సముద్రంలో చమురు దీపం.. 2 రోజులే గడువు...
ప్రపంచాన్ని డబ్బు నడిపిస్తుందని అంటారు గానీ.. ఆ డబ్బును పుట్టించేది చమురు అని తెలుసుకోవాలి.
By: Tupaki Desk | 19 Nov 2025 10:00 PM ISTప్రపంచాన్ని డబ్బు నడిపిస్తుందని అంటారు గానీ.. ఆ డబ్బును పుట్టించేది చమురు అని తెలుసుకోవాలి. ఒకప్పుడు పేద దేశాలుగా ఉన్న అరబ్ దేశాలు గల్ఫ్ దేశాలుగా ఎలా ఎదిగాయంటే..? కారణం చమురు. కేవలం భూమిలోని సహజ వనరు వాటిని అత్యంత ధనిక దేశాలుగా మార్చింది. ఇక రష్యా కూడా అలాంటిదే. ఉక్రెయిన్ పై నాలుగేళ్లుగా యుద్ధం చేస్తున్నా.. ప్రపంచ శక్తి అమెరికాతో పాటు బలమైన దేశాలు దానికి వ్యతిరేకంగా ఏకమైనా రష్యాను ఇంచు కూడా కదల్చలేకపోయారు. పైగా, జర్మనీ వంటి దేశాలు రష్యాను చూసి ఇప్పటికీ లోలోన భయపడుతుంటాయి. కారణం.. ఆ దేశం నుంచి సరఫరా అయ్యే చమురు. మొత్తానికి ఒక్కమాటలో చెప్పాలంటే రష్యా చమురు లేకకపోతే యూరప్ లో పొయ్యి వెలగదు. అంతెందుకు..? మన పొరుగు దేశం పాకిస్థాన్ కూడా రష్యా చమురుపై ఆధారపడింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై, ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో రష్యాలో పర్యటించడం చివరకు ఆయన పదవికే ఎసరు తెచ్చింది. అనంతరం జరిగిన పరిణామాల్లో రష్యా నుంచి భారత్ చమురు కొంటే తప్పు లేదు కానీ, మన కొంటే తప్పు ఏమిటని ఇమ్రాన్ బహిరంగంగానే వాపోయాడు. అంటే, రష్యాతో చమురు బంధం ఇమ్రాన్ పదవి పోవడానికి ఒక కారణం అని స్పష్టం అవుతోంది.
ట్రంప్ కడుపుమంటతో..
మాకు ఎక్కడ తక్కువకు, సౌకర్యంగా దొరికితే అక్కడ చమురు కొంటాం.. ఇదీ భారత్ విధానం. అలాగే రష్యా నుంచి దశాబ్దాలుగా సాగుతున్న చమురు కొనుగోలును ప్రస్తుత సంక్షోభ కాలంలోనూ కొనసాగిస్తోంది. కానీ, ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు నచ్చడం లేదు. ఆయన కడుపు మంటకు దారితీసింది. చివరకు ఆంక్షలు విధించేందుకు కారణమైంది. శుక్రవారం (నవంబరు 21) నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో రష్యా నుంచి భారత్ కు చమురుతో బయల్దేరిన నౌకల పరిస్థితి నడి సంద్రంలో చమురు దీపంగా మారింది. శుక్రవారం లోగా ఈ నౌకలు తీరం చేరాలి. లేదంటే, వాటిలోని కోట్ల బ్యారెళ్ల చమురు అలాగే ఉండిపోయే పరిస్థితి.
ఎంత వేగంగా తీసుకొచ్చినా..
సముద్రంలోని నౌకల వేగాన్ని పెంచి.. శుక్రవారంలోనే భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఇది ఎంతవరకు సాధ్యం అనేది తెలియాల్సి ఉంది. కాగా, రష్యా సంస్థలైన రాస్ నెఫ్ట్, లుకాయల్ లను అమెరికా బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఈ సంస్థల నౌకలే భారత్ కు వస్తున్నాయి. వీటిలో 77 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉంది. ఇవి శుక్రవారం తర్వాతే భారత్ కు చేరనున్నాయి. ఆలోగా ఆంక్షలు అమల్లోకి వస్తే.. భారత నౌకాశ్రయాల్లో దించుతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామం వ్యాపారుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది.
-రష్యా నుంచి వస్తున్న నౌకలు ఎక్కువ శాతం భారత ప్రసిద్ధ సంస్థ రిలయన్స్ కు చెందిన జామ్ నగర్ రిఫైనరీకి, నయారా ఎనర్జీకి చెందిన వాడినర్ పోర్టుకు వెళ్లాలి. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చమురు డబ్బులు వాడుతుంది అనేది అమెరికా ఆరోపణ. అందుకనే చమురును అమ్మకుండా చేయాలని చూస్తోంది. భారత్ పైనా ఒత్తిడి పెంచుతోంది. రష్యా చమురు కొనబోమని రిలయన్స్ సహా ఐదుసంస్థలు గతంలో హామీ ఇచ్చాయి. నయారా మాత్రం తమకు తప్పని పరిస్థితి అని చెబుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వరకు నౌకలు చేరుకోకుంటే.. ఆంక్షల గడువు పొడిగించాలని అమెరికాను భారత్ కోరుతుందా? అన్నది చూడాలి. ఇటీవల హంగేరీ దేశానికి ఇలానే అమెరికా రిలీఫ్ ఇచ్చింది.
కొసమెరుపుః శుక్రవారం నుంచి ఆంక్షలు అమల్లోకి రానుండగా.. వీటిలో టాప్ ఫోర్ రష్యా కంపెనీలున్నాయి. భారత్ కు 80 శాతం చమురును ఇవే సరఫరా చేస్తున్నాయి.
