స్కూలు విద్యార్థినుల ప్రసవాలకు లక్ష.. షాకింగ్ ఇష్యూ!
ఈ నేపథ్యంలో ఈ నిర్ణయంపై రష్యన్ పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ సర్వే నిర్వహించగా.. అందులో 43% రష్యన్లు ఈ విధానాన్ని సమర్థిస్తున్నారు.
By: Tupaki Desk | 9 July 2025 4:00 AM ISTప్రస్తుతం నెట్టింట ఓ షాకింగ్ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా... రష్యాలోని అనేక ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థినులు పిల్లలకు జన్మనివ్వడానికి లక్ష రూబిళ్లు కంటే ఎక్కువ చెల్లించడం ప్రారంభమయ్యిందని అంతర్జాతీయ మీడియా నివేదించింది. దేశంలో జననాల రేటు తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఆప్షన్ ఎంచుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఈ విషయం షాకింగ్ గా మారింది.
అవును... దేశంలో తగ్గుతున్న జననాల రేటును తిప్పికొట్టడం లక్ష్యంగా, విస్తృత జనాభా వ్యూహంలో భాగంగా రష్యాలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇటీవల పది ప్రాంతాలకు విస్తరించారని కథనాలొస్తున్నాయి. వాస్తవానికి ఈ పథకం మార్చి 2025లో ప్రవేశపెట్టిన సమయంలో.. వయోజన మహిళలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పినట్లు చెబుతున్నారు.
అయితే ఇప్పుడు ఇది టీనేజ్ అమ్మాయిలకు విస్తరించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయంపై రష్యన్ పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ సర్వే నిర్వహించగా.. అందులో 43% రష్యన్లు ఈ విధానాన్ని సమర్థిస్తున్నారు. దీనిని జనాభా క్షీణతను ఎదుర్కోవడానికి అవసరమైన చర్యగా భావిస్తున్నారు. ఇదే సమయంలో.. ఈ నిర్ణయాన్ని 40% మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు.
వాస్తవానికి ఉక్రెయిన్ లో కొనసాగుతున్న యుద్ధం జనాభా సవాళ్లను మరింత దిగజార్చిందని చెబుతున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటివరకూ సుమారు రెండున్నర లక్షల మంది రష్యన్ సైనికులు మరణించారని అంచనా వేస్తున్నారు. మరోవైపు లక్షలాది మంది యువకులు సైన్యంలోకి వెళ్లకుండా ఉండటానికి దేశం విడిచి పారిపోయారు.
ఇదే సమయంలో... కెరీర్ కోసం మాతృత్వాన్ని ఆలస్యం చేస్తున్నవారు, అసలు పిల్లలే వద్దనుకునే మహిళల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో పుతిన్ సర్కార్ ఈ ఆలోచన చేసిందని అంటున్నారు. ఇదే సమయంలో.. ప్రైవేట్ క్లీనిక్స్ లో అబార్షన్ పై పూర్తి ఆంక్షలు విధించారని చెబుతున్నారు.
కాగా... 2050 నాటికి 75% కంటే ఎక్కువ దేశాలు తక్కువ సంతానోత్పత్తి రేట్ల కారణంగా జనాభా క్షీణతను ఎదుర్కొంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు దేశాలు ఇప్పటికే పిల్లలను కనే విషయంలో తల్లితండ్రులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
ఏది ఏమైనా... టీనేజ్ గర్భవతులు అనే విషయం ఏమాత్రం స్వాగతించాల్సిన అంశం కాదనే చర్చ బలంగా వినిపిస్తుంది.
