Begin typing your search above and press return to search.

రైతుబంధుకు మాత్రమే అనుమతెందుకు ?

కేంద్ర ఎన్నికల కమీషన్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. పోలింగ్ మరో నాలుగురోజులుందనగా రైతుబంధు పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

By:  Tupaki Desk   |   26 Nov 2023 12:30 PM GMT
రైతుబంధుకు మాత్రమే అనుమతెందుకు ?
X

కేంద్ర ఎన్నికల కమీషన్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. పోలింగ్ మరో నాలుగురోజులుందనగా రైతుబంధు పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ఏ ప్రభుత్వానికి కమీషన్ ఇలాంటి అనుమతి ఇవ్వదేమో. అలాంటిది కేసీయార్ ప్రభుత్వానికి మాత్రమే ఎందుకని అనుమతిచ్చిందనేది ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, విమర్శలపై జనాల్లో చర్చలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ప్రభుత్వం కేంద్రఎన్నికల కమీషన్ కు మూడు లేకలు రాసింది.

అందులో రుణమాపీ అమలు, ఉద్యోగులకు మూడు డీఏల విడుదల, రైతుబంధుకు అనుమతి ఉన్నాయి. రుణమాఫీ అమలుకు, ఉద్యోగులకు మూడు డీఏలు విడుదల చేయటానికి ఎన్నికల కమీషన్ ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. అలాంటిది ఇన్నిరోజులు వెయిట్ చేసి పోలింగ్ మరో నాలుగురోజులుండనగా రైతుబంధు పథకం అమలుకు మాత్రమే ఎందుకు అనుమతి ఇచ్చిందన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. రుణమాఫీ హామీ 2018 ఎన్నికల నాటిది. అప్పటినుండి పథకం అమలుచేయకుండా ఆరుమాసాల ముందు మాత్రమే ప్రక్రియను కేసీయార్ మొదలుపెట్టారు. రైతులకు ఆగ్రహం వస్తే ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతోనే రుణమాపీ మొదలుపెట్టారు.

అయితే కొంతవరకు క్లియర్ చేసినా ఇంకా సుమారు 20 లక్షల మంది రైతులకు దాదాపు రు. 8 వేలు రుణాలు మాఫీ చేయాల్సుంది. అలాగే ఉద్యోగులకు మూడు డీఏలు చాలాకాలంగా పెండింగులో ఉన్నాయి. వీటన్నింటినీ ఎన్నికల సమయంలో క్లియర్ చేసి జనాల్లో మైలేజీ తెచ్చుకోవాలన్నది కేసీయార్ ఆలోచన.

అయితే ఒకేసారి వేల కోట్లరూపాయల పంపిణీకి ఖజనాలో అవకాశంలేదు. అందుకనే కమీషన్ కు లేఖ రాశామని చెప్పుకుని కాలక్షేపం చేస్తున్నారు. అయితే కమీషన్ మాత్రం రైతుబంధుకు మాత్రమే అనుమతిచ్చి మిగిలిన రెండు లేఖలను పెండింగులోనే ఉంచేసింది. దీనికి కారణం ఏమిటో కేసీయార్, ఎన్నికల కమీషనే సమాధానం చెప్పాలి. ఇక్కడే రేవంత్ మాట్లాడుతు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టే కేసీయార్ నాటకాలాడుతున్నట్లు ఆరోపించారు. ఉన్న డబ్బుతో రైతుబంధు అమలుచేసి చేతులు దులిపేసుకుంటారని మండిపడ్డారు. మరి రైతుబంధు పథకంలో రు. 5 వేల కోట్లు ఎలా వేస్తుందో చూడాలి.