Begin typing your search above and press return to search.

30 ప్రాంతాలు..367 డ్రోన్లు..క్షిపణులు..ఉక్రెయిన్ పై నిప్పుల ఉప్పెన

విక్టరీ డే నేపథ్యంలో మే 8 నుంచి మూడు రోజుల పాటు రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది.

By:  Tupaki Desk   |   26 May 2025 9:01 AM IST
30 ప్రాంతాలు..367 డ్రోన్లు..క్షిపణులు..ఉక్రెయిన్ పై నిప్పుల ఉప్పెన
X

ఓవైపు యుద్ధ ఖైదీల మార్పిడి కొనసాగుతూనే ఉంది.. దీనికిముందు కాల్పుల విరమణ కొనసాగింది.. కానీ ఇంతలోనే ఉక్రెయిన్ మీద విరుచుకుపడింది. రికార్డు స్థాయిలో డ్రోన్లతో దాడికి దిగింది. అది కూడా ఊహించని విధంగా 30కి పైగా నగరాలు, ప్రాంతాలపై నిప్పుల వాన కురిపించింది. ఉన్నట్లుండి రష్యా ఎందుకిలా చేసిందో అర్థం కాక ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

విక్టరీ డే నేపథ్యంలో మే 8 నుంచి మూడు రోజుల పాటు రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది. దీంతో పరిస్థితులు ప్రశాంతంగా మారుతాయని అంతా భావించారు. ఇదే ఊపులో శాంతి చర్చల ప్రస్తావన కూడా నడిచింది. ఏదో ఒక ఆశారేఖ కనిపించింది. వీటి మధ్యలోనే యుద్ధ ఖైదీలుగా తమ చెరలో ఉన్న వందలమంది సైనికులు, ప్రజలను కూడా రష్యా విడిచిపెడుతోంది.

అంతలోనే ఆదివారం 367 డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడింది. 12 మందిని బలిగొంది. 2022 ఫిబ్రవరి 24న మొదలైన ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఈస్థాయిలో ఎన్నడూ దాడి జరగకపోవడం గమనార్హం. వాస్తవానికి యుద్ధ ఖైదీల అప్పగింతలో శుక్రవారం 390 మంది, శనివారం 307 మందిని ఇరుదేశాలు మార్పిడి చేసుకున్నాయి. ఆదివారం 303 సైనికులను పరస్పరం అప్పగించుకున్నట్లు రష్యా ప్రకటించింది. దీనికిముందే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ తో పాటు పలు ప్రాంతాలపై రష్యా భీకరంగా దాడిచేసింది. 69 క్షిపణులతో పాటు 298 డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్‌ రూపొందించి షాహెద్ డ్రోన్లనూ వాడింది.

ఓవైపు శాంతి చర్చలకు సిద్ధం అంటూనే రష్యా ఇలా చేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. రష్యాపై ఆంక్షలు విధించాలని పశ్చిమ దేశాలను అభ్యర్థించారు. పుతిన్ పై బలమైన ఒత్తిడితోనే దారుణాలు ఆగుతాయని పేర్కొన్నారు.

రష్యా దూకుడు చూస్తుంటే.. ఉక్రెయిన్ ను శాంతి చర్చలకు ముందే బలహీనపరిచే ఉద్దేశంలో కనిపిస్తోంది. అందుకే తీవ్ర స్థాయి దాడులతో మానసికంగా దెబ్బతీస్తోంది.