికి కఠినంగా ఉన్నా, బాధ్యతను విస్మరిస్తున్న వారికి ఇది ఒక గట్టి హెచ్చరికే అని చెప్పాలి.
చట్టం ఏం చెబుతోంది?
ప్రభుత్వం రూపొందిస్తున్న ఈ కొత్త చట్టం ప్రకారం.. ఎవరైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగి (నిబంధనల మేరకు) తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే, వారి పోషణకు డబ్బులు ఇవ్వకపోతే.. వారి జీతం నుంచి 10 శాతం నుంచి 15 శాతం వరకు కోత విధిస్తారు. ఈ కోత పెట్టిన సొమ్మును నేరుగా వారి తల్లిదండ్రుల పేరు మీద లేదా జాయింట్ ఖాతాలో జమ చేస్తారు. దీనివల్ల వృద్ధాప్యంలో వారు ఎవరి మీద ఆధారపడకుండా, గౌరవంగా బతికే అవకాశం ఉంటుంది.
ఎవరు రూపొందిస్తున్నారు?
ఈ చట్టం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా నియమించింది. సీఎస్ రామకృష్ణారావు, మాజీ సీఎస్ శాంతికుమారితో కూడిన ఈ కమిటీ ప్రస్తుతం చట్టానికి సంబంధించిన ముసాయిదాను (Draft) సిద్ధం చేస్తోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి ఆమోదం ముద్ర వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. 2023 నుంచి ఉద్యోగాల్లో చేరిన వారికి ఇది వర్తించనుంది. తల్లిదండ్రులు తమ పిల్లల నిర్లక్ష్యం గురించి ఫిర్యాదు చేస్తే, అధికారులు విచారణ జరుపుతారు. ఆ విచారణలో నిజమని తేలితే జీతంలో కోత అమలు చేస్తారు.
ప్రభుత్వ నిర్ణయంపై చర్చ..
ఈ విషయం బయటకు పొక్కడంతోనే జనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘తల్లిదండ్రులను చూసుకోవడం అనేది సంస్కారం, అది మనసు నుంచి రావాలి కానీ చట్టాల ద్వారా కాదు’ అని కొందరు అంటుంటే.. మరో వర్గం వారు మాత్రం ‘నీతులు చెబితే వినని కాలం ఇది.. బాధ్యత తెలియాలంటే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు ఉండాల్సిందే’ అని ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నవారు కొందరు ఉన్నారు. నిజమే కదా, కష్టపడి చదివించి, ఒక స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులను ముసలితనంలో వృద్ధాశ్రమాలకు పంపడం లేదంటే ఇంట్లోనే ఉంచి నరకం చూపించడం ఎంతవరకు న్యాయం?
భారతదేశం జీవనాడి కుటుంబ వ్యవస్థనే.. అలాంటి వ్యవస్థకు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ ఆధునిక కాలంలో ఆ బంధాలు తెగిపోతున్నాయి. ఒక ఉద్యోగికి తన జీతం ఎంత ముఖ్యమో, ఆ జీతం వచ్చే స్థాయికి చేర్చిన తల్లిదండ్రులు అంతకంటే ముఖ్యం. ప్రభుత్వం ఈ చట్టాన్ని కేవలం శిక్షగా కాకుండా, ఒక బాధ్యతగా గుర్తు చేసే ప్రయత్నంగా చూడాలి. కన్నవారిని ప్రేమగా చూసుకునే వారికి ఈ చట్టం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.., కానీ నిర్లక్ష్యం చేసే వారికి మాత్రం గట్టి గుణపాఠం అవుతుంది. అమ్మనాన్నలు మనకు కావాల్సింది డబ్బు కాదు, కొంచెం సమయం, ప్రేమ మాత్రమే. అది ఇవ్వలేని పక్షంలో ఇలాంటి చట్టాలు రాక తప్పవు మరి!
