Begin typing your search above and press return to search.

సచిన్ ఇంటి ముందు బచ్చు కడు అనుచరుల నిరసనలు..!

సచిన్ టెండూల్కర్‌ కు నిరసన సెగ తగిలింది. బాంద్రాలోని ఆయన ఇంటి ముందు పలువురు ఆందోళన కారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   1 Sep 2023 3:58 AM GMT
సచిన్ ఇంటి ముందు బచ్చు కడు అనుచరుల నిరసనలు..!
X

సచిన్ టెండూల్కర్‌ కు నిరసన సెగ తగిలింది. బాంద్రాలోని ఆయన ఇంటి ముందు పలువురు ఆందోళన కారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలకు దిగిన వారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అనుచరులు కావడం గమనార్హం. ఈ సందర్భంగా సచిన్ టెండుల్కర్ జూదాన్ని ప్రోత్సహిస్తున్నాడంటూ వారంతా ఫైరవుతున్నారు.

అవును... మహారాష్ట్ర రాజధాని ముంబయిలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ ఇంటి ముందు భారీగా నిరసనలు జరిగాయి. స్థానిక ప్రహార్‌ జనశక్తి పక్ష ఎమ్మెల్యే ఓం ప్రకాష్ బాబారావు (బచ్చూ కాడూ) తన అనుచరులతో కలసి నిరసన చేపట్టారు. ప్రతిష్ఠాత్మక భారతరత్న పురస్కార గ్రహీత అయిన సచిన్.. యువత జీవితాలను నాశనం చేసే ఆన్‌ లైన్‌ గేమ్స్‌ కు ప్రచారం చేయడం ఏంటని నిలదీశారు.

వివరాళ్లోకి వెళ్తే... ఇటీవల సచిన్ టెండుల్కర్ "పేటీఎం ఫస్ట్" అనే ఆన్‌ లైన్ గేమ్ కోసం ఒక యాడ్ చేశారు. వాస్తవానికి ఇదొక గేమింగ్ యాప్. అయితే ఇందులో గేమ్స్ ఆడడమే కాకుండా డబ్బులు కూడా పెట్టే అవకాశం ఉంది. తద్వారా డబ్బులు సంపాదించడమే కాకుండా పోగొట్టుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

దీంతో ఇది జూదం అనేది వారి వాదన. అవును... ఇలాటి వాటిని ఫాంటసీ గేమ్స్ అని పిలుస్తున్నప్పటికీ.. ఒక రకంగా ఇది కూడా జూదమే అని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఇది వాస్తవమే అనే విషయం సచిన్ కు తెలియకపోవడం దారుణం అని అంటున్నారు.

దీంతో ఆ ఇలాంటి గేమ్స్ కు సంబంధించిన ప్రకటనల ప్రమోషన్ నుంచి సచిన్ తప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ యాడ్‌ లో నటించినందుకు గానూ సచిన్‌ కు ఇప్పటికే తాము నోటీసులు కూడా పంపించినట్లు ఆందోళనకారులు తెలిపారు. ఆగష్టు 30 వరకు సమయం ఇచ్చినా సచిన్ స్పందించలేదన్నారు.

ఈ సందర్భంగా వారు మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఒక వేళ సచిన్ భారతరత్న గ్రహీత కాకపోయి ఉంటే తాము ఆందోళన చేసే వాళ్లం కాదని నిరసనకారులు తెలిపారు. భారతరత్న అయిన వ్యక్తి ఇలాంటి ఆన్‌ లైన్ గేమ్స్‌ ను ప్రోత్సహించడం సరైన ఆలోచన కాదన్ని వారు అన్నారు. ఇదే సమయంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని అనుకుంటే... తన భారతరత్నను వెనక్కి ఇచ్చేయాలని వారు డిమాండ్ చేయడం గమనార్హం.

అయితే నిరసనలకు దిగిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆందోళన కారులను బాంద్రా పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. మరి ఈ విషయంపై సచిన్ ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.