Begin typing your search above and press return to search.

2022 నుంచి యుద్ధం.. దివాళాకు రష్యా సిద్ధం.. తాజా పరిస్థితి ఇదే!

ఉక్రెయిన్‌ పై 2022లో మొదలుపెట్టిన యుద్ధం సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని దేశాలు ఆంక్షలు విధించడం క్రెమ్లిన్‌ ఆర్థిక కష్టాలకు కారణమైంది.

By:  Tupaki Desk   |   20 Jun 2025 5:00 PM IST
2022 నుంచి యుద్ధం.. దివాళాకు  రష్యా సిద్ధం.. తాజా పరిస్థితి ఇదే!
X

ఉక్రెయిన్ తో సుమారు మూడేళ్లుగా అవిరాంగంగా యుద్ధం చేస్తున్న రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందా.. అటు పెద్ద ఎత్తున సైన్యాన్ని కోల్పోతున్న రష్యా.. ఇటు ఆర్థికంగానూ మాంద్యవైపు పయనిస్తుందా.. అంటే అవుననే అంటున్నారు ఆ దేశ వాణిజ్య మంత్రి. ప్రస్తుతం రష్యాలో కాయగూరల నుంచి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని తెలుస్తోంది.

అవును... రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభపు అంచుల్లోకి చేరుకుంది. 2022 నుండి ఉక్రెయిన్‌ పై విరుచుకుపడుతోన్న రష్యా.. ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితుల్లో ఉందని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన రష్యా వాణిజ్యశాఖ మంత్రి మాక్సిమ్‌ రెషెత్నికోవ్‌.. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు.. తమ దేశం మాంద్యం అంచున ఉందని వెల్లడించారు.

రష్యాకు పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆర్థిక వేదిక సదస్సులో ప్రసంగించిన ఆయన.. ప్రస్తుత వాణిజ్యం, సూచీలను బట్టి చూస్తే తాము మాంద్యం అంచుల్లో ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. అయితే.. మాంద్యంలోకి జారుకుంటామా లేదా అన్నది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందన్నారు.

ఉక్రెయిన్‌ పై 2022లో మొదలుపెట్టిన యుద్ధం సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని దేశాలు ఆంక్షలు విధించడం క్రెమ్లిన్‌ ఆర్థిక కష్టాలకు కారణమైంది. మరోవైపు సైన్యానికి భారీస్థాయిలో ఖర్చు చేస్తుండటం ఆర్థికవృద్ధిపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో 2025 మొదటి త్రైమాసికంలో రష్యా ఆర్థిక వృద్ధి 1.4%కి పడిపోయింది.

ఇది 2024లో 4.5% ఉండగా.. 2021లో 4.3% గా ఉంది. అయితే... ఉక్రెయిన్ యుద్ధంపై విధించిన పాశ్చాత్య ఆంక్షల కారణంగా ఈ ఘోర పతనం (1.4%)ఏర్పడిందని చెబుతున్నారు. ఇది అధిక వ్యయంతో పాటుగా రష్యా ఆర్థిక సంక్షోభానికి దారితీసిందని చెబుతూ.. 2025 నాటికి రష్యా రక్షణ వ్యయం దాని జీడీపీలో 8% మించిపోతుందని అంచనా వేస్తున్నారు.

ఉక్రెయిన్‌ తో యుద్ధం కారణంగా.. 2023 నుంచి రష్యా తన రక్షణ వ్యయాన్ని భారీగా పెంచేస్తోంది. ఈ క్రమంలో.. 2025లో రష్యన్ పార్లమెంట్ రూ.10 లక్షల 67 వేల కోట్ల రక్షణ బడ్జెట్‌ ను ఆమోదించింది. ఇలా బడ్జెట్‌ లో ఎక్కువ భాగం రక్షణ రంగానికి ఖర్చు చేస్తుండటంతో.. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలకు డబ్బు ఇబ్బందవుతుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. దేశంలో.. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతర కూరగాయలు, కోడి గుడ్ల ధరలు విపరీతంగా పెరిగాయని అంటున్నారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో చాలా మంది పౌరులు దేశం విడిచి వెళ్లిపోతున్నారనేది ఆందోళనగా మారింది!