ఇండియాకు రష్యా అదిరిపోయే గిఫ్ట్.. శత్రుదేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!
ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేకుండా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాలు అయిన SU-57 తయారీ టెక్నాలజీని మన దేశానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది
By: Tupaki Desk | 20 Nov 2025 2:00 AM ISTమిత్రదేశం రష్యా నుంచి భారత్ కు మంచి గిఫ్ట్ వస్తోంది. ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేకుండా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాలు అయిన SU-57 తయారీ టెక్నాలజీని మన దేశానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. ఈ విషయంలో భారత్ ఏం ఆశించినా తాము తప్పకుండా అంగీకరిస్తామని పుతిన్ సర్కార్ స్పష్టం చేసింది. దీంతో మనదేశం భావి యుద్ధ విమానాల అవసరాలను తీర్చేందుకు రష్యా పూర్తిగా సహకరించే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.
. యూఏఈలో జరుగుతున్న 'దుబాయ్ ఎయిర్ షో 2025' సందర్భంగా రష్యా ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ 'రోస్‌టెక్' సీఈఓ సెర్గీ చెమెజోవ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం చర్చనీయాంశంగా మారింది. "చాలా ఏళ్లుగా భారత్, రష్యా మధ్య బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి. భారత్‌పై ఆంక్షలు ఉన్న టైంలోనూ, మేం ఆ దేశ భద్రత కోసం ఆయుధాలను సరఫరా చేశాం. రష్యా ఎప్పుడూ భారత్ పక్షాన నిలుస్తుందని సెర్గీ చెమెజోవ్ వెల్లడించారు. ఇరుదేశాలు పరస్పర సహకారం పెంచుకుంటూ, ఉమ్మడి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. ఇకపైనా సైనిక సామగ్రిపరంగా ఏ అవసరం పడినా రష్యాను భారత్ స్వేచ్ఛగా అడగొచ్చు. ఆ దేశానికి అన్ని రకాల సాయం చేయడానికి మేమున్నాం" అని రోస్‌టెక్ కంపెనీ సీఈఓ సెర్గీ చెమెజోవ్ హామీ ఇచ్చారు.
"ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు లేదా ఎస్‌యూ-57 యుద్ధ విమానాలను భారత్ అడిగిందా?" అన్న మీడియా ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. ఎస్‌యూ-57 ఫైటర్ జెట్లకు సంబంధించి భారత్ ఆందోళనలు, సాంకేతిక డిమాండ్లను మేం సానుకూల కోణంలోనే చూస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, "భావితరం యుద్ధ విమానాల తయారీ టెక్నాలజీని భారత్‌కు ఇచ్చేందుకు రష్యా సిద్ధమే. ఎస్‌యూ-57 ఫైటర్ జెట్ల టెక్నాలజీని కూడా విడతలవారీగా భారత్‌కు బదిలీ చేస్తాం. ఆ యుద్ధ విమానాలను భారత్‌లోనే తయారు చేసుకోవచ్చు. భారత ఆయుధ వ్యవస్థలతో పొందికగా ఉండేలా వాటిలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఇందుకోసం లైసెన్సులు మంజూరు చేస్తాం" అని రష్యా ప్రభుత్వ ఆయుధ ఎగుమతి సంస్థ 'రోసోబోర్ ఆన్ ఎక్స్‌పోర్ట్'కు చెందిన అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఇంజిన్ల నుంచి రాడార్ల దాకా భారత్‌లోనే తయారీ
'రోసోబోర్ ఆన్ ఎక్స్‌పోర్ట్’' అధికార వర్గాల కథనం ప్రకారం, ఎస్‌యూ-57 ఫైటర్ జెట్ల టెక్నాలజీ బదిలీలో భాగంగా భారత్‌కు కీలకమైన విభాగాల సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా ఇవ్వనుంది. ఆ యుద్ధ విమానాల ఇంజిన్లు, ఆప్టిక్స్, ఏఈఎస్‌ఏ రాడార్లు, ఏఐ ఎలిమెంట్స్, లో సిగ్నేచర్ టెక్నాలజీ, మోడర్న్ ఎయిర్ వెపన్స్ తయారీ ప్రక్రియతో ముడిపడిన సాంకేతికతను భారత్‌కు బదిలీ చేస్తుంది. ఎస్‌యూ-57ఈ లేదా ఎఫ్‌జీఎఫ్‌ఏ పేరుతో 2 సీట్లతో కూడిన ఎస్‌యూ-57 ఫైటర్ జెట్ అభివృద్ధి కోసం భారత్‌తో కలిసి పనిచేసేందుకు రష్యా రెడీగా ఉంది. సప్లై చైన్ వ్యవస్థకు ఆంక్షలు ఆటంకంగా మారుతాయనే బెంగ లేకుండా, ఈ యుద్ధ విమానాల విడిభాగాలను భారత్ నిశ్చింతగా స్వదేశంలో తయారు చేసుకోవచ్చని రష్యా అంటోంది. స్వదేశంలో ఎస్‌యూ-57 ఫైటర్ జెట్ల తయారీ కోసం ఇచ్చే లైసెన్సు లెవల్‌ను క్రమంగా పెంచుతామని చెబుతోంది. ఆ యుద్ధ విమానాల్లోని సాఫ్ట్‌వేర్, ఇతర వ్యవస్థల్లో చేసే కొత్తకొత్త ఇంప్రూవ్‌మెంట్లపైనా ఎప్పటికప్పుడు భారత్‌కు అప్‌డేట్స్‌ను అందిస్తామని రష్యా అంటోంది.
