Begin typing your search above and press return to search.

ఇంత జరిగిన తరువాత కూడా పుతిన్ కే మద్దతు కొనసాగుతుందా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రజాబలం పెరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ పట్టం కట్టేందుకు ప్రజలు మరోసారి సిద్ధమవుతున్నారు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 8:03 AM GMT
ఇంత జరిగిన తరువాత కూడా పుతిన్ కే మద్దతు కొనసాగుతుందా?
X

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రజాబలం పెరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ పట్టం కట్టేందుకు ప్రజలు మరోసారి సిద్ధమవుతున్నారు. ఉక్రెయిన్ పై దాడిని రష్యన్లు సమ్మతిస్తున్నారు. దీనికి వారి నుంచి భారీ మద్దతు లభించడం విశేషం. ఆయనకు 80 శాతం ప్రజలు మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో పుతిన్ విజయం పెద్ద కష్టమేమీ కాదని సర్వేలు తెలియజేస్తుండటం గమనార్హం.

రష్యాను పుతిన్ 24 ఏళ్లుగా పరిపాలిస్తున్నారు. దీంతో ఆయన విజయం సునాయాసమే అని చెబుతున్నారు. ఉక్రెయిన్ పై సైనిక చర్య తరువాత పుతిన్ పై మరింత విశ్వాసం పెరిగినట్లు సర్వేలు సూచిస్తున్నాయి. సెప్టెంబర్ లో నిర్వహించిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 2022 ఫిబ్రవరిలో మొదలైన యుద్ధంతో 68 శాతంగా ఉన్న పుతిన్ బలం ఇప్పుడు 78 శాతం పెరిగింది.

ఉక్రెయిన్ పై యుద్ధానికి పుతిన్ చెబుతున్న కారణాలను రష్యన్లు నమ్ముతున్నందున ఆయనే దేశానికి సమర్థుడైన అధ్యక్షుడని చెబుతున్నారు. పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవానీ జైలు నుంచి మాయమవడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అతడి జాడ ఆచూకీ లేకపోవడంతో సోమవారం అతడు కోర్టులో వర్చువల్ గా హాజరు కావాల్సి ఉంది. దీంతో అతడు కనిపించకుండా పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నవానీకి ఆగస్టులో 19 ఏళ్ల జైలు శిక్ష పడింది. మాస్కోకు 150 మైళ్ల దూరంలోని పీనల్ కాలనీ (జైలు)లో పెట్టినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ పై దాడిని రష్యా మరింత ముమ్మరం చేసింది. ఫోన్లు, అంతర్జాల సేవలకు హ్యాకర్లు విఘాతం కలిగిస్తున్నారు. దక్షిణాదిలోని ఖేర్సన్ పై దాదాపు 600 ఫిరంగులు, రాకెట్లతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ ను అతలాకుతలం చేస్తోంది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మంగళవారం అమెరికా చేరుకున్నాడు. ఉక్రెయిన్ కు మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా జెలెన్ స్కీ ఈ పర్యటన చేపడుతున్నాడు. అమెరికా చట్ట సభల అనుమతి కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయత్నిస్తున్న సందర్భంలో జెలెన్ స్కీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్ కు అమెరికా ఎంత మేర సహకరిస్తుందో? ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.