'సూపర్ 6': లేటైతే.. లాభం కాదు.. నష్టమే!
కూటమి ప్రభుత్వానికి సెగ పెరుగుతోంది. గత ఏడాది ఎన్నికలకు ముందు ఇచ్చిన `సూపర్ 6` హామీల్లో కీలకమైన.. రైతు భరోసాపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనకు రెడీ అవుతున్నారు.
By: Tupaki Desk | 17 July 2025 10:00 AM ISTకూటమి ప్రభుత్వానికి సెగ పెరుగుతోంది. గత ఏడాది ఎన్నికలకు ముందు ఇచ్చిన `సూపర్ 6` హామీల్లో కీలకమైన.. రైతు భరోసాపై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనకు రెడీ అవుతున్నారు. కేంద్రం ఇచ్చే `పీఎం కిసాన్`పథకంతో కలిపి ఈ సొమ్ములు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఇప్పటికి మూడు సార్లు డేట్లు ప్రకటించినా.. వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాస్తవానికి జూన్ 20నే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. దీనికి ముందు మేలోనే వేస్తామన్నారు. కానీ.. రెండు సార్లు వాయిదాలే సాగాయి. ఇక, జూలై 15న రైతుల ఖాతాల్లో నిధులు పడడం ఖాయమని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కూడా చెప్పారు.
కానీ.. ఎప్పటికప్పుడు దీనిపై వాయిదాల పర్వాన్నే కొనసాగిస్తున్నారు. పీఎం కిసాన్ నిధులు ఇచ్చినప్పుడు ఇస్తామని తాజాగా మంత్రి నారాయణ కూడా ప్రకటించినా.. రైతుల్లో మాత్రం సంతృప్తి, నమ్మకం కలిగించలేక పోయారు. దీంతో ఈ హామీపై రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు ఎరువుల ధరలు మండిపోతున్నాయని.. మార్కెట్‌లో నకిలీ విత్తనాలను కట్టడి చేసే యంత్రాంగం కూడా కరువైందని చెబుతున్నారు. దీనికితోడు ఖరీఫ్ అదును తప్పుతోందని చెబుతున్నా.. ప్రభుత్వం నుంచి సొమ్ములు అందడం లేదని అంటున్నారు. తమ కుటుంబాల ఆస్తులను తాకట్టు పెట్టి పంటలు పండిస్తున్నా.. గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సుమారు వంద మందికిపైగా రైతులు తాజాగా వ్యవసాయ మంత్రిత్వ శాఖకు వచ్చి..అర్జీలు సమర్పించారు. అసలు భరోసా నిధు లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని అధికారులను నిలదీశారు. మీరు ఇవ్వకపోతే.. చెప్పాలని ప్రశ్నించారు. ఈ క్రమంలో కొందరు రైతులు సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత జగన్ ప్రభుత్వం బాగుందన్న వారు కూడా కనిపించారు. ఈ పరిణా మాలతో అధికారులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఇదిలావుంటే.. లేటైతే .. ఈ పథకం ఇచ్చినా.. తమకు ఎలాంటి న్యాయం జరగబోదని.. అప్పులకు వడ్డీలు కట్టుకునేందుకు మాత్రమే భరోసా నిధులు ఉపయోగపడతాయని చెబుతున్నారు.
ఇక, గత ఏడాది కూడా రైతులకు భరోసా నిధులు విడుదల చేయలేదు. కొత్త ప్రభుత్వం జూన్‌లో ఏర్పడడంతో అప్పటికే ఖరీఫ్ ప్రారంభమైంది. దీంతో భరోసాకు కొంత సమయం కావాలని సర్కారు ప్రకటించింది. లబ్ధిదారులను గుర్తిస్తున్నట్టు తెలిపింది. ఆ తర్వాత.. ఈ ఏడాది ప్రారంభంలోనే మేలో ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత.. పీఎం కిసాన్ నిధులతో కలిపి ఇస్తామని ప్రకటించారు. కానీ, ఈ రెండు వాయిదాలు కూడా ముగిసిపోయినా.. ప్రభుత్వం తాత్సారం చేయడంతో రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు ఈ సమస్యను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
