Begin typing your search above and press return to search.

రిజర్వేషన్లు అప్పటి వరకే ఉండాలి: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ హాట్‌ కామెంట్స్‌!

మనదేశంలో కొన్ని వర్గాలకు ప్రభుత్వాలు కల్పిస్తున్న రిజర్వేషన్లపై ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Sep 2023 5:30 AM GMT
రిజర్వేషన్లు అప్పటి వరకే ఉండాలి: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ హాట్‌ కామెంట్స్‌!
X

మనదేశంలో కొన్ని వర్గాలకు ప్రభుత్వాలు కల్పిస్తున్న రిజర్వేషన్లపై ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రిజర్వేషన్లకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.

తాజాగా రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్‌ భగవత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వివక్ష ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలోని నాగపూర్‌ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌ భగవత్‌ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

వ్యవస్థలో మనం.. మన తోటి మనుషులను(కొన్ని వర్గాలకు చెందినవారిని) చాలా ఏళ్లుగా వెనుకే ఉంచుతూ వచ్చామని మోహన్‌ భగవత్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. దాదాపు 2 వేల ఏళ్లుగా ఇది కొనసాగిందని గుర్తు చేశారు. ఎప్పుడైతే సమానత్వం లాంటి ప్రత్యేకాంశాలను వెనుకబడిన వర్గాలకు కల్పించామో అప్పటి నుంచి వాళ్లకు మేలు జరుగుతుందన్నారు. ప్రత్యేకించి రిజర్వేషన్లలాంటివి వాళ్లకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. వెనకబడిన వర్గాలు పూర్తిస్థాయిలో మనతో సమానంగా అవకాశాలు పొందేవరకు రిజర్వేషన్లు కొనసాగాలని మోహన్‌ భగవత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

సమాజంలో వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని మోహన్‌ భగవత్‌ తేల్చిచెప్పారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు అన్ని విధాలా తమ మద్దతు ఉంటుందని చెప్పారు. దాదాపు 2 వేల సంవత్సరాలపాటు కొన్ని వర్గాలు సమాజంలో వివక్షకు, నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలిపారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల ఉద్యమం మరోసారి చెలరేగుతున్న వేళ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

కాగా నేటి యువత వృద్ధులుగా మారకముందే ‘అఖండ భారత్‌’ లేదా ‘అవిభజిత ఇండియా’ నిజమవుతుందని మోహన్‌ భగవత్‌ ధీమా వ్యక్తం చేశారు. 1947లో ఇండియా నుంచి విడిపోయినవారు తప్పుచేశామని ఇప్పుడు బాధపడుతున్నారన్నారు.

తాజాగా రిజర్వేషన్ల కోసం వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి. గతంలో ఏపీలో కాపులు, గుజరాత్‌ లో పటేళ్లు, రాజస్థాన్‌ లో జాట్లు తమకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వీరంతా అగ్ర కులాలకు చెందినవారే కావడం గమనార్హం. ఓసీల జాబితాలోనే ఈ మూడు కులాలు ఉన్నాయి.