ఆర్ఎస్ఎస్ ఉదార వాదం...అందరూ హిందువులేనంటూ !
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అంటే వందేళ్ళ చరిత్ర కలిగిన స్వచ్ఛంద సంస్థ.
By: Satya P | 8 Feb 2026 9:49 AM ISTరాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అంటే వందేళ్ళ చరిత్ర కలిగిన స్వచ్ఛంద సంస్థ. స్వాతంత్య్రానికి పూర్వం పుట్టిన సంస్థ.సేవా భావమే తమ విధానం అని ఆర్ఎస్ఎస్ చాటుకుంటూ వస్తోంది.మరో వైపు చూస్తే ఆర్ఎస్ఎస్ మీద గతంలో నిషేధాలు విధించిన సందర్భాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీకి సన్నిహితం అని ఒక వర్గాన్ని భుజానికి ఎత్తుకునే సంస్థ అని ఇలా అనేక రకాలుగా ప్రచారం ఉంది. దానికి తగినట్లుగా అగ్రెస్సివ్ గా ఆర్ఎస్ఎస్ నేతల ప్రకటనలు ఉండేవి.
ఒక్కసారిగా మార్పు :
అయితే ఆర్ఎస్ఎస్ విషయంలో మార్పు బాగా కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాటలలో ప్రసంగాలలో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఆయన గతంలో కూడా అనేక సార్లు అందరి కోసం ఆర్ఎస్ఎస్ అని చెప్పారు. తాజాగా మరోసారి ఆయన నోట అవే మాటలు వచ్చాయి. ముంబైలో తాజాగా జరిగిన ఒక సమావేశంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేయడం విశేషం.
హిందువు అంటే :
ఇక హిందువు అంటే ఎవరు అన్న దానికి కూడా ఆయన ఒక విశాలమైన నిర్వచనం ఇచ్చారు. ఇండియాలో నివసించే ప్రతీ ఒక్కరూ హిందువే అని ఆయన అన్నారు. వారిని అలా సంభోదించవచ్చు అని కూడా చెప్పారు. హిందూ అన్న పదం పేరు కానే కాదని, అది ఒక విశేషణం అని అన్నారు. దాంతో ఆర్ఎస్ఎస్ హిందూత్వం లోని విశాల భావన ఏమిటి అన్నది చీఫ్ గా భగవత్ తేటతెల్లం చేసినట్లు అయింది.
పబ్లిసిటీ అక్కరలేదు :
తమకు ఏ రకమైన అధికారం కానీ పబ్లిసిటీ కానీ అవసరం లేదని మోహన్ భగవత్ అనడం మరో విశేషం. తాము ప్రజల కోసమే పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఇక చూస్తే ఆర్ఎస్ఎస్ సమావేశానికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అంతా హాజరయ్యారు.
సంఘ్ పంధా మీద :
ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ అన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ప్రతీ వేదిక మీద మోహన్ భగవత్ దాన్ని తోసి పుచ్చుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు ఎవరో తమకు అవసరం లేదని ప్రధాని ఎవరిని ఎంపిక చేసుకుంటారో కూడా తమకు సంబంధం లేదని క్లారిటీగా చెప్పేశారు. అలాగే అధికారాలు అవసరం లేదని ఆయన పదే పదే అంటున్నారు. ఆర్ఎస్ఎస్ కి కమలంతో గ్యాప్ ఉంది అన్న ప్రచారం ఒక వైపు ప్రచారం సాగుతోంది. మరో వైపు మోహన్ భగవత్ కూడా సంఘ్ సొంత పంధాతోనే ముందుకు సాగుతుందని ఆచరణాత్మకంగా నిరూపిస్తున్నారు అని అంటున్నారు.
బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ పెద్దల మాటే చెల్లుబాటు అయింది అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా సంఘ్ పెద్ద మాటలు అయితే అంతా హర్షించేలా ఉన్నాయి. రానున్న రోజులలో మోహన్ భగవత్ సంఘ్ ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు అన్న ఆసక్తి కూడా అందరిలో ఉంది. ఏడున్నర పదుల వయసు ఉన్న మోహన్ భగవత్ నిబద్ధత కలిగిన సంఘీయుడుగా పేరు గడించారు. ఆర్ఎస్ఎస్ అందరిదీ అన్న భావన వ్యాప్తి చేయడంలో ఆయన ఉన్నారు, ఉదార వాదమే సంఘ్ విధానంగా కనిపిస్తోంది.
