Begin typing your search above and press return to search.

అది వలపు వల.. ఇది ఉద్యోగాల వల!

దేశ రహస్యాలను తెలుసుకోవడానికి త్రివిధ దళాల్లో పనిచేసేవారిపై శత్రు దేశాలు వలపు వల (హనీ ట్రాప్‌)ను ప్రయోగిస్తుంటాయి

By:  Tupaki Desk   |   8 March 2024 7:05 AM GMT
అది వలపు వల.. ఇది ఉద్యోగాల వల!
X

దేశ రహస్యాలను తెలుసుకోవడానికి త్రివిధ దళాల్లో పనిచేసేవారిపై శత్రు దేశాలు వలపు వల (హనీ ట్రాప్‌)ను ప్రయోగిస్తుంటాయి. అందమైన అమ్మాయిలతో ఆడియో, వీడియో కాల్స్‌ చేయించి దేశ సైనిక రహస్యాలను తెలుసుకోవడమే ఈ హనీ ట్రాప్‌ ఉద్దేశం.

ఇప్పుడు ఇలాగే హనీ ట్రాప్‌ లాగా యువకులపై ఉద్యోగాల వల (జాబ్స్‌ ట్రాప్‌) వేస్తున్న ముఠాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పట్టుకుంది. ప్రస్తుతం రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా తరఫున యుద్ధం చేయడానికి పెద్ద ఎత్తున యువత అవసరం పడుతోంది. దీంతో కొన్ని ఏజెన్సీలు, నకిలీ ఏజెంట్లు రష్యాలో ఉద్యోగాలంటూ యువకులకు వల విసురుతున్నాయి. భారీ జీతాలతోపాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయని నమ్మబలుకుతున్నాయి.

ఈ ఏజెన్సీలను, నకిలీ ఏజెంట్లను నమ్మి రష్యాకు వెళ్లినవారిని యుద్ధంలో సైనికులుగా, హెల్పర్లుగా వాడుకుంటున్నారు. ఇటీవల ఇద్దరు భారతీయులు రష్యా వెళ్లి ఇలాంటి పరిస్థితిలో మృతి చెందడంతో దేశవ్యాప్తంగా గగ్గోలు రేగింది. భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకుంది. భారతీయులను తిప్పి పంపాలని రష్యా ప్రభుత్వాన్ని కోరింది.

మరోవైపు రష్యాలో ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాలు, నెట్ వర్క్‌ లపై సీబీఐ దృష్టి సారించింది.

లాభదాయకమైన ఉద్యోగాల ముసుగులో రష్యా–ఉక్రెయిన్‌ వార్‌ జోన్‌ కు యువతను నియమించుకుని పంపుతున్నారనే ఆరోపణలపై వివిధ వీసా కన్సల్టెన్సీ సంస్థలు, ఏజెంట్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు అధికారులు తెలిపారు.

ఢిల్లీ, త్రివేండ్రం, ముంబై, అంబాలా, చండీగఢ్, మదురై, చెన్నై సహా దేశవ్యాప్తంగా 10కి పైగా ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సోదాల్లో ఇప్పటి వరకు రూ. 50 లక్షలకు పైగా నగదు, నేరారోపణ పత్రాలు, ల్యాప్‌ టాప్‌ లు, మొబైల్‌ ఫోన్లు, డెస్క్‌ టాప్‌ లు తదితర ఎలక్ట్రానిక్‌ రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

దాడులు చేపట్టిన అన్ని నగరాల్లో అనుమానితులను కూడా సీబీఐ తన అదుపులోకి తీసుకుంది. ఈ వీసా ఏజెంట్లు, కన్సల్టెంట్‌ల పనితీరుపై ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బాధితులను తప్పుదోవ పట్టించి విదేశాలకు పంపిన ఘటనలపై సీబీఐ ఇప్పటివరకు కనీసం 35 కేసులను నమోదు చేసింది. ఉచ్చులో చిక్కుకున్న బాధితుల సంఖ్యను నిర్ధారించడానికి, భారతదేశం నుంచి రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ ప్రాంతానికి ఇకపై అక్రమ రవాణా జరగకుండా నిరోధించడానికి సీబీఐ చర్యలు చేపడుతోంది.