ఇరాన్ కు రష్యా భారీ మద్దతు.. అణ్వాయుధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఆరోపిస్తూ.. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Jun 2025 1:49 AM ISTఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఆరోపిస్తూ.. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో.. సుమారు గత ఎనిమిది రోజులుగా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఇరాన్ తరుపున రష్యా మద్దతు మాటలు మాట్లాడింది!
అవును... ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని.. వాటివల్ల తమ అస్తిత్వానికి ముప్పు పొంచి ఉందని.. అందుకే ఆ దేశంలోని అణుకేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఈ సందర్భంగా ఇరాన్ కు మద్దతుగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... అణ్వాయుధాల తయారీకి ఇరాన్ సన్నాహాలు చేస్తోందని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని.. ఇదే విషయాన్ని ఇప్పటికే ఇజ్రాయెల్ కు పలుమార్లు స్పష్టం చేశామని.. ఓ ఇంటర్వ్యూలో చెప్పిన పుతిన్... శాంతియుత అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు ఇరాన్ కు ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు రష్యా మీడియా వెల్లడించింది.
ఇదే సమయంలో... శాంతియుత అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకునే విషయంలో ఇరాన్ కు మద్ధతు ఇవ్వడానికి రష్యా ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని చెప్పిన పుతిన్... ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలా ఆపాలనే విషయంపై తాము ఇరుదేశాల నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.
కాగా... ఇటీవలి కాలంలో ఇరాన్ పెద్ద ఎత్తున యురేనియంను శుద్ధి చేసిందని.. దాంతో తొమ్మిది అణుబాంబులు తయారు చేయొచ్చని.. ఇప్పుడు ఆ దేశాన్ని ఆపకపోతే, అతి తక్కువ సమయంలోనే అణ్వాయుధాలను తయారు చేస్తోందని.. అది తమకు పెను ప్రమాదంగా పరిణమిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే.. ఇరాన్ లో ఉన్న అణు స్థావరాలే లక్ష్యంగా 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో టెహ్రాన్ పై దాడులు కొనసాగిస్తున్నామని అన్నారు. ఇదే సమయంలో దీనితో పాటు.. ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందిస్తేనే ఈ యుద్ధం ముగుస్తుందని కూడా వ్యాఖ్యానించారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిని నివారించడానికి తమ దేశంతో అణు ఒప్పందం చేసుకోవాలని సూచించారు. అలా కాని పక్షంలో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని పలుమార్లు ఇరాన్ ను హెచ్చరిస్తూ.. మరో రెండు వారాల గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. ఇరాన్ కు తాము ఉన్నామంటూ పుతిన్ ప్రకటించడం గమనార్హం!
