విజయవాడ సాయికృష్ణ కేసు : అక్కడి వరకు వచ్చి ఆగిన సిట్ దర్యాప్తు!
సాయికృష్ణ మిస్సింగ్ పై నమోదైన కేసులో సీఐ నాగరాజుతోపాటు నిందితులుగా ఉన్న కృష్ణలంక పోలీసుస్టేషన్ కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సోమవారం నగరంలోని సూర్యారావుపేట పోలీసుస్టేషన్ లో లొంగిపోయారు.
By: Tupaki Desk | 29 Jun 2026 7:41 PM ISTరాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ మిస్సింగ్ పై నమోదైన కేసులో సీఐ నాగరాజుతోపాటు నిందితులుగా ఉన్న కృష్ణలంక పోలీసుస్టేషన్ కు చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సోమవారం నగరంలోని సూర్యారావుపేట పోలీసుస్టేషన్ లో లొంగిపోయారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రౌడీషీటర్ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ అయ్యాడని సిట్ అధికారులు అనుమానిస్తుండగా, ఇందులో మొత్తం నలుగురి పాత్ర ఉందనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. నలుగురిలో సీఐ నాగరాజు, ఆయన సన్నిహితుడిని ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని లొంగిపోవడంతో సాయికృష్ణ మరణించాడా? మరణిస్తే అతడి మృతదేహం ఏమైందనే ప్రశ్నలకు జవాబు లభించే అవకాశం ఉందని అంటున్నారు.
సీఐ నాగరాజు అరెస్టు తర్వాత సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ వీడుతుందని భావించినా, ఆయన నోరు విప్పకపోవడంతో కేసు పరిష్కారంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ కేసులో కీలకంగా చెబుతున్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని వారం రోజులుగా పరారీలో ఉండటంతో సాయికృష్ణ కేసులో ఆ ఇద్దరి పాత్రపై అనుమానాలు బలపడ్డాయని అంటున్నారు. పోలీసు కస్టడీలోనే సాయికృష్ణ చనిపోయాడని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొందని చెబుతున్నారు. అయితే మృతదేహం ఏమైందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహం ఏం చేశారనేది తేల్చేందుకు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని నుంచి వివరణ తీసుకోవాలని సిట్ భావించిందని చెబుతున్నారు.
అయితే, సిట్ పిలిచినప్పుడు ఆ ఇద్దరు రాకపోవడమే కాకుండా, వారం రోజులుగా విధులకు గైర్హాజరు అవడంతో అనుమానాలు పెరిగిపోయాయని అంటున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు స్వయంగా లొంగిపోవడంతో కేసు దర్యాప్తులో పురోగతి వస్తుందని ఆశిస్తున్నారు. సాయికృష్ణ పోలీసు కస్టడీలో మరణిస్తే ఎప్పుడు మరణించాడు? ఎలా మరణించాడన్న విషయం కూడా తెలుస్తుందని అంటున్నారు. అదే సమయంలో కస్టడీలో సాయికృష్ణ మరణిస్తే ఆ సమాచారం పోలీసు ఉన్నతాధికారులకు ఎందుకు తెలియజేయలేదు అన్న అంశంపైనా సమాచారం రాబడతారని అంటున్నారు.
మొత్తానికి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన సాయికృష్ణ కేసు ఎప్పటికి కొలిక్కి వస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని ఇచ్చే సమాచారమే కేసు చిక్కుముడి విప్పుతుందని భావిస్తున్నారు. వారు ఇచ్చే సమాచారంతో మరికొందరిని అరెస్టు చేస్తారా? లేకా కేసును ఇక్కడితో ముగిస్తారా? అన్నది కూడా చూడాల్సివుందని అంటున్నారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుతోపాటు పోలీసు స్టేషన్ లో సీసీ కెమెరా పుటేజ్ మాయం, సాయికృష్ణ మృతదేహాన్ని రహస్యంగా దహనం చేసిన వైనంపైనా సిట్ దర్యాప్తు కొనసాగించాల్సివుందని అంటున్నారు. దీంతో ఈ కేసు మరికొందరి తలకు చుట్టుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
