సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ.. రంగంలోకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్
విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
By: Tupaki Political Desk | 21 Jun 2026 3:00 PM ISTవిజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కేసులో నగరంలోని కృష్ణలంక పోలీసులపై బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణలతో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అంతేకాకుండా ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో సభ్యులుగా మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులను నియమించింది. ఇలా ఒక కేసు విషయంలో నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో దర్యాప్తు బృందాన్ని నియమించడం పరిశీలిస్తే ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తోందో అర్థమవుతోందని అంటున్నారు.
వాస్తవానికి ఈ కేసు విచారణను మొదట రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ కు అప్పగించారు. అయితే, ఆయన దర్యాప్తు మొదలు పెట్టేలోగానే విషయం మరింత తీవ్రమైంది. విపక్షం రంగంలోకి దిగడంతో సాయికృష్ణ అదృశ్యం కేసు రాజకీయ వివాదంగా మారింది. విపక్షం పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా, పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం, ప్రోత్సాహం ఉందంటూ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైందని అంటున్నారు. ఈ మిస్టరీని వీలైనంత త్వరగా పరిష్కరించి, వాస్తవాలను వెలికితీయాలనే లక్ష్యంతో ఐజీ స్థాయి అధికారితో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ ప్రత్యేక బృందంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం సమీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్ ను సభ్యులుగా నియమించారు. నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో కేసు మిస్టరీ వీలైనంత త్వరగా వీడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అటు ఈ కేసుపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మిస్టరీ చిక్కుముడి విప్పేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాయికృష్ణ మిస్సింగ్ తర్వాత ఆయనను పోలీసులు కొట్టి చంపేశారని, మృతదేహాన్ని దహనం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కృష్ణలంక స్మశాన వాటికలో అనాథ శవాలను దహనం చేశారా? అనే విషయమై ఆరా తీస్తున్నారు.
మే 24, 25 తేదీల్లో నాలుగు అనాథ మృతదేహాలను పోలీసులు తీసుకువెళ్లారని గుర్తించారు. ఈ మృతదేహాలన్నీ 45 నుంచి 50 ఏళ్ల వయసుకు చెందినవిగా చెబుతున్నారు. సాయికృష్ణ వయసు 25 మాత్రమే కావడంతో కుటుంబ సభ్యులు చెప్పిన విధంగా కృష్ణలంకలో అతడిని దహనం చేశారనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు. ఇక సాయికృష్ణ మిస్సింగ్ కు సంబంధించి తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీ పుటేజీని సేకరించినట్లు చెబుతున్నారు. దీనిని విశ్లేషించేందుకు మంగళగిరిలోని ఫోరోన్సిక్ ల్యాబ్ కు పంపారు.
ఇలాంటి సమయంలో కేసు విచారణను నలుగురు ఐపీఎస్ అధికారులకు అప్పగించడంతో ప్రభుత్వం ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉందని భావిస్తున్నారు. రాజకీయ విమర్శలు, వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా, వీలైనంత త్వరగా మిస్టరీని ఛేదించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు. సాయికృష్ణ మిస్సింగ్ లో కుల ప్రస్తావనలు పెరిగిపోవడం కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని వ్యాఖ్యానిస్తున్నారు. కేసు సున్నితమైన అంశంగా మారిపోవడంతో సాయికృష్ణ అదృశ్యం తర్వాత ఏమయ్యాడనే చిక్కుముడిని విప్పాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు.
