Begin typing your search above and press return to search.

అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి... కారణం ఇదేనోయి!

ఆ సంగతి అలా ఉంటే... మంగళవారం డాలర్ ఇండెక్స్ బలపడటంతో డాలర్‌ తో రూపాయి మారకం విలువ 25 పైసలు పడిపోయింది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 5:07 AM GMT
అత్యంత కనిష్ట స్థాయికి  రూపాయి... కారణం ఇదేనోయి!
X

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం మంచి లాభాల దిశగా దూసుకుపోయాయనే అనుకోవాలి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు మార్కెట్లను పాజిటివ్ గా ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. దీంతో నిన్న ఉదయం సెషన్ లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ 273 పాయింట్లు పెరిగి 66,439 పాయింట్లకు చేరగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 86 పాయింట్లు మెరుగుపడి 19,817 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోందని బోగట్టా!

ఇదే సమయంలో... ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించదనే బలమైన సంకేతాలు మార్కెట్లను సానుకూలంగా ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. తాము ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించడం కూడా ఈ విషయంలో పాజిటివ్ అంశం అని అంటున్నారు. ఫలితంగా... యుద్ధం ఇతర దేశాలకు విస్తరించదని మదుపర్ల సెంటిమెంట్ బలపడిందని చెబుతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... మంగళవారం డాలర్ ఇండెక్స్ బలపడటంతో డాలర్‌ తో రూపాయి మారకం విలువ 25 పైసలు పడిపోయింది. గతంలో 83.04 వద్ద ముగిసిన అమెరికా డాలర్‌ తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 83.23గా ఉంది! ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా తన ఫండింగ్ గ్యాప్‌ ను విజయవంతంగా నివారించడంతో డాలర్ ఇండెక్స్ 107.10కి పెరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది!

సోమవారం యూఎస్ డాలర్ ఇండెక్స్ పెరగడంతో అమెరికా డాలర్ - రూపాయి అధిక స్థాయిలో ప్రారంభమైనట్లు నిపుణులు తెలిపారు. పైగా సోమవారం భారతదేశంలో మార్కెట్ మూసివేయబడినప్పటికీ... గ్లోబల్ మార్కెట్లు తెరిచే ఉన్నాయి. దీంతో... స్థానిక కరెన్సీ ఒత్తిడిలో ఉండి, డాలర్‌ తో పోలిస్తే 83 నుంచి 83.30 రేంజ్‌ లో ట్రేడవుతుందని మార్కెట్ పార్టిసిపెంట్లు భావిస్తున్నారు.

ఈ సమయంలో తాజా పరిస్థితులపై సిఆర్ ఫారెక్స్ ఎండి అమిత్ పాబ్రీ స్పందించారు. ఇటీవలి సెషన్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్‌ ను వ్యూహాత్మకంగా విక్రయించడంలో ఆర్‌బిఐ నిమగ్నమైందని.. ముఖ్యంగా డాలర్‌ తో రూపాయి బలహీనంగా మారే ప్రమాదానికి ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... పెరుగుతున్న దిగుమతుల వ్యయాలను అరికట్టడం, క్యారీ ట్రేడ్‌ లలో అమ్మకాలను అరికట్టాలనే కోరికతో ఈ వ్యూహం నడిచిందని ఆయన చెప్పారు.

ఇక బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 102 పాయింట్ల నష్టంతో 66,325 దగ్గర ట్రేడవుతుండగా... నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 19,792 దగ్గర కొనసాగుతోంది. ఇదే సమయంలో... డాలరుతో పోలిస్తే రూపాయి మారకం 83.22 దగ్గర ప్రారంభమైంది.