Begin typing your search above and press return to search.

జరిగిందేమిటి.. చేస్తున్నదేమిటి.. సజ్జల షాకింగ్ వ్యాఖ్యలు!

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   13 Sep 2023 12:01 PM GMT
జరిగిందేమిటి.. చేస్తున్నదేమిటి.. సజ్జల షాకింగ్ వ్యాఖ్యలు!
X

చంద్రబాబు అరెస్టై రాజమండ్రి జైల్లో ఉంటే... ఆయన ఎందుకు అరెస్టయ్యాడు, ఏ నేరం చేశారు, ఎలా అయ్యారు అనే విషయాలు పక్కకు పోయి... మానవహక్కులకు భంగం అంటూ ఇష్యూనీ వ్యూహాత్మకంగా తప్పుదోపట్టిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును.. పక్కా ప్రణాళికతో రాష్ట్ర ఖజానాకు నేరుగా నష్టం కలిగిస్తే.. దొంగ కనిపిస్తుంటే.. సాక్ష్యాలు కనిపిస్తుంటే.. అతడిని అదుపులోకి తీసుకుంటే మానవహక్కులకు భంగం అని మాట్లాడటం ఏమిటని సజ్జల ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా కేవలం అనుమానంతో అరెస్ట్ చేస్తే తప్పుపట్టాలి కానీ.. పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకున్నా తప్పుబడతారా అని అన్నారు.

పైగా ఇది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే సెంట్రల్ ఇన్ వెస్టిగేషన్ ఏజెన్సీలు ఈ దోపిడీకి సంబంధించి వార్నింగ్ బెల్ ఇచ్చిందని.. దీంతో దోపిడీ చేసిన వ్యక్తే అధికారంలో ఉండటంతో ఆధారాలు చెరిపేశారని అన్నారు. ఇదే సమయంలో సీమన్స్ కంపెనీ సైతం తమకు సంబంధం లేదని చెబుతుందని గుర్తుచేశారు.

ఇదే సమయంలో సీమన్స్ సంస్థ స్వయంగా స్పందిస్తూ... తాము ఎలాంటి అగ్రిమెంటూ చేసుకోలేదని, తమకు సంబంధం లేకుండా సృష్టించబడిన ఎం.ఓ.యూ ల ద్వారా ఏపీ ప్రభుత్వ డబ్బులు దోపిడీకి గురయ్యాయనే విషయం వారి ఇంటర్నల్ ఇన్ వెస్టిగేషన్ లో తేలిందని... ఇదే సమయంలో ఈ నకిలీ ఎంవోయూలకు కారణమైన వ్యక్తి అరెస్టు కూడా అయ్యారని గుర్తుచేశారు.

ఇలా స్వయంగా సీమన్స్ సంస్థే తమకు సంబంధం లేదని చెబుతుంటే... అసలు తామెందుకు అన్ని వేళ కోట్లు పెడతామని ఎదురు ప్రశ్నిస్తుంటే... మరోపక్క డిజైన్ టెక్ వాళ్లు ఎదురు దబాయింపులకు పాల్పడుతున్నారని సజ్జల ఫైరయ్యారు. ఈ కేసు అర్ధం కావడానికి ఢిల్లీ నుంచి లాయర్లు రావాల్సిన అవసరం లేదు.. కాస్త ఇంగితం ఉన్న వారెవరికైనా ఇట్టే అర్ధమైపోతుందన్నట్లుగా సజ్జల రియాక్ట్ అయ్యారు.

ఇదే క్రమంలో... ఈ కేసు లోతు తెలుసు కాబట్టే చంద్రబాబు.. పీఎస్ శ్రీనివాస్ ని, వాసుదేవ్ ని రాత్రికి రాత్రి విదేశాలకు పంపించేశారని సజ్జల ఆరోపించారు. ఇదే సమయంలో ఈడీ కూడా ఎంటరైందని తెలిపారు! ఇదే సమయంలో వందల మంది లాయర్లు, కోట్ల మంది ప్రజలు... చంద్రబాబు రిమాండ్ కోసం కోర్టులో ఎంత సేపూ వాదన జరిగిందో చూశారని.. కేసు ఉంది కాబట్టే రిమాండ్ విధించారని అన్నారు.

కోర్టు కూడా సీఐడీ వాదను పరిగణలోకి తీసుకుని, కేసు ఉందని గ్రహించింది కాబట్టే రిమాండ్ కు పంపిస్తే... ఇంకా ఎదురుదాడి చేయడం కరెక్ట్ కాదని అన్నారు సజ్జల. ఇదే సమయంలో సానుభూతి కోసం ప్రయత్నాలు తప్ప మరొకటి కాదని, బాబు జైల్లో ఉండడమే తప్పైనట్లు టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారుని అన్నారు.

హౌజ్‌ కస్టడీ అడుగుతున్నారు.. అలా ఇంట్లో ఉంటే దాన్ని అరెస్ట్‌ అంటారా? ఇంట్లో ఉంచే దానికి అరెస్ట్‌ చేయడం ఎందుకు? అని ప్రశ్నించిన సజ్జల... చంద్రబాబును హింసిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తొన్నారని, దొంగల్ని పట్టుకుంటే హడావిడి చేస్తున్నారని.. ఫలితంగా... అసలు విషయం పక్కకి పంపే పనికి పూనుకుంటున్నారని ఫైరయ్యారు.