యువస్ఫూర్తి....యంగ్ సర్పంచి సాక్షి రావత్
పది మంది నడిచే దారిలో నడవడం సులభం...పదిలం కూడా. కానీ ఆ యువతి అలా అనుకోలేదు. కొత్తగా ఏదైనా సాధించాలని అనుకుంది.
By: Tupaki Desk | 28 Nov 2025 6:00 PM ISTపది మంది నడిచే దారిలో నడవడం సులభం...పదిలం కూడా. కానీ ఆ యువతి అలా అనుకోలేదు. కొత్తగా ఏదైనా సాధించాలని అనుకుంది. ఏకంగా తన సొంతూరికి సర్పంచి అయ్యింది. సాక్షి రావత్...కేవలం 22 ఏళ్ళ వయసులో యువ సర్పంచిగా బాధ్యతలు చేపట్టి తన గ్రామాన్ని ప్రగతి పథాన పరుగులు పెట్టించగలుగుతోంది. రాజకీయాలంటే స్వార్థంతో కూడుకున్నవని, వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని యువత అనుకుంటున్న ఈ తరుణంలో...రాజకీయాల్లో యువత కూడా క్రియాశీలకంగా వ్యవహరించవచ్చని, ఓ రోల్ మోడల్ గా నిలవవచ్చని సాక్షి రావత్ నిరూపిస్తోంది.
బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన సాక్షిరావత్ ఉత్తరాఖండ్ కు చెందిన కుయి గ్రామానికి యువ గ్రామ్ ప్రధాన్ (సర్పంచి)గా గెలిచి దేశ ప్రజల దృష్టినీ ఆకట్టుకుంటోంది. బీటెక్ చదివాక నగరంలో కొలువు చేయాలనుకోలేదు సాక్షి. తనను పెంచి పెద్ద చేసిన పల్లె బాగోగులు చూసుకోవాలనుకుంది. మూలాలను మరచిపోని ఆమె మంచితనం చూసి గ్రామ ప్రజలు ముచ్చటగా సర్పంచిగా ఎన్నుకున్నారు. సాక్షి రావత్ సర్పంచి గా ఎన్నికయి యువతకు కొండంత స్పూర్తిగా నిలుస్తోంది. బతుకు తెరువు కోసమో, ఉద్యోగావకాశాల కోసమో పట్టణానికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదని, ఉన్న ఊరిలోనే వనరులను అన్వేషిస్తే కచ్చితంగా ఓ దారి కనిపిస్తుందని సాక్షి అంటోంది.
కుయి అనే కుగ్రామంనుంచి వచ్చిన సాక్షికి ప్రజాసేవ అంటే మొదట్నుంచి అమితమైన ఆసక్తి. సర్పంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుటుబం అన్నివిధాల ప్రోత్సహించిందని సాక్షి వివరించింది. గ్రామంలో పిల్లలకు మంచి బడి ఏర్పాటు చేయడం, యువతకు నైపుణ్యశిక్షణ ఇప్పించడం, గ్రామ ప్రజలకు డిజిటల్ విప్లవం గురించి పరిచయం చేయడం ఇవే సాక్షి ప్రధాన లక్ష్యాలు. పల్లెకు చక్కని రోడ్డు వచ్చేలా కృషి చేస్తోంది. పల్లె ప్రగతి నిర్మాణంలో స్థానిక మహిళల భాగస్వామ్యం అవసరం అంటోంది సాక్షి.
సాక్షి పావురిలో తన కాలేజీ అసైన్మెంట్లు చేస్తున్న సమయంలోనే స్థానిక సమస్యలపై అవగాహన కలిగింది. గ్రామావసరాలు ఏంటి, మౌలిక వసతుల కల్పన ఎలా చేయాలి తదితర అంశాలపై స్పష్టత ఏర్పడింది. ఈ అనుభవంతోనే కుయిలో తన సేవలు అందించాలని సాక్షి అనుకుంది. సాక్షి సర్పంచిగా తొలి అడుగు వేసింది. తన పల్లెను పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దాలని కోటి కలలు కంటోంది. తన విజయం మరెందరో యువతకు స్పూర్తి కావాలని ఆశిద్దాం.
