Begin typing your search above and press return to search.

ఎన్ని పొత్తులున్నా వైసీపీదే విజయం...సజ్జల చెప్పిన సీక్రేట్

ఏపీలో వైసీపీకి రెండవ సారి అధికార వైభోగం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   30 Aug 2023 4:18 PM GMT
ఎన్ని పొత్తులున్నా  వైసీపీదే విజయం...సజ్జల చెప్పిన సీక్రేట్
X

ఏపీలో వైసీపీకి రెండవ సారి అధికార వైభోగం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. వైసీపీని టచ్ చేసే సాహసం విపక్షాలకు లేదని అన్నారు. వైసీపీకి భారీ గెలుపు 2024లో సాధ్యపడుతుందని ఆయన అంటూ ఇది ఊరకే ఏమీ చేప్పడం లేదని అన్నారు

ఏపీలో మొత్తం ఓటర్లలో డెబ్బై శాతం మంది పూర్తి మద్దతు వైసీపీకే ఉందని, ఇది తమకు ఉన్న పూర్తి సమాచారమని ఆయన నిబ్బరంగా అసలు సీక్రేట్ చెప్పేశారు. అంటే నూటికి ముప్పయి శాతం మాత్రమే వ్యతిరేక ఓట్లు ఉందని, దాన్ని చీల్చినా కలుపుకున్నా తమకేమీ కాదని అన్నారు. ఒకవేళ ఎన్నికల నాటికి ఏమైనా ఇబ్బందులు వచ్చి పాజిటివ్ ఓట్ల షేర్ కనుక మరో పది శాతం తగ్గినా తమకు వచ్చిన ఇబ్బంది లేదని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో డ్యాం ష్యూర్ గా అరవై శాతం పైగా ఓట్ల షేర్ తో విజయ ఢంకా మోగిస్తామని ఆయన చెప్పారు. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ సహా అన్ని పార్టీ కలసికట్టుగా వచ్చినా వ్యతిరేక ఓట్లుని ఎన్ని సార్లు కలుపుకున్నా కూడా వైసీపీ గెలుపుని అసలు ఆపలేరని ఆయన అన్నారు. వైసీపీకి ఉన్నదే పాజిటివ్ ఓటు అని విపక్షాలు గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వమని అంటే అది పరిమితమని గుర్తించాలని ఆయన అంటున్నారు.

బీజేపీతో పొత్తుల కోసం చంద్రబాబు ఒక వైపు తాపత్రయం పడుతూ మరో వైపు వైసీపీని ఓడిస్తామని బీరాలు పలుకుతున్నారని అన్నారు. అసలు 175 సీట్లకు పోటీ పెట్టలేని చంద్రబాబు తమ గురించి మాట్లాడడం ఏమిటని ఎద్దేవా చేశారు. పొత్తులతోనే ఏపీలో పోటీకి దిగాలని చూస్తున్న చంద్రబాబు టీడీపీ గేట్లు తీస్తే వైసీపీ ఖాళీ అవుతుందని ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.

బీజేపీతో బాబుకు పొత్తు కలిపేందుకు ఒక వైపు పవన్ కళ్యాణ్ మరో వైపు బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. చంద్రబాబు అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వద్ద నంగి నంగి గా వంగి ప్రసన్నం చేసుకుంటున్నారని సెటైర్లు వేశారు. పాపం చంద్రబాబు బీజేపీ పొత్తుల కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆ వైపు నుంచి ఏ మాత్రం స్పందన లేకుండా ఉందని సజ్జల అంటున్నారు.

ఏపీలో టీడీపీకి జనాలు బ్రహ్మరధ పడుతున్నారు అని ఒక వైపు చెప్పుకుంటూ మరో వైపు పొత్తుల గురించి బాబు ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రకు కార్యకర్తలే లేరని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నపుడు ఏమి మంచి చేశామో రేపటి ఎన్నికలో ఏమి చేస్తామో చెప్పుకోలేని దైన్య స్థితిలో టీడీపీ ఉందని అన్నారు. ఎవరెన్ని పొత్తులతో వచ్చినా తమది ప్రజలతోనే పొత్తు ఉన్న పార్టీ అని సజ్జల అన్నారు.

పూర్తిగా ప్రజల పాజిటివ్ ఓట్లతోనే తాము మళ్లీ గెలుస్తామని సజ్జల స్పష్టం చేశారు. ఈ విషయంలో నో డౌట్ అని ఆయన అంటున్నారు. మొత్తానికి వైసీపీ గెలుపు ధీమాకు వెనక కారణం ఏంటన్నది సజ్జల సీక్రెట్ చెప్పేశారు. అందువల్ల విపక్షాలు వ్యతిరేక ఓటు ని చీల్చడం కాదు వైసీపీ పాజిటివ్ ఓటుని చీల్చే పనిలో ఉండాలేమో చూడాలి మరి.