Begin typing your search above and press return to search.

తీర నగరంపై 25 డ్రోన్లతో దాడి.. రష్యాకు ఎందుకంత పట్టు అంటే..?

20 నెలలు దాటింది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై.. ఇది కేవలం సైనిక చర్య అని చెప్పిన రష్యా.. ఆ తర్వాత అన్ని హద్దులను చెరిపేసింది.

By:  Tupaki Desk   |   3 Sep 2023 12:42 PM GMT
తీర నగరంపై 25 డ్రోన్లతో దాడి.. రష్యాకు ఎందుకంత పట్టు అంటే..?
X

20 నెలలు దాటింది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై.. ఇది కేవలం సైనిక చర్య అని చెప్పిన రష్యా.. ఆ తర్వాత అన్ని హద్దులను చెరిపేసింది. ఉక్రెయిన్ లోని దాదాపు 30శాతం భూభాగాన్ని ఇప్పటికే కబళించింది. ఇప్పుడప్పుడే యుద్ధం ముగిసేలా లేదు. తొలినాళ్లలో ఆత్మరక్షణకు పరిమితమైన ఉక్రెయిన్ ఇప్పుడు ఎదురుదాడికి దిగుతోంది. ఏకంగా రష్యా రాజధాని మాస్కో, ప్రధాన నగరం సెయింట్ పీటర్స్ బర్గ్ ను లక్ష్యంగా చేసుకుంటూ డ్రోన్ దాడులు చేస్తోంది. దీంతో రష్యా సైతం కొంత కలవరపాటుకు గురవుతోంది.

తూర్పు ఉక్రెయిన్ రష్యా గుప్పిట

ఉక్రెయిన్ తూర్పు భాగం పేరు డాన్ బాస్. పారిశ్రామిక పారంతం ఇది. యూరప్ లోనే అతిపెద్దదయిన అణు కర్మాగారం జపోరిజ్జియా ఇక్కడే ఉంది. జపోరిజ్జియా ఉక్కు ప్లాంట్ కోసం గతంలో ఎంత పోరాటం జరిగిందో అందరూ చూశారు. సహజ వనరులకు లోటు లేని.. రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఉన్నందున డాన్ బాస్ పై రష్యాకు గురి. కాగా, 2014లోనే ఉక్రెయిన్ కు చెందిన క్రిమియాను రష్యా కలిపేసుకుంది. డాన్ బాస్-క్రిమియా సమీపంగా ఉంటాయి. ఇటీవల డాన్ బాస్ నూ గుప్పిటపట్టడంతో చాలాభాగం రష్యా ఆధీనంలోకి వెళ్లినట్లయింది. ఇప్పుడు రష్యా టార్గెట్ ఉక్రెయిన్ లోని ఒడెస్సా.

అందాల తీర నగరం ఒడెస్సా..

ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీరు మారింది. గతంలో భారీ క్షిపణి దాడులు, వాటి కూల్చివేతలు జరిగేవి. కొన్నాళ్లుగా డ్రోన్లను దాడులకు వాడుతున్నారు. ఆ క్రమంలోనే నల్ల సముద్రపు అందాల తీరంలో ఉండే ఒడెస్సా నగరంపై రష్యా 25 డ్రోన్లతో భారీ దాడికి యత్నం చేసింది. అయితే, వీటిలో 22 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్‌లోని అతి పెద్ద పోర్టు నగరం ఒడెస్సా. దీనిపై ఆధిపత్యం కోరుకుంటోంది రష్యా. అందుకే దక్షిణ ఒడెస్సా ప్రాంతంపై దాదాపు 25 డ్రోన్లను పంపింది. ఒడెస్సా పోర్టు.. ధాన్యం రవాణాకు అత్యంత కీలకం.

ఇరాన్ ఇచ్చిన డ్రోన్లు..

షహీద్‌ 136, 131 రకం డ్రోన్లను దక్షిణ, ఆగ్నేయ ఒడెస్సాపైకి ప్రయోగించింది రష్యా. ఇవి ఇరాన్ సమకూర్చిన డ్రోన్లు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఇరాన్ ఇలా సాయం చేస్తోంది. కాగా, ఆఫ్రికా దేశాలకు ఆహార కొరత ఆందోళన ఉన్నప్పటికీ.. ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం వహించిన నల్ల సముద్రపు ధాన్యం ఒప్పందం నుంచి జూలైలో రష్యా తప్పుకొంది. ఆగ్నేయ ఒడెస్సా, మైకలోవ్‌ ప్రాంతాలపై దాడులను తీవ్రం చేసింది. ఒడెస్సా నౌకాశ్రయంలోని కీలక సదుపాయాలను ధ్వంసం చేసింది.