యుద్ధంలో నరమాంస భక్షకులు.. ఇంటెలిజెన్స్ షాకింగ్ రిపోర్ట్!
నరమాంస భక్షకులు అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన అంశం అత్యంత షాకింగ్ గా ఉంది.
By: Tupaki Desk | 22 Jun 2025 4:15 PM ISTనరమాంస భక్షకులు అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన అంశం అత్యంత షాకింగ్ గా ఉంది. ఇందులో భాగంగా.. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యంలో నరమాంస భక్షకులు ఉన్నారని.. సైనికులను వారు తింటున్నారని.. ఈ విషయం గురించి ఇద్దరు రష్యన్ సైనికులు చర్చిస్తున్న ఫోన్ కాల్ ను ఉక్రెయిన్ మిలటరీ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గుర్తించిందని అంటున్నారు.
అవును... ఉక్రెయిన్ తో యుద్ధంలో ఫ్రంట్ లైన్ లలో పనిచేస్తున్న ఒక రష్యన్ సైనికుడు.. ఒక సహచరుడిని చంపి అతని శవాన్ని తిన్న తర్వాత మరణించాడని కైవ్ పోస్ట్ తెలిపింది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ సందర్భంగా.. తన దేశస్థుడైన 'ఫోమా'ను చంపిన నరమాంస భక్షకుడైన 'బ్రెలోక్' గురించి ఇద్దరు రష్యన్ సైనికులు చర్చిస్తున్నట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి!
ఈ సమయంలో... బ్రెలోక్ అతన్ని తిన్నాడని.. అతన్ని బయటకు తీసుకెళ్లి రెండు వారాల పాటు తిన్నాడని మొదటి కాల్ చేసిన వ్యక్తి మరో వ్యక్తితో చెప్పారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది! అలా నరమాంసం తిన్న బెర్లోక్.. తరువాత చనిపోయి కనిపించినట్లు 'అవుట్ లెట్' తెలిపింది. దీంతో.. ఉక్రెయిన్ లో పోరాడటానికి రష్యా హంతకులు, నరమాంస భక్షకులను నియమించుకుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి!
ఈ నేపథ్యంలో.. 2012లో నలుగురిని చంపి, 22 సంవత్సరాల జైలు శిక్ష విధించబడిన సఖాలిన్ కు చెందిన డెనిస్ గోరిన్ అనే వ్యక్తి.. అతడు చంపిన నలుగురిలో ఒకరి శరీరంలోని కొంత భాగాన్ని తిన్నాడని మాస్కో టైమ్స్ వెల్లడించింది! అయితే... ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున పోరాడటానికి అతను 2023లో విడుదలయ్యాడని తెలిపింది. అతను యుద్ధంలో గాయపడ్డాడని పేర్కొంది!
ఇదే సమయంలో.. 2008లో ఇద్దరు యువతులను చంపి వారి అవయవాలను వండుకుని తిన్న కేసులో దోషిగా తేలిన మరో నేరస్థుడు నికోలాయ్ ఒగోలోబియాక్ సైతం.. 2023లో రష్యా తరపున పోరాడటానికి విడుదలయ్యాడని చెబుతున్నారు. అదేవిధంగా... ముగ్గురు పురుషులను చంపి వారి గుండెల్లో ఒకదాన్ని ఫ్రై చేసిన కేసులో జైలు శిక్ష విధించబడిన దోషి డిమిత్రి మాలిషెవ్ ను కూడా రష్యా యుద్ధరంగంలోకి పంపినట్లు చెబుతున్నారు.
పుతిన్ పై జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు!:
సైనికుల మృతదేహాల అప్పగింత వ్యవహారంలో రష్యా తీరును ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తప్పుపడుతున్నారు. ఇదే సమయంలో.. ఆ దేశంతో జరుగుతున్న శాంతి చర్చలపైనా సందేహం వ్యక్తం చేశారు. అదేవిధంగా... రష్యా సైనికుల మృతదేహాలను కూడా ఉక్రెయిన్ సైనికులుగా చూపుతూ తమకు అప్పగిస్తున్నారని జెలెన్ స్కీ ఆరోపించారు.
అమెరికాను సంతృప్తిపరిచి, ఆంక్షల నుంచి తప్పించుకునేందుకే రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చల పేరిట నాటకం ఆడుతున్నారని విమర్శించిన జెలెన్ స్కీ.. దీనివల్ల ఉక్రెయిన్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుందని వ్యాఖ్యానించారు.
