Begin typing your search above and press return to search.

మోడీ వీడిపోతే కమలం వాడిపోదా ?

ఇదిలా ఉంటే 2014 తరువాత చూస్తే మాత్రం బీజేపీలో మోడీ హవా అధికం అయింది. మోడీ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి బీజేపీని బలోపేతం చేశారు.

By:  Tupaki Desk   |   14 July 2025 8:15 AM IST
మోడీ వీడిపోతే కమలం వాడిపోదా ?
X

అపుడెప్పుడో 70వ దశకంలో ఒక భక్తుడు ఇందిర అంటే ఇండియా అని చెప్పారు. అలా కాంగ్రెస్ లోనూ ఆమె తప్ప మరో నాయకత్వం లేదు. ఆమె చెప్పిందే వేదం అన్నట్లుగా నడచింది. కాంగ్రెస్ లో మొదటి నుంచి వ్యక్తి పూజ పెద్దగా లేకపోయినా తరువాత అదే పార్టీకి అలవాటు అయింది. కాంగ్రెస్ తో పోలిస్తే తేడా పార్టీగా బీజేపీకి పేరు ఉంది.

బీజేపీ కానీ దానికి పూర్వ రూపం జనసంఘ్ కానీ సంస్థగా వ్యవస్థగా నిర్ణయాలు తీసుకుంటాయి. పార్టీ అభిప్రాయమే ఎపుడూ ఉంటుంది. ఎంతటి వారు అయినా పార్టీ కంటే గొప్ప కాదు అన్నది ఒక విధానంగా ఉంటూ వస్తోంది. పార్టీలో ఫలానా నాయకుడు పోటీ చేయాలీ అంటే ఆయనకు ఇష్టం లేకున్నా పోటీకి సిద్ధం పడాల్సిందే. లేదంటే లేనే లేదు.

మరో వైపు చూస్తే కనుక బీజేపీలో వరిష్ట నేత లాల్ కృష్ణ అద్వానీ 2004 తరువాత బీజేపీకి అధ్యక్షుడుగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పాకిస్థాన్ వెళ్ళి జిన్నాను పొగిడారు అన్న కారణంతో ఆయనను పార్టీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకోమని ఆర్ఎస్ఎస్ ఆదేశించింది అంటారు. ఫలితంగా ఆయన తప్పుకున్నారని చెబుతారు.

ఇదిలా ఉంటే 2014 తరువాత చూస్తే మాత్రం బీజేపీలో మోడీ హవా అధికం అయింది. మోడీ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి బీజేపీని బలోపేతం చేశారు. 2014 నాటికి దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా సింగిల్ పార్టీకి కేంద్రంలో మెజారిటీ రాలేదు. దానిని బ్రేక్ చేస్తూ బీజేపీకి పూర్తి మెజారిటీ తెచ్చారు. అలా బీజేపీని మొదటిసారి మ్యాజిక్ ఫిగర్ ని దాటించి మరో రికార్డు క్రియేట్ చేశారు. 2019 నాటికి ఆ రికార్డుని బద్ధలు కొట్టి బీజేపీ సీట్లు 306కి తీసుకుని వెళ్ళారు.

మూడవసారి గెలవడం కష్టం. అయినా సరే బీజేపీకి 240కి పై చిలుకు ఎంపీ సీట్లు వచ్చాయీ అంటే అది మోడీ చరిష్మా ఫలితం అనేవారూ ఉన్నారు. అయితే ఇక్కడే ఆర్ఎస్ఎస్ వేరే విధంగా ఆలోచిస్తోంది అని కూడా ప్రచారంలో ఉంది. మోడీ ఇమేజ్ క్రమంగా తగ్గుతోంది కాబట్టే మూడవసారి ఫుల్ మెజారిటీ పార్టీకి దక్కలేదని కూడా సంఘ్ విశ్లేషిస్తుంది అని అంటున్నారు.

ఇక బీజేపీకి కొత్తగా జాతీయ అధ్యక్షుడి నియామకంతోనే తన ముద్రను ఉండేలా చూసుకోవాలని సంఘ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి 2022లోనే జేపీ నడ్డా పదవీకాలం పూర్తి అయినా ఆయన చాలా కాలంగా కొనసాగుతున్నారని అంటారు. ఇక ఏడాది పై దాటింది ఆయన కేంద్రంలో మంత్రిగా చేరి. ఈ జంట బాధ్యతల నుంచి ఆయనను తప్పించాల్సి ఉంది. అయితే ఆర్ఎస్ఎస్ కి చెందిన వారా లేక మోడీ అనుకున్న వారా కొత్త బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు అన్న చర్చ ఒక వైపు ఉండనే ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ హోదాలో మోహన్ భగవత్ ఒక బాంబు పేల్చారు. ఎవరైనా 75 ఏళ్ళు నిండితే చాలు రాజకీయాల్లో ఉండేందుకు ఉత్సాహం చూపవద్దని హుందాగా తప్పుకోవాలని ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. దాంతో సహజంగానే అందరి చూపూ నరేంద్ర మోడీ వైపే మళ్ళింది అంతే కాదు విపక్షాలకు ఇది ఆయుధంగా మారుతోంది.

మోడీని తప్పుకో అని నేరుగా అనకపోయినా అర్ధం అదే అన్నట్లుగానే సంకేతాలూ ఉన్నాయని అంటున్నారు. సరిగ్గా రెండు నెలలలో మోడీ 75వ పడిలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో సంఘ్ అధిపతి చేసిన ఈ వ్యాఖ్యలు ఆయనకే గురి అని అంటూ విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఈ వ్యాఖ్యల మీదనే అటు బీజేపీ ఇటు సంఘ్ లో చర్చలు సాగుతున్నాయి.

సరే సంఘ్ అన్నట్లుగానే మోడీ తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నారు అని దిగిపోతే అపుడు బీజేపీలో ఏమి జరుగుతుంది అన్న చర్చ కూడా ఉంది. బీజేపీకి మోడీ చరిష్మాటిక్ లీడర్. ఎవరు కాదన్నా ఆయనతోనే బీజేపీ నిలబడింది అని అంటారు. 2029లో మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలన్నా మోడీ ప్రధానిగా ఉండాల్సిందే అన్నది బీజేపీలో ఒక వైపు బలంగా వినిపిస్తోంది.

అదే సమయంలో ఆర్ఎస్ఎస్ అయితే బీజేపీని వ్యక్తులతో కాకుండా సంస్థాగతంగా బలంగా పునర్నిర్మించాలని చూస్తోంది అని అంటున్నారు. వ్యక్తులతో అయితే దేశంలో మిగిలిన పార్టీలకు బీజేపీకి మధ్య తేడా ఏముంది అన్న మాట కూడా సంఘ్ నుంచి వినిపిస్తోందని చెబుతున్నారు.

నిజంగా మోడీ తప్పుకుంటే కమలానికి దెబ్బ పడడం ఖాయమని అయితే అది తాత్కాలికంగా ఒడుదుడుకులు కలిగించినా దీర్ఘకాలంలో ఒక పార్టీగా సంస్థాగతంగా బీజేపీకి మేలు చేస్తుంది అని అంటున్నారు. ఇప్పుడైతే రాష్ట్రాలలో సైతం చాలా చోట్ల బలమైన నాయకత్వాలు లేకుండా పోయాయని ఆర్ఎస్ఎస్ ఆందోళన చెందుతోంది అని అంటున్నారు. మరి చూడాలి ఏమి జరుగుతుందో.