చేవెళ్ల చెల్లెమ్మకు క్లీన్ చిట్.. చెరిగిపోయిన రాజకీయ నింద
భర్త చాటు భార్యగా.. ముగ్గురు కుమారుల తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చిన ఆమె అనూహ్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టారు..
By: Tupaki Desk | 6 May 2025 12:40 PMభర్త చాటు భార్యగా.. ముగ్గురు కుమారుల తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చిన ఆమె అనూహ్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టారు..
భర్త రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో అనుకోని విధంగా ఎన్నికల్లో పోటీచేశారు. ఆపై తిరుగులేని నాయకురాలు అయ్యారు.
2003లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి చరిత్రాత్మక పాదయాత్ర చేపట్టి ఆమెను చేవెళ్ చెల్లెమ్మగా పేర్కొన్నారు. అయితే, అటు భర్త హయాంలోగానీ, ఇటు తన రాజకీయ జీవితంలో గానీ ఆమె ఎదుర్కొన్నది ఒక్కటే ఒక్క ఆరోపణ.
ఇదంతా ఉమ్మడి ఏపీ మాజీం హోం మంత్రి, తెలంగాణలోనూ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గురించి. తాజాగా
ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు.. తుది తీర్పు ఇస్తూ సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా ప్రకటించింది. దీంతో 15 ఏళ్లుగా ఆమె ఎదుర్కొంటున్న ఆరోపణల నుంచి విముక్తి లభించినట్లయింది.
2004-09 మధ్య కాలంలో సబితా ఉమ్మడి ఏపీలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే ఉమ్మడి అనంతపురంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ తవ్వకాలపై కేసు నమోదైంది. దీంతో సంబంధిత శాఖ మంత్రిగా సబిత కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో ఆమెకు పెద్ద ఊరట దక్కింది.
అన్న ఎన్టీఆర్ పాలనలో ఉమ్మడి ఏపీ హోంమంత్రిగా పనిచేసిన, బలమైన నాయకుడిగా పేరున్న ఇంద్రారెడ్డి సతీమణి అయిన సబిత.. 2000 (ఉపఎన్నిక), 2004లో చేవెళ్ల నుంచి, 2009, 2014లో మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో ఓడినా 2023లో నెగ్గారు.
వైఎస్ రెండో విడత సీఎం అయిన సమయంలో హోం మంత్రిగా ఉన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ల మంత్రివర్గంలో పనిచేశారు.
మంచి నాయకురాలిగా పేరున్న సబిత.. తనను అడిగితే లేదనకుండా సాయం చేస్తారనే పేరుతెచ్చుకున్నారు. కొన్నాళ్ల నుంచి పెద్ద కుమారుడు కార్తీక్ రెడ్డిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నారు.
ప్రస్తుతం కార్తీక్ రెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జిగా ఉన్నారు.