అతిపెద్ద దాడి... ఒక్క రాత్రి, 60 క్షిపణులు, 477 డ్రోన్లు!
అవును... అతి పెద్ద గగనతల దాడి ఉక్రెయిన్ పై శనివారం రాత్రి జరిగింది. ఇందులో భాగంగా... ఒక్క రాత్రిలోనే రష్యా మొత్తం 537 ఆయుధాలను ఉక్రెయిన్ పైకి ప్రయోగించింది.
By: Tupaki Desk | 30 Jun 2025 12:19 AM ISTగత కొంతకాలంగా ఈ ప్రపంచంలోని కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఫలితంగా.. పౌర విమానాలతో సందడిగా ఉండాల్సిన గగనతలాలు.. క్షిపణులు, డ్రోనలతో ఎరుపెక్కిపోతున్నాయి. ఈ క్రమంలో మొన్న భారత్ - పాక్ యుద్ధ, నిన్న ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం మొదలై, ముగిసిపోయాయి కూడా. అయితే.. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మాత్రం అవిరామంగా కొనసాగుతోంది.
దాదాపు మూడేళ్లుగా రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం అవిరామంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఒకసారి ఉక్రెయిన్ పై చేయి సాధిస్తే, మరోసారి రష్యా ఆధిపత్యం చెలాయిస్తుంటుంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు ప్రయత్నాలు జరిగినా అవి ఫలించని పరిస్థితి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఉక్రెయిన్ పై రష్యా నుంచి అతిపెద్ద గగనతల దాడి జరిగింది. ఇది సంచలనంగా మారింది.
అవును... అతి పెద్ద గగనతల దాడి ఉక్రెయిన్ పై శనివారం రాత్రి జరిగింది. ఇందులో భాగంగా... ఒక్క రాత్రిలోనే రష్యా మొత్తం 537 ఆయుధాలను ఉక్రెయిన్ పైకి ప్రయోగించింది. వీటిల్లో 60 క్షిపణులు, 477 డ్రోన్లు ఉన్నాయని ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించింది. అయితే.. వీటిల్లో 249ని తామే కూల్చేశామని.. మరో 226 ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని తెలిపింది.
ఈ సందర్భంగా స్పందించిన ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ కమ్యూనికేషన్ కమాండర్ యూరీ ఇహ్నాట్... గత రాత్రి అతిపెద్ద దాడి జరిగిందని.. ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని రష్యా ఆయుధాలను ప్రయోగించిందని వెల్లడించారు. పోలాండ్ గగనతల రక్షణ కోసం మిత్రదేశాల యుద్ధ విమానాలు రంగంలోకి దిగినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఈ యుద్ధంలో మూడు ఎఫ్-16 యుద్ధ విమానాలను రష్యా కూల్చివేసిందని తెలిపారు.
కాగా... ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ గూరించి మాట్లాడుతూ ట్రంప్ పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పుతిన్ ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని.. ఆయనతో వ్యవహరించడం తాను ఊహించినదానికంటే చాలా కష్టతరంగా మారిందని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఆయనకు కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపారు.
ఈ క్రమంలో... యుద్ధం ముగించడానికి ఇది చాలా మంచి సమయం అని తాను అనుకుంటున్నట్లు చెప్పిన ట్రంప్... ఈ విషయంపై పుతిన్ తో త్వరలో మాట్లడతానని.. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని సులభంగా పరిష్కరించగలనని తాను అనుకుంటున్నానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే.. మరోవైపు యుద్ధం రోజురోజుకీ మరింత తీవ్రమవుతూనే ఉంది!
