సాకెకు కోరుకున్న సీటు ఇచ్చిన జగన్
కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ గా చాలా కాలం పనిచేసిన వారు సాకే శైలజానాధ్. ఆయన హుందాగా రాజకీయం చేశారు.
By: Tupaki Desk | 30 April 2025 3:49 AMకాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ గా చాలా కాలం పనిచేసిన వారు సాకే శైలజానాధ్. ఆయన హుందాగా రాజకీయం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఆయన వైఎస్సార్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు.
విద్యావంతుడిగా సమర్ధ నేతగా సాకెకు పేరుంది. అలాగే సౌమ్యుడిగా రాజకీయంగా ప్రజలతో ఎలా మమేకం కావాలో తెలిసిన వారుగా పేరుంది. అటువంటి సాకెకు జగన్ కీలకమైన స్థానాన్ని ఇచ్చారు. ఆయన కోరుకున్న సింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి ఇనార్జిగా చేశారు.
ఈ సీటు నుంచి సాకె 2004, 2009లలో వరసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. అదే విధంగా ఆయన ఈ నియోజకవర్గంలో సొంతంగా పట్టు కలిగి ఉన్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే ఈ సీటు నుంచి 2019లో గెలిచిన జొన్నలగడ్డ పద్మావతిని కాదని వీరాంజనేయులుకి 2024లో వైసీపీ టికెట్ ఇచ్చింది.
అయితే ఆయన టీడీపీ కూటమి ప్రభంజనంలో ఓటమి పాలు అయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన చురుకుగా లేకపోవడంతో పాటు తగినంతగా పార్టీని పటిష్టం చేయకపోవడంతో ఆల్టర్నేషన్ వైసీపీ ఆలోచిస్తూ వస్తోంది ఈ నేపధ్యంలో సాకె శైలజానాధ్ వైసీపీలో చేరడంతో ఆయనకు ఈ సీటు ఇచ్చారు.
దాంతో 2029 ఎన్నికల్లో సాకే శైలజానాధ్ ఈ సీటు నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారు అన్నది ఖాయమైంది. ఆయనకు ఉన్న సొంత ఇమేజ్ తో పాటు పార్టీ బలం కూడా తోడు అయితే విజయం ఖాయమన్న భావన ఉంది.
ఇకపోతే ఈ సీటు నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేసిన జొన్నలగడ్డ పద్మావతి కానీ వీరాంజనేయులు కానీ ఏమి చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. వారు పార్టీలో కొనసాగుతారా లేక వేరే ఆలోచనలు చేస్తారా లేక పార్టీ అధినాయకత్వం వారి సేవలను వేరే విధంగా వాడుకుంటుందా అన్నది కూడా చూడాల్సి ఉంది.
ఏది ఏమైనా అనంతపురం జిల్లాలో బలమైన నేతగా ఉన్న సాకే శైలజనాధ్ కి తగిన అవకాశమే వైసీపీ ఇచ్చిందని అంటున్నారు. ఆయనను పార్టీ పీఏసీలో కూడా నియమించింది. అంతే కాదు ఆయన సేవలను కేవలం నియోజకవర్గానికే కాకుండా పూర్తి స్థాయిలో వాడుకోవాలని చూస్తోంది. మరి రానున్న రోజులల్లో సాకే ఏ విధంగా పార్టీ కోసం పనిచేస్తారు అన్నది చూడాల్సి ఉంది.