ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాలు వాడిందా?
ఈ రసాయన ఆయుధాల వాడకం కారణంగా ఇప్పటివరకు ముగ్గురు ఉక్రెయిన్ సైనికులు మరణించారని, సుమారు 2,500 మందికి పైగా గాయాలపాలయ్యారని డచ్ ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది.
By: Tupaki Desk | 5 July 2025 2:00 AM ISTసుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్‌పై ఆధిపత్యం సాధించేందుకు రష్యా నిషేధిత రసాయన ఆయుధాలను ఉపయోగించిందని నెదర్లాండ్స్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ (AIVD) వెల్లడించింది. ఈ విషయాన్ని డచ్ రక్షణ మంత్రి రూబెన్ బ్రెకెల్‌మాన్స్ ఖచ్చితంగా నిర్ధారించారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీయడంతోపాటు మాస్కోపై మరింత ఒత్తిడి పెరుగుతోంది.
-రసాయన ఆయుధాల వాడకం.. ఆందోళనకర నిజాలు
నివేదికల ప్రకారం.. రష్యా మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఉపయోగించిన ప్రమాదకర రసాయనమైన క్లోరోపిక్రిన్ ను ఉపయోగిస్తోంది. ది హేగ్, డచ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు సేకరించిన ఆధారాలు ఈ విషయాన్ని ధృవీకరించాయని, రష్యా ఈ గ్యాస్‌ను ఉక్రెయిన్ సైనికులపై ప్రయోగించి వారిని ఉక్కిరిబిక్కిరి చేయడమే కాకుండా మరణానికి దారితీసేలా చేస్తుందని వెల్లడించారు. ఈ ఆయుధం వల్ల కలిగే ప్రభావాలు అత్యంత ప్రమాదకరమైనవని.. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం దీని వాడకం పూర్తిగా నిషేధించబడిందని నిపుణులు పేర్కొంటున్నారు.
- ఉక్రెయిన్ బాధితులు.. గాయాలు, మరణాలు
ఈ రసాయన ఆయుధాల వాడకం కారణంగా ఇప్పటివరకు ముగ్గురు ఉక్రెయిన్ సైనికులు మరణించారని, సుమారు 2,500 మందికి పైగా గాయాలపాలయ్యారని డచ్ ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, గ్యాస్ వాడకం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఈ రసాయన ఆయుధాల వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
-రష్యా ఖండన.. ప్రత్యర్థులపై ఆరోపణ
ఈ ఆరోపణలపై రష్యా తీవ్రంగా స్పందించింది. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించిన మాస్కో "మేమేమీ నిషేధిత ఆయుధాలు వాడలేదు. నిజానికి ఉక్రెయినే ఇలాంటి రసాయన ఆయుధాలను ఉపయోగిస్తోంది" అని ప్రతివాదం చేసింది. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా మాట్లాడుతూ తూర్పు ఉక్రెయిన్‌లో ఉక్రెయిన్ సైన్యం నిల్వ ఉంచిన క్లోరోపిక్రిన్ కలిగిన పేలుడు పరికరాలను తమ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ గుర్తించాయని వెల్లడించారు. ఇది రష్యాపై బురద జల్లే ప్రయత్నంగా అభివర్ణించింది.
- అమెరికా ఆందోళన.. హెచ్చరికలు
ఈ విషయమై గతేడాది అమెరికా కూడా అలాంటి ఆరోపణలే చేసింది. రష్యా ఉక్రెయిన్‌పై ఆధిపత్యం కోసం ఈ రసాయనాన్ని ఉపయోగిస్తోందని వాషింగ్టన్ పేర్కొంది. అయితే అప్పట్లో రష్యా తలదాచుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు డచ్ ఇంటెలిజెన్స్ నివేదిక వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అమెరికా ఆరోపణలకు, డచ్ ఇంటెలిజెన్స్ నివేదికకు పొంతన కుదరడంతో రష్యాపై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది.
- అంతర్జాతీయ చర్యల పిలుపు
ఈ నేపథ్యంలో రష్యాపై మరింత కఠినమైన ఆంక్షలు విధించాలని డచ్ రక్షణ మంత్రి రూబెన్ బ్రెకెల్‌మాన్స్ డచ్ పార్లమెంటుకు విజ్ఞప్తి చేశారు. రష్యా నిర్లక్ష్యంగా ఈ రసాయన ఆయుధాలను ఉపయోగించడం కేవలం ఉక్రెయిన్‌కే కాకుండా యూరోప్ మొత్తం భద్రతకు ప్రమాదం తెచ్చిపెడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ దుష్టవ్యూహాలకు అంతర్జాతీయ సమాజం ఎంతవరకు స్పందిస్తుందో చూడాల్సిందే. కాగా ఈ ఆరోపణలపై ఐక్యరాజ్యసమితి, ఓపీ.సీ.డబ్ల్యూ (ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రోహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్) వంటి గ్లోబల్ సంస్థలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఈ అంశంపై అంతర్జాతీయ దర్యాప్తునకు పిలుపునిచ్చే అవకాశం కూడా ఉంది.