హిందూత్వ ఆధ్యాత్మిక వేటలో.. ఇద్దరు బిడ్డలతో అడవి గుహలో రష్యన్ మహిళ
అయితే, రామతీర్థ పర్వత ప్రాంతంలో గస్తీకి వెళ్లిన పోలీసులకు కంటబడడంతో అతికష్టమ్మీద బయటకు తీసుకొచ్చారు.
By: Tupaki Desk | 13 July 2025 9:22 AM ISTఅది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కుంటా తాలూకాలో ఉన్న దట్టమైన అడవి... కొన్నాళ్ల కిందట కొండచరియలు విరిగిపడిన ప్రాంతం.. పులులు, విష సర్పాలు తిరిగే అక్కడకు వెళ్లడమే ప్రమాదకరం.. కానీ, విదేశీ మహిళ ఏకంగా అక్కడి గోకర్ణా గుహలో తన ఇద్దరు కూతుళ్లతో తలదాచుకుంది. అది కూడా రెండు వారాలుగా కావడం గమనార్హం. అయితే, రామతీర్థ పర్వత ప్రాంతంలో గస్తీకి వెళ్లిన పోలీసులకు కంటబడడంతో అతికష్టమ్మీద బయటకు తీసుకొచ్చారు.
పాశ్చాత్య జీవన శైలితో విసిగిపోయిన వారు ఆధ్యాత్మిక వేటలో భారత దేశానికి వస్తుంటారు. కొందరు హిందూ సంప్రదాయం పట్ల ఆకర్షితులై వస్తుంటారు. అలా వచ్చినవారే రష్యాకు చెందిన నైనా కుటినా. 40 ఏళ్ల ఆమె మోహిగా పేరు మార్చుకున్నారు. ఈమెకు ఆరేళ్లు, నాలుగేళ్ల వయసు కుమార్తెలున్నారు.
నైనా బిజినెస్ వీసా మీద భారత్ కు వచ్చారు. హిందూత్వంతో పాటు ఆధ్యాత్మికతకు ఫిదా అయ్యారు. వీసా గడువు 2017లోనే తీరింది. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నారా? అనేది తెలియాల్సి ఉంది. గోవా నుంచి గోకర్ణాకు వెళ్తుండగా.. రామతీర్థ పర్వత ప్రాంతాన్ని ఇష్టపడ్డారు. దట్టమైన అడవిలో చిన్న నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రుద్ర విగ్రహాన్ని ఆరాధిస్తూ ధ్యానంలో నిమగ్నమయ్యారు.
రామతీర్థ పర్వతాల్లో శనివారం గస్తీకి వెళ్లిన పోలీసులకు నైనా కంటపడ్డారు. వివరాలు తెలుసుకుని నచ్చజెప్పి బయటకు తీసుకొచ్చారు. రష్యాకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దేశ ఎంబసీక వివరాలు అందించారు. స్థానిక ఆశ్రమంలో తాత్కాలికంగా ఉంచారు. కాగా, నైనా రెండు వారాలుగా ఇక్కడే ఉంటున్నా.. ఎవరూ గుర్తించలేదు. కారణం.. అత‍్యంత రహస్యంగా ఉండడమే. ఆఖరికి పోలీసులు గస్తీలో ఉండగా.. గుహ వద్ద దుస్తులు గమనించారు. మరింత పరిశీలించగా నైనా, ఆమె కుమార్తెలు కనిపించారు. ఈ రామతీర్థ కొండల్లోనే నిరుడు భారీగా కొండచరియలు పడ్డాయి. వన్య మృగాలు తిరిగే ప్రాంతం కూడా. అయినా నైనాకు ఏ ప్రమాదం జరగలేదు.
