Begin typing your search above and press return to search.

ఆర్టీసీ మాజీ ఉద్యోగికి 383 ఏళ్ల జైలుశిక్ష.. రూ.3.32 కోట్ల జరిమానా!

అవును... తమిళనాడులో 35 ఏళ్ల నాటి కేసులో తాజాగా కోర్టు తీర్పు నిచ్చింది. ఇదే సంచలన విషయం అనుకునేలోపు

By:  Tupaki Desk   |   31 July 2023 1:58 PM GMT
ఆర్టీసీ  మాజీ  ఉద్యోగికి 383 ఏళ్ల జైలుశిక్ష.. రూ.3.32 కోట్ల జరిమానా!
X

కాస్త ఆలస్యం అయినా... నేరం చేస్తే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని అంటుంటారు. ఇది అన్ని సందర్భాల్లోనూ, అందరి విషయాల్లోనూ వాస్తవమేనా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా ఒక రిటైర్ ప్రభుత్వ ఉద్యోగి విషయంలో మాత్రం నిజమైంది. ఇందులో భాగంగా... 35ఏళ్ల నాటి కేసులో తాజాగా తీర్పు వెలువడింది!

అవును... తమిళనాడులో 35 ఏళ్ల నాటి కేసులో తాజాగా కోర్టు తీర్పు నిచ్చింది. ఇదే సంచలన విషయం అనుకునేలోపు... ఈ తీర్పులో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి కనీ వినీ ఎరుగని శిక్ష విధించింది. దీంతో ఈ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇదే సమయంలో తీర్పు మరింత వైరల్ అవుతోంది.

నకిలీ పత్రాలను సృష్టించి, మోసానికి పాల్పడనందుకు తమిళనాడు ఆర్టీసీ మాజీ ఉద్యోగికి 383 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3.32 కోట్ల జరిమానా విధించింది కోయంబత్తూర్ కోర్టు. ఇందులో... 47 నేరాలకు నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు.. 47 ఫోర్జరీ కేసులకు నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు.. ప్రభుత్వ ఆస్తులను కాజేసినందుకు మరో 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది.

వివరాళ్లోకి వెళ్తే... 1988 నవంబర్ 9న చేరన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష న్‌ (ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ) కోయంబత్తూర్ డివిజన్‌ పరిధిలోని బస్సుల వేలం ప్రక్రియ చేపట్టింది. అయితే ఈ వ్యవహారంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు అందింది.

నకిలీ పత్రాలతో 47 బస్సులను విక్రయించి రూ. 28 లక్షలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఉన్నతాధికారులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి కోదండపాణి, రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దురైసామి, రంగనాథన్, రాజేంద్రన్‌ లను అదుపులోకి తీసుకున్నారు.

అయితే కాలం గడిచే కొద్దీ... నటరాజన్, రామచంద్రన్, రంగనాథన్, రాజేంద్రన్ మృతి చెందారు. ఇదే సమయంలో జీవించి ఉన్నవారిలో కోదండపాణి మినహాయించి మిగిలిన ముగ్గురిని న్యాయస్థానం నిర్ధోషులుగా పేర్కొంది. దీంతో తాజాగా ఈ కేసులో తీర్పు వెలువరించిన కోర్టు... మొత్తం 383 సంవత్సరాల శిక్ష వేయడంతోపాటు.. రూ.3.32 కోట్ల జరిమానా విధించింది.

అయితే ప్రస్తుతం కోదండపాణి వయసు 82 ఏళ్లు. దీంతో కోర్టు జైలు శిక్షలో మినహాయింపు ఇచ్చింది. 383 ఏళ్లకు బదులు... ఏడేళ్ల పాటు జైలు శిక్షను ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి పీకే శివకుమార్ ఆదేశించారు.