గోకర్ణ గుహలో ఏళ్లకు ఏళ్లుగా ఉంటున్న రష్యన్ మహిళ ఏం చెప్పింది?
కానీ.. అందుకు భిన్నంగా కర్ణాటకలోని గోకర్ణ గుహలో రహస్యంగా జీవిస్తున్న రష్యన్ మహిళ.. ఆమె ఇద్దరి పిల్లల వ్యవహారం పెను సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 16 July 2025 9:47 AM ISTదట్టమైన అడవి.. అందులో ఒక గుహ. రాత్రి అయితే చిమ్మ చీకటి. కటిక నేలపైనే పడుకోవటం.. కరెంటు అన్నది ఉండదు. పాములు వచ్చిపోయే ప్రదేశంలో నలభై ఏళ్ల యువతి.. తన ఇద్దరు పిల్లలతో బతకటం సాధ్యమేనా? అంటే నో చెప్పేస్తారు. కానీ.. అందుకు భిన్నంగా కర్ణాటకలోని గోకర్ణ గుహలో రహస్యంగా జీవిస్తున్న రష్యన్ మహిళ.. ఆమె ఇద్దరి పిల్లల వ్యవహారం పెను సంచలనంగా మారింది. తొలుత ఆమె 2 వారాలుగా అడవిలో ఉంటున్నట్లు చెప్పినా.. పోలీసు విచారణలో అంతకు మించి.. కొన్నేళ్లుగా ఉంటున్న వైనాన్ని తెలుసుకొని షాక్ తింటున్న పరిస్థితి.
40 ఏళ్ల రష్యన్ మహిళను నైనా కుటినా అలియాస్ మోహిగా గుర్తించారు. ఆమెకు ఆరేళ్ల కుమార్తె (ప్రేయ).. నాలుగేళ్ల మరో కుమార్తె (అమా)లు ఉన్నారు. ఈ పిల్లలు ఇద్దరికి కరెంటు అన్నది ఒకటి ఉంటున్న విషయమే తెలీదట. అత్యంత క్లిష్ట వాతావరణంలో వారెలా జీవనం సాగించారు? ఏం తిన్నారు? ఎలా ఉంటున్నారు? అన్నది ప్రశ్నలుగా మారాయి. వారున్న గుహ ప్రాంతంలో ఇటీవల కొండ చరియలు విరిగిపడ్డాయి.
దీంతో.. పోలీస్ పెట్రోలింగ్ బృందం రామతీర్థ పర్వత ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న వేళ.. గుహ బయట దుస్తులు కనిపించటంతో అనుమానం వచ్చి అక్కడకు వెళ్లారు.అక్కడ ఒక విదేశీయురాలు తన ఇద్దరు పిల్లలతో ఉండటంతో అవాక్కు అయ్యారు. వారిని విచారించిన నేపథ్యంలో వారు ఈ తరహా జీవనాన్ని గడిచిన కొన్నేళ్లుగా చేస్తున్నట్లు గుర్తించారు. గడిచిన ఎనిమిదేళ్లుగా వారు గుహలు.. అడవుల్లోనే జీవించినట్లుగా తెలుసుకున్నారు.
2016లో బిజినెస్ వీసా మీద భారత్ కి వచ్చిన నీనా కుటీనా.. 2017 ఏప్రిల్ లో గడువు ముగిసిన తర్వాత అక్రమంగా ఉండిపోయారు. హిందూ ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులరాలైన ఆమె గోవా..గోకర్ణ లోని అడవులు.. గుహలు.. మారుమూల గ్రామాల్లో ఉండేందుకు ఆసక్తి చూపేది. ఆసక్తికరమైన అంశం ఏమంటే ఆమె ఇద్దరి పిల్లలు భారత్ లోనే పుట్టారు. వారి తండ్రులు ఎవరో ఆమె రివీల్ చేయట్లేదు. అంతేకాదు.. ఆమె తన ఇద్దరు పిల్లలు కోల్పోయినట్లుగా పోలీసుల విచారణలో గుర్తించారు. ఒకరి ఆస్తికలను పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఆమె స్పష్టంగా చెప్పట్లేదు.
ఆమె పిల్లల్ని ఎలా కన్నారన్న విషయాన్ని ఆమె చెప్పటానికి ఇష్టపడలేదని పోలీసులు చెబుతున్నారు. మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ పలు విషయాల్ని వెల్లడించటానికి ఆసక్తి చూపటం లేదు. వారున్న గుహలో రుద్ర శివుని విగ్రహం.. హిందూ దేవదల ఫోటోలు.. రష్యన్ పుస్తకాల్ని గుర్తించారు. ధాన్యం.. పూజలు చేస్తూ గడిపేవారని.. ఆకలి తీర్చుకోవటానికి ఇన్ స్టెంట్ నూడుల్స్ తినేవారని గుర్తించారు. ఫోన్ల గురించి కూడా పిల్లలకు ఏమీ తెలీదన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.
రామతీర్థ కొండలు.. కొండచరియలు విరిగే ప్రమాదకరమైన ప్రాంతం కావటం.. అక్కడ విష సర్పాలు.. ఇతర వ్యన్యప్రాణులతో నిండి ఉంటుంది కదా? మరి.. మీకు ప్రమాదకరం కాదా? అంటే ఆమె ఇస్తున్న సమాధానం ఆసక్తికరంగా మారింది. పాములు తమ స్నేహితులని.. తాము వాటిని ఇబ్బంది పెట్టనంత వరకు అవేమీ తమకు హాని చేయమని చెప్పటం విశేషం. గుహ నుంచి బయటకు తీసుకొచ్చిన వారిని ఒక ఆశ్రమంలో ఉంచారు. ఆమె పాస్ పోర్టు.. వీసా అడవిలో పోగొట్టుకున్నట్లు చెప్పినప్పటికి .. గుహకు దగ్గర్లో గుర్తించారు. తాము నేచర్ లో బతికేందుకు ఇష్టమని.. పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పిన ఆమె.. తమను ఉంచిన ఆశ్రమం శుభ్రంగా లేదని.. కేవలం అన్నం మాత్రమే పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆమెను విచారిస్తున్న పోలీసులు.. బిజినెస్ వీసా మీద వచ్చిన ఆమె.. ఆ తర్వాత ఎందుకు ఉండిపోయారు? ఆమె పిల్లలకు తండ్రి ఎవరు? డెలివరీ ఎలా చేయించుకున్నారు? మారుమూల గుహల్లోకి ఎలా వెళ్లేవారు. వారుండే ప్రాంతాల్ని ఎలా గుర్తించేవారు? వారికి అవసరమైన సాయాన్ని చేస్తున్న వారెవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లేని పరిస్థితి. తాను వీడియోలు చేయటం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నట్లు చెబుతున్నా.. కరెంటు కూడా తెలియకుండా పెంచిన పిల్లలకు కెమేరాలు.. ఇతర వస్తు సామాగ్రి అవగాహన ఉందా? లేదా? పిల్లలకు తాను చదువు చెప్పినట్లు చెబుతున్న వేళలో.. అందులో వాస్తవం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది
