Begin typing your search above and press return to search.

49 మందితో కుప్పకూలిన విమానం... షాకింగ్ వీడియో!

రష్యాలోని అంగారా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన ప్రయాణికుల విమానం కుప్పకూలిపోయింది.

By:  Tupaki Desk   |   24 July 2025 12:48 PM IST
49 మందితో కుప్పకూలిన విమానం... షాకింగ్  వీడియో!
X

రష్యాలోని అంగారా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన ప్రయాణికుల విమానం కుప్పకూలిపోయింది. చైనా సరిహద్దులో ఉన్న రష్యాలోని ఫార్ ఈస్ట్ ప్రాంతంలో 49 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం.. గమ్యస్థానానికి 15 కి.మీ. దూరంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. ఈ సమయంలో అది కూలిపోయినట్లు గుర్తించారు.

అవును... చైనాకు శివారున ఉన్న అమూర్‌ ప్రాంతంలోని టిండా ప్రాంతానికి వెళ్తుండగా రష్యా విమానం కుప్పకూలి పోయింది. మరికొద్దిసేపట్లో గమ్యస్థానానికి చేరుతుందనగా.. ఎయిర్ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ తో ఈ విమానానికి సంబంధాలు తెగిపోయినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్‌ ను సిద్ధం చేశారు.

ఈ సందర్భంగా... విమానం కోసం గాలించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో గమ్యస్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో అది కూలిపోయినట్లు గుర్తించారు. దీంతో.. అందులో ఉన్నవారంతా మరణించి ఉంటారని చెబుతున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది! ఆ సమయంలో విమానంలో ఐదుగురు పిల్లలు, ఆరుగురు సిబ్బంది సహా 49 మంది ప్రయాణిస్తున్నారు.

ఘటనా స్థలంలో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సమయంలో... రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ విమానం తొలుత ల్యాండింగ్‌ కు ప్రయత్నించినప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవగా... రెండోసారి ల్యాండింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా రాడార్‌ నుంచి గల్లంతై కూలినట్లు తెలుస్తోంది.

కాగా... గత సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో ముగ్గురు వ్యక్తులతో వెళ్తున్న రాబిన్సన్ ఆర్66 హెలికాప్టర్ ఇదే అముర్ ప్రాంతంలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతం మాస్కోకు తూర్పున దాదాపు 6,600 కి.మీ దూరంలో ఉంది.

మరోవైపు... విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు పెద్ద ఎత్తున పొగతో పాటు దుమ్ము కూడా కమ్ముకున్నట్లు స్టేట్ టెలివిజన్ న్యూస్ ఆర్టీ షేర్ చేసిన 17 సెకన్ల క్లిప్ చూపిస్తుంది. ఈ క్రమంలో... అముర్ ప్రాంతంలో విమానం శిథిలాలు కనుగొనబడ్డాయని అంటున్నారు.