రుషికొండ ప్యాలెస్ వినియోగంపై మరో సలహా.. ప్రభుత్వం స్పందిస్తుందా?
రుషికొండపై నిర్మించిన అత్యంత ఖరీదైన భవనాన్ని ఎలా వినియోగించాలన్న విషయమై తర్జనభర్జన పడుతున్న ప్రభుత్వానికి సీనియర్ నేతలు వరుసగా సలహాలిస్తున్నారు.
By: Tupaki Desk | 13 Sept 2025 7:00 PM ISTరుషికొండపై నిర్మించిన అత్యంత ఖరీదైన భవనాన్ని ఎలా వినియోగించాలన్న విషయమై తర్జనభర్జన పడుతున్న ప్రభుత్వానికి సీనియర్ నేతలు వరుసగా సలహాలిస్తున్నారు. ఆ భవనాలను పిచ్చాసుపత్రి చేయాలని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఇటీవల సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత బీవీ రాఘువులు కూడా స్పందించారు. అత్యంత ఖరీదైన రుషికొండ ప్యాలెస్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సైన్సు, ఆర్ట్స్, హెరిటేజ్ మ్యూజియం ఏర్పాటు చేయాలని రాఘవులు సూచించారు. రుషికొండ భవనాల వినియోగంపై ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్న ప్రభుత్వం తన ప్రతిపాదన కూడా పరిశీలించాలని ఆయన కోరారు.
రుషికొండ భవనాలను ఎలా వినియోగించాలన్న విషయమై తన ఆలోచనలను తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుక్రవారం లేఖ రాశారు బీవీ రాఘవులు. రుషికొండపై బాలబాలికల మనో విజ్ఞాన వికాసాలకు దోమదపడేలా సైన్సు, ఆర్ట్స్, హెరిటేజ్ మ్యూజియం ఏర్పాటు మంచిదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్నట్లు టూరిజం కూడా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రుషికొండ భవనాల వినియోగంపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తుది నిర్ణయం తీసుకునే ముందు తన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో ప్రసిద్ధిచెందిన సైన్స్ మ్యూజియంలు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కొత్త రాష్ట్రంలో 11 ఏళ్లుగా సరైన మ్యూజియం లేని విషయాన్ని గుర్తించాలని రాఘవులు సూచించారు. అదేవిధంగా రాజధాని అమరావతిలో సైతం అన్ని హంగులతో సైన్స్ మ్యూజియం, జంతు ప్రదర్శనశాల ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాల విజ్ఞాన, వినోద సాధనాలుగా ఇవి ఉపయోగపడతాయని రాఘవులు వ్యాఖ్యానించారు.
కాగా, రుషికొండపై రూ.450 కోట్లతో నిర్మించిన భవనాలను రాఘవులు చెప్పినట్లు మ్యూజియం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో నిర్మించిన రుషికొండ భవనాలు అత్యంత వివాదాస్పదమైన విషయం తెలిసిందే. భారీగా నిధులు వెచ్చించి నిర్మించిన నాలుగు భవంతుల నెలవారీ కరెంటు చార్జీలే దాదాపు రూ.65 లక్షలు వరకు ఉంటున్నాయన ప్రభుత్వం చెబుతోంది. అంతకు ముందు రూ.కోటి రూపాయల ఆదాయం వచ్చే రిసార్ట్సును కూల్చేసి ఎందుకూ ఉపయోగపడని భవనాలను నిర్మించారని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆ భవనాలను వినియోగించే విషయమై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశంలో చర్చించడంతోపాటు ప్రజలు, సీరియర్ నేతలు, రిటైర్డ్ అధికారుల అభిప్రాయాలను తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య ఈ విషయమై విమర్శలు, ప్రతివిమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. పిచ్చాసుపత్రి చేయాలని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సూచిస్తే.. ఆయన సూచనను తప్పుబడుతూ వైసీపీ నేత బొత్స ఘాటు విమర్శలు చేశారు. అహంకారంతోనే అశోక్ గజపతిరాజు ఇలా మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు.
అదే సమయంలో రుషికొండ భవనాలను డెస్టినేషన్ మేరేజస్ కు అద్దెకిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బొత్స సలహా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల ఏడాదికి రూ.25 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా సీపీఎం నేత రాఘవులు సూచన కూడా చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం జాతీయ రాజకీయాలకే పరిమితమైన రాఘవులు.. చాలా కాలం తర్వాత రాష్ట్రానికి చెందిన అంశమై తన అభిప్రాయం తెలియజేశారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రుషికొండ భవనాలపై మాట్లాడిన నేతలు ఇప్పటివరకు రాజకీయ కోణంలోనే చూశారని, కానీ, అందరికీ భిన్నంగా రాఘవులు సూచనలు ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం ఆయన సూచనలను పరిశీలిస్తుందా? లేదా? అన్నది కూడా చూడాల్సివుంది.
